దేవుడి తో ” ఫ్రెండ్లీ పోలీసింగ్”

J.Surender Kumar

కొన్ని పోలీస్ స్టేషన్లో లాఠీలతో “లా” చెప్పే ఈ రోజుల్లో ఆ శాఖ సంస్కరణల్లో భాగంగా ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ పోలీసులు లాఠీలు, వదిలి సాంప్రదాయ దుస్తులు ధరించి, భక్తిప్రపత్తులతో, కుటుంబ సభ్యులతో కలసి పోలీస్ స్టేషన్లో చేతులు జోడించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేసి తాము దేవుడి తోనూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తున్నామని సమాజం కు చూపించారు.

నేరాలు,ఘోరాలు , జరగకుండా నేర రహిత సమాజం కొనసాగేలా కరుణించు స్వామి అంటూ వారు స్వామి వారిని వేడుకొన్న అపురూప దృశ్యం ధర్మపురి పోలీస్ స్టేషన్ లో ఆదివారం సాయంత్రం కన్నుల పండవగా జరిగింది.
ధర్మపురి జాతర ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, దక్షిణ దిగ్వ యాత్ర గా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి నేరాలు, ఘోరాలు ,రికార్డులను తనిఖీ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం సాంప్రదాయం,

ఈ నేపథ్యంలో స్వామివారు మందీ మార్బలం,అర్చకులు, వేద పండితుల తో, స్టేషన్ కు తరలి వెళ్లారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణం అందంగా పూలతో, మామిడి తోరణాలు కట్టి నేలపై కార్పెట్ పరిచి పూల చల్లి స్వామివారు ఆశీనులై వేదికను అందంగా అలంకరించారు.

పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో, సంప్రదాయ దుస్తులు ధరించి మంగళ హారతులు భక్తిప్రపత్తులతో స్వామివారినీ పోలీస్ స్టేషన్ లోకి స్వాగతించారు. సుగంధ ద్రవ్యాలు, పూజా సామాగ్రి ,అగరవత్తులు, వెలిగించి కొబ్బరికాయలు కొట్టి, తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమానికి ముందుగా పోలీస్ అధికారులు,పోలీసులు, సాంప్రదాయ దుస్తులు ధరించి, మంగళ వాయిద్యాలు, మేళతాళాల తో, ఆలయం కు వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆహ్వానించారు.

స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా విచిత్ర వేషధారణలతో, ఒగ్గు డోలు, కళా విన్యాసాలతో, డిజె సౌండ్ పాటలతో నృత్యాలు, చేస్తూ స్వామి వారిని ఊరేగింపుగా భుజాలపై మోస్తూ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చారు. పోలీస్ స్టేషన్ వాకిట, పోలీస్ కుటుంబ సభ్యులు మంగళ హారతులతో స్వామి వారిని ఆహ్వానించారు.

స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సత్యమ్మ, మంత్రి ఈశ్వర్, సతీమణి స్నేహలత, కౌన్సిలర్లు, కమిషనర్ రమేష్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రామయ్య, కమిటీ సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు, అడిషనల్ ఎస్పీ చెన్నూరి రూపేష్ కుమార్. జగిత్యాల ,మెట్పెల్లి డీఎస్పీలు ప్రకాష్, రవీందర్ రెడ్డి, స్థానిక సిఐ కోటేశ్వర్, ఎస్సై కిరణ్, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ ,అర్చకులు, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, భారీ సంఖ్యలో భక్తజనం పోలీసులు, హోంగార్డులు, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.