J.Surender Kumar.
” కోనేటిలో స్నానాలు ఇదిగో నర్సన్న, కొబ్బరి బెల్లాలు ఇదిగో నరసన్న! నిన్ను చూడా మేము వస్తిమీ నరసన్న, మమ్ము కాపాడ నీవు ఉంటివి నరసన్న,” అంటూ గోదావరి నదిలో స్నానాలు చేసి తడిబట్టలతో ,పిల్లాపాపలతో భక్తిపారవశ్యంతో, గ్రామీణ భక్తజనం గొంతెత్తి ఆలపిస్తున్న పాటలతో ధర్మపురి క్షేత్రం, ఆలయ ప్రాంగణం, పురవీధులు మారు మోగుతున్నాయి.

ఈనెల 14 నుంచి ప్రారంభమైన జాతర ఉత్సవాలలో గత మూడు రోజులుగా ఈ క్షేత్రం, గోదావరి నది తీరం, భక్తజనంతో పోటెత్తింది. జాతరకు తరలివస్తున్న భక్త జనులు 80% గ్రామీణ రైతాంగం, వ్యవసాయ కూలీలు, గిరిజనులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కార్పొరేట్ కల్చర్ అగుపించడం లేదు, వారు వసతి సౌకర్యాల గురించి పట్టించుకోరు, పైరవీలతో ప్రత్యేక దర్శనం చేసుకునే కొందరి గురించి వారు ప్రశ్నించారు, నిలదీయరు, భక్తి పాటలతో, గంటల తరబడి , క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తజనం, భక్తి ప్రపత్తులు అమోఘం అభినందనీయం.

గోదావరి నది తీరంలో, ఇసుక తిన్నెలపై వెదురు బొంగులతో, గుడారాలు వేసుకొని పిల్లాపాపలతో, నదీతీరంలో నిద్రిస్తూ, అక్కడే వంటలు చేసుకుని తినడం, వారి ఆచార సంప్రదాయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.

తడిబట్టలతో తలపై, బుట్టలో స్వామివారికి నైవేద్యంగా, పప్పు, బెల్లాలు పెట్టుకొని పిల్లాపాపలతో ఆలయం వైపు, పరుగులు తీస్తున్న భక్తజనం తీరు చూపరులకు ఆహాఎంతటి భక్తిపారవశ్యం అనిపించక మానదు. ఇలాంటి సన్నివేశాలు, నదీతీరంలో ఆలయ ప్రాంగణంలో, క్షేత్రంలో కనిపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై రాత్రులు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తజనంను ఆకట్టుకుంటున్నాయి. ఈనెల 14 నుంచి 16 వరకు మూడు రోజులకు గాను ప్రసాదాలు అమ్మకం, టికెట్లు, అన్నదానంద్వారా ,రూపాయలు 13 లక్షల. 96 వేల 184 దేవస్థానంకు ఆదాయం సమకూరింది.

ఏర్పాటు సూపర్ !
పట్టణంలో నదీతీరంలో భక్తులకు సౌకర్యాల కల్పన కై అధికార యంత్రాంగం, మున్సిపల్ శాఖ,ఆలయ అధికారులు, చేపట్టిన ఏర్పాట్లు అభినందించాల్సిందే నిరంతర విద్యుత్తు, నదీతీరంలో స్నానాలు చేసే వాళ్ళు కోసం, భక్తులు వంటలు వండుకోవడానికి, తాగు నీటి, కోసం 4 చోట్ల వాటర్ ట్యాంకర్లు, మహిళా భక్తులు బట్టలు మార్చుకోవడం కోసం ప్రత్యేక షెడ్లను, బాతింగ్ షవర్లు,మొదటిసారిగా మహిళా భక్తులు ప్రకృతి అవసరాలు తీర్చుకోవడం కోసం “బయో టాయిలెట్లు” వాహనాలు,పదుల సంఖ్యలో చలివేంద్రాలు, తాత్కాలిక దుకాణాలు ,కూరగాయలు, వంట చెరుకుల, దుకాణాలు, అంటువ్యాధులు ప్రబలకుండా శానిటేషన్, భక్తులు క్యూలైన్లలో దాహార్తి తీర్చడం కోసం వేలాది మజ్జిగ ప్యాకెట్లు, పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.

దాతల సహకారంతో స్థానిక బ్రాహ్మణ సంఘం భవనంలో లో భక్తజనంకు ఉచిత అన్నదానం ఉదయం 11 గంటలకు నుంచి సాయంత్రం వరకు నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. నీడనిచ్చే చలువ పందిళ్ళు, టెంట్లు, మైక్ అనౌన్స్మెంట్. అంబులెన్స్ సౌకర్యం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. నిత్యం జగిత్యాల నుంచి 174 బస్సు ట్రిప్పులు, రాకపోకలు కొనసాగిస్తుండగా అదనంగా ఆర్మూరు డిపో నుంచి 59 బస్సులు, నిర్మల్ నుంచి 7 జగిత్యాల నుంచి 20 ప్రత్యేక బస్సులను గత మూడు రోజులుగా రాకపోకలు కొనసాగించాయి. కరీంనగర్ ఆర్టీసీ ఆర్ ఎం శ్రీధర్ ,జగిత్యాల్ డిపో మేనేజర్ భవభూతి ,ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు .బస్టాండ్ లో భక్తుల కోసం తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.

పారిశుద్ధ్య పనులు టాప్ !
ధర్మపురి బస్టాండ్ లో, నదీతీరంలో, రాత్రి పగలు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనులు చేస్తున్నారు. వీధులు శుభ్రపరుస్తూ, చెత్తాచెదారం తొలగిస్తూ ప్రత్యేక వాహనల ద్వారా డంప్ యార్డు లకు తరలిస్తున్నారు, నదీతీరంలో జోన్లుగా ఏర్పాటు చేసి పారిశుద్ధ్య సిబ్బందినీ నియమించారు .

రేపు భారీ సంఖ్యలో తరలి రానున్న భక్తజనం !!
రేపు హోలీ పర్వదిన సందర్భంగా స్వామివారి ప్రధాన ఉత్సవాలలో ఒకటైన శ్రీ యోగా నరసింహ స్వామివారి తెప్పోత్సవం, డోలోత్సవం, బ్రహ్మ పుష్కరిణి కోనేటిలో కన్నులపండుగగా జరగనున్నది ,స్వామివారి ఉత్సవ విగ్రహాలను కోనేటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హంసవాహనంపై ఉంచి, నీటిలో 5 ప్రదక్షణాలు నిర్వహిస్తారు, అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను కోనేటి మండపం మధ్య గల ఉయ్యాలలో కూర్చుండబెట్టి ఊరేగి స్తారు. దీనిని తెప్పోత్సవము, డోలోత్సవం,అంటారు .విశాలమైన కోనేటిలో ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తజనం తో కిక్కిరిసి పోతుంది ( స్టేడియం తరహాలో) నలువైపుల మెట్లపై భక్తులు కూర్చుండి చేసే గోవింద నామస్మరణతో మారుమోగుతుంది . స్వామివారి ప్రధాన ఉత్సవాలు కళ్యాణం, తెప్పోత్సవం, స్వామివారి రథోత్సవం, గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వామివారి కళ్యాణం తిలకించడానికి దాదాపు పదివేల మందికి పైగా భక్తజనం క్షేత్రానికి తరలివచ్చారు అనే చర్చ నెలకొంది.
