అడవుల రక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది – కలెక్టర్ జి. రవి

J.Surender Kumar,

జగిత్యాల :-అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక విరుపాక్షి గార్డెన్ లో జిల్లా అటవీ శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా సా మిల్ & టింబర్ డిపో యాజమాన్య అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముందుగా మొక్కలు నాటి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.


ప్రతి మనిషి తన జీవిత కాలంలో 555 మొక్కలు నాటి వాటిని పెంచాలని, అదే మనిషి భవిష్యత్తు తరాలకు అందించే గొప్ప సంపద అని కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం పర్యావరణంలో అనేక మార్పులు వస్తున్నాయని, పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు, కరువు కాటకాలు, మార్చి మాసంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని అన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం భూ భాగంలో కనీసం 33% గ్రీన్ కవర్ ఉండాలని , 2015 సంవత్సరంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభించిన తర్వాత జిల్లాలో కోంత మేర గ్రీన్ కవర్ పెరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కల సంరక్షణ పెంపకంపై ప్రజల్లో అవగాహన పెరిగిందని అన్నారు.

జిల్లాలో అటవీ పునరుద్ధరణ కింద అటవీ భూముల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నామని తెలిపారు. హరితహారం కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, మండల కేంద్రాల్లో మెగా పార్కులు, అర్బన్ పార్క్ ల ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.తక్కువ భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ ద్వారా మొక్కల పెంపకం చేస్తున్నామని అన్నారు. జగిత్యాల లోని టిఆర్ నగర్ లో యాదాద్రి మోడల్ లో రూపొందించిన అర్బన్ ఫారెస్ట్ బాగుందని, టూరిస్టులు వచ్చే విధంగా రూపొందించారని అటవీ అధికారులను కలెక్టర్ అభినందించారు. హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని, మన ఇంటి, షాపు ముందు అవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కలకు మనం బాధ్యత తీసుకోని సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతలో భాగంగా అటవీశాఖ, సా మిల్ & టింబర్ డిపో , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. రక్తదానం చాలా మంచి విషయం అని, రక్త దానం పై సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయని, రక్తదానం చేసే వారు వీటిని తొలగించే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు.జిల్లాలో అనుమతి లేకుండా అక్రమంగా వ్యాపారం చేసే సా మిల్ టింబర్ డిపో పై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సీఎస్ఆర్ నిధుల కింద సా మిల్ టింబర్ డిపో యజమానులు ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని మొక్కల సంరక్షణకు పూర్తి బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.


కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత తన కోసం మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచాలని తెలిపారు. కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న పట్టణాల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వీలైన ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పెంపొందించి , జగిత్యాల పట్టణంలో 6% గ్రీన్ కవర్ పెంచామని ఆమె అన్నారు. రక్త దాన శిబిరంలో అటవీ శాఖ సిబ్బంది, అధికారులు, సా మిల్ & టింబర్ డిపో సిబ్బంది యజమానులు దాదాపు 100 యూనిట్ల రక్త దానం చేశారు
అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్. లత, జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్.డి.ఓ. మాధురి, ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు, జిల్లా సా మిల్ & టింబర్ డిపో ప్రతినిధులు, సంబంధిత అటవీ శాఖ అధికారులు, స్థానిక కౌన్సిలర్, రక్త దాతలు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.