గాజు గ్లాస్ గుర్తు… ఇక అందరిదీ – ఫ్రీ సింబల్ క్యాటగిరిలో గ్లాస్ !

భారత ఎన్నికల సంఘం ప్రకటన!

J.SURENDER KUMAR,

భారత ఎన్నికల సంఘం  గాజు గ్లాస్ గుర్తు ను  ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. గుర్తింపు కోసం తగినన్ని ఓట్లు, సీట్లు సాధించలేకపోవడం వల్లే ఈసీ పవన్ కల్యాణ్  ప్రారంభించిన  జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ కేటగిరిలో చేర్చినట్లుగా తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో 8పార్టీలు జాతీయ హోదా దక్కించుకోగా  57 స్థానిక పార్టీలకు ప్రాంతీయ హోదా కల్పించింది భారత ఎన్నికల సంఘం. పవన్ కల్యాణ్ స్తాపించిన జనసేన ఈ జాబితాలో లేదు. మరోవైపు 2024ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీకి సిద్దమవుతున్న జనసేనకు ఊహించని షాక్ ఇచ్చినట్లైంది.
ఫ్రీ సింబల్ క్యాటగిరిలో గ్లాస్ !
రాజకీయాల్లో గుర్తింపు దక్కాలంటే ఎన్నికల్లో గెలవాలి. లేదంటే ఓడిపోయినా ప్రజల్లో తగినంత మద్దతును ఓట్ల రూపంలో కూడ గట్టుకోవాలి. అప్పుడే ఆ పార్టీకి ప్రాంతీయ లేదా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. సినీ నటుడు పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి విషయంలో గట్టి షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసిన జనసేనా తగినన్ని ఓట్లు, సీట్లు

Image of a glass of tea in street market

సాధించలేకపోయింది. కేవలం ఒక్కటంటే ఒక్కటే శాసనసభ స్థానం గెలుచుకుంది. దీంతో ఆపార్టీ సింబల్‌ను ఈసీ ఫ్రీ సింబల్ కేటగిరిలో చేర్చింది.
జాతీయ, ప్రాంతీయ పార్టీ గుర్తింపు లేదు..
ఏదైనా రాజకీయ పార్టీ ప్రాంతీయ , జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని లెక్కలను ఫాలో అవుతుంది. గత ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం, గెలుచుకున్న సీట్లను ఆధారంగా చేసుకొనే ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చినట్లుగా తెలుస్తోంది. ఈసీ ప్రకారం ఏపీలో గత శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో జనసేనకు 6శాతం ఓట్లు పడాలి. అలాగే రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలవాలి. ఇవి రెండు జరిగితేనే ఆపార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభించేది. జనసేన పార్టీ గత ఎన్నికల్లో 6శాతం ఓటు శాతం వచ్చినప్పటికి, ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలవడంతో ఫ్రీ సింబల్‌ కేటగిరిలోకి వెళ్లిపోయింది. 25 లోక్‌సభ స్థానాల్లో ఒక్క ఎంపీ సీటు గెలిచినా ప్రాంతీయ పార్టీ హోదా దక్కేది. ఈ పరిస్థితిని చేజార్చుకోవడంతో పవన్ కల్యాణ్‌ పార్టీకి ఇప్పుడు ఇలాంటి షాక్ తగిలింది.
గుంపులో ఒకటి..
రాబోయే ఎన్నికల్లో ఏపీలో అధికార పార్టీని గద్దె దింపడానికి విస్తృతంగా శ్రమిస్తున్న పవన్ కల్యాణ్ ఆశలపై ఈసీ నీళ్లు చల్లినట్లైంది. టీడీపీతో పొత్తు పెట్టుకొని సుమారు 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి కనీసం 10 స్తానాల్లో గెలవాలని కంకణం కట్టుకుంది. కాని ఎన్నికల సంఘం మాత్రం ఈ స్టైల్లో జనసేన పార్టీ ప్రాంతీయ, జాతీయ పార్టీగా గుర్తించకుండా గాజుగ్లాస్ గుర్తును దేశంలో ఉన్న 197కుపైగా ఉన్న చిన్న పార్టీల(గుర్తింపు దక్కని)వాటిలో కలిపేసింది.
ఇప్పటికే వైసీపీ నేతలు, జనసేన పార్టీని టీడీపీని ప్రమోట్ చేసే పార్టీ అని..పవన్ కల్యాణ్‌ని పార్ట్‌టైమ్ పొలిటిషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈసీ నిర్ణయంతో ఈ విమర్శలు మరింత పెంచే అవకాశం లేకపోలేదు. ఈ షాక్‌ నుంచి ఆ పార్టీ  ఎలా బయటపడుతుందో అధికార పార్టీ విమర్శలను ఎలా తిప్పి కొడుతుందో చూడాలి. రాబోయే ఎన్నికల్లో అయినా గాజు గ్లాస్‌ గుర్తు కనీసం రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కించుకునే అన్నీ స్తానాలు గెలుస్తుందో లేదో చూడాలి.