అనుమతులు జారీ చేయాలి- ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా

జిల్లాలో 15 రోజుల్లో మన ఊరు మన బడి కార్యక్రమ పరిపాలన అనుమతులు జారీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.మన ఊరు మన బడి కార్యక్రమం గ్రౌండింగ్ అంశం పై శుక్రవారం జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ,ఆయన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ దేవసేన, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన 12 మౌలిక వసతులు కల్పిస్తూ ప్రైవేటుకు ధీటుగా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రూపొందించారని ఆయన తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించి సాఫ్టువేర్ తయారయిందని, సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు, పాఠశాలలకు లాగిన్ లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. మన ఊరు మన బడి కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ వినియోగించడానికి జిల్లాకు 3 అధికారులకు శిక్షణ అందించామని ఆయన తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన 12 అంశాలలో గ్రీన్ చాక్ బోర్డ్ ,విద్యార్థులకు సిబ్బందికి అవసరమైన ఫర్నిచర్, డిజిటల్ ల్యాబ్ సామాగ్రి, పెయింటింగ్ రాష్ట్ర స్థాయిలో సేకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో టాయిలెట్ ,కిచెన్ షెడ్డు , కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను ఉపాధిహామీ కింద ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్లు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. మిగిలిన 5 అంశాలైన త్రాగు నీరు విద్యుదీకరణ డైనింగ్ హాల్ నిర్మాణం ,నూతన తరగతుల నిర్మాణం, పాఠశాల గదుల మరమ్మత్తులు మొదలైన పనులు సాఫ్ట్వేర్ వినియోగించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.ప్రతి మండలానికి మన ఊరు మన బడి కార్యక్రమం కోసం జిల్లా అధికారి ని ప్రత్యేకంగా నియమించాలని ఆయన కలెక్టర్లకు సూచించారు.

అనవసర వ్యయం చేయకుండా న్యాయబద్ధంగా ప్రతిపాదనలు ఉండాలని ఆయన తెలిపారు. పకడ్బందీగా ప్రతిపాదనలు రూపొందించాలని, కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లు చురుకైన పాత్ర పోషించాలని ఆయన కోరారు. ప్రత్యేక అధికారులు మండలంలో ప్రతి పాఠశాలను తనిఖీ చేసి రూపొందించిన ప్రతిపాదనలను సర్టిఫై చేయాలని ఆయన ఆదేశించారు. పాఠశాల సివిల్ నిర్మాణ పనుల ప్రతిపాదనలు 30 లక్షల వరకు పాఠశాల నిర్వహణ కమిటీ చే నామినేటెడ్ పద్ధతిలో పనులు కేటాయించాలని, ఆ పై ఖర్చు జరిగే పాఠశాలల కోసం టెండర్లు పిలవాలని ఆయన అధికారులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టాయిలెట్ నిర్మాణం త్రాగునీరు మొదలైన పనులు చేపట్టాలని ఆయన సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వం రూపొందించిన 8 అంశాల పై మాత్రమే కలెక్టర్లు పరిపాలన అనుమతులు జారీ చేయాలని ఆయన పేర్కొన్నారు.
5 రోజులలో ప్రతి మండలంలో కనీసం 2 పాఠశాలలో మన ఊరు మన బడి పనులు గ్రౌండింగ్ చేయాలని , మన ఊరు మన బడి లో ప్రారంభమయ్యాయనే సందేశం గట్టిగా వెళ్లాలని ,స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు , పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా మంత్రి గారికి సమాచారం అందించి వారి సమయం తీసుకుని పనులు గ్రౌండింగ్ చేయాలని ఆయన సూచించారు. పనులు ప్రారంభమయ్యే పాఠశాలలకు కలెక్టర్ల పరిమితి మేరకు అంచనాల్లో 15% వరకు పాఠశాలలకు నిధులు విడుదల చేయవచ్చని ఆయన తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద ప్రతి జిల్లా కలెక్టర్ రూ.2 కోట్ల నిధులు విడుదల చేశామని ఆయన తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద రూపొందించే ప్రతిపాదనలు అసాధారణంగా అనిపిస్తే వెంటనే కలెక్టరు సదరు పాఠశాలను సందర్శించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం అమలు పై జిల్లాలో విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని, ప్రజల వద్దకు చేరే విధంగా విస్తృత ప్రచారం కై చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం జిల్లాలో ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియం బోధనపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్లు పరిశీలించాలని, ఉపాధ్యాయుల అటెండెన్స్ గమనించాలని శిక్షణా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీదేవసేన కలెక్టర్లకు సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్రెడ్డి ,ఈఈ ఆర్&బి శ్రీనివాస్, ఈ.ఈ. పంచాయతీరాజ్ రహమాన్, సంబంధిత అధికారులు ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.


చైర్ పర్సన్ సందర్శన
ధర్మపురి పట్టణంలో కొనసాగుతున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతులను మున్సిపల్ చైర్ పర్సన్ సంఘ సత్యము శుక్రవారం సందర్శించారు. ఉపాధ్యాయుల్లో ఆంగ్లమాధ్యమ బోధనా సామర్థ్యాన్ని పెంపొందించడానికి విద్యాశాఖ ధర్మపురి బాలికల ఉన్నత పాఠశాల్లో నిర్వహిస్తున్న ఆంగ్ల భాషాభివృద్ధి శిక్షణా ఉపాధ్యాయులతో మాట్లాడారు . వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు చక్కటి విద్యను అందించడం ద్వార విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని ఆమె కోరారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెరుకు రాజన్న పాల్గొన్నారు .