ప్రశాంత్ కిషోర్- సర్వే ఫార్ములా ఇలా కావచ్చు?

J.Surender Kumar,

దేశంలో ట్రెండింగ్ లో ఉన్న రాజకీయ వ్యూహకర్త, ప్రముఖ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ , (ఐప్యాక్) సంస్థ సర్వే పక్కాగా నిర్వహించడంలో దిట్ట. కార్యాచరణ ప్రణాళిక, నిర్దేశించుకున్న ఎజెండా, మేరకు ఆదరాబాదరాగా సర్వే చేపట్టకుండా , జరిగిన సంఘటనలు, సందర్భాలను నిశితంగా పరిశీలించి, ప్రత్యేక అజెండాను రూపొందించుకొని, ఏ సమయంలో ఈ అంశాలు చర్చనీయాంశంగా మార్చాలి, ఓటర్ల మైండ్ సెట్ కు అనుగుణంగా మేనిఫెస్టో సిద్ధం చేయడంలో ఆయనకు ప్రస్తుతం సాటి లేరు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఐప్యాక్ సంస్థతో పనిచేసిన అనుభవం తో ఓ సాంకేతిక విద్యావేత్త మాటల సందర్భంలో వివరించారు.
సర్వే లో మూడు అంచెలు !!


1) తాము చేపట్టనున్న సర్వే రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు, ఐప్యాక్ సంస్థకు చెందిన ఒక్కొక్క.ఉద్యోగి నియామకం చేపడతాడు. ఒక్కరు చొప్పున 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 17 పార్లమెంట్ స్థానాలకు కలిపి ఐప్యాక్ సంస్థకు చెందిన 136 మంది కొన్ని నెలల క్రితమే నియామకం జరిగినట్టు సమాచారం,. వీరు పోలీసులు నిఘా వర్గాలు ఉన్నతాధికారులతో సంక్షేమ పథకాల అమలు , లబ్ధిదారుల వివరాలు గ్రామాల వారీగా, వార్డుల వారీగా నివేదికలు సిద్ధం చేస్తుంటారు . అసెంబ్లీ సెగ్మెంట్ నైసర్గిక ,భౌగోళిక దుస్థితి గ్రామాల వారీగా ఓట్ల వివరాలు, సిద్ధం చేసుకుంటారు అని సమాచారం. సర్వే ఆరంభానికి ఆరు నెలల ముందు జరిగిన వివిధ సంచనల సంఘటనపై ఈ సెగ్మెంట్లో ఫేస్బుక్ వాట్సాప్ లలో ఆయా సామాజిక వర్గాల యువత స్పందించిన తీరు, మెజార్టీ సామాజిక వర్గం తదితర వివరాలను వారు నిక్షిప్తం చేస్తారని సమాచారం.
2) కుల సంఘాల సభలు, సమావేశాలు, పెళ్లిళ్లు, కుల పంచాయతీలు , ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమస్యలు, వారు చేపట్టిన ధర్నాలు ఆందోళనలు, వివరాలు ఈ వర్గంలో కొందరితో స్నేహపూర్వకంగా నియోజక వర్గ పరిధికి చెందిన ఐప్యాక్ ఉద్యోగి సేకరిస్తాడు.( డైరెక్టర్ గా ఉండదు ) కుల సంఘాలలో బలమైన సామాజిక వర్గం చెందిన యువత, ఉద్యోగ వర్గాలు చాట్ చేసిన వాట్స్అప్ గ్రూపులలో పోస్టులు, ఫేస్బుక్ ట్విట్టర్ తో పాటు ఈ సంఘాల నాయకులు వ్యక్తిత్వం వారికి ఆ సంఘాలలో ఉన్న బలం, బలహీనతలను నిశితంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తుంటారు.
3) ఆయా నియోజకవర్గాలలో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో పాటు, చిన్నాచితక పార్టీల అభిమానులు, సానుభూతిపరుల తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ఆయా పార్టీలలో అసమ్మతి, గ్రూపులు, నాయకుడికి వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం, వివరాలు మీరు తెలుసుకొని నివేదిక సిద్ధం చేసుకుంటారు.
సంఘటనలపై వెంటనే నివేదికలు సిద్ధం చేయరు !
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై, సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలు, బిజెపి పార్టీ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన ఆరోపణలు, వడ్లు కొనుగోలు అంశం, వేలాది ఉద్యోగ ప్రకటన తదితర అంశాలపై ఐ ప్యాక్ ఉద్యోగులు వెంటనే స్పందించి నివేదికలు ఇవ్వరు.. కొన్ని నెలలు సమయం తీసుకొని ఈ అంశాలపై సమాజం లో ఎలాంటి చర్చ జరుగుతుంది ఎలా స్పందిస్తున్నారు ఈ అంశాల పట్ల ప్రశంసలు వినిపిస్తున్నాయా? విమర్శలు వినిపిస్తున్నాయా ? ఆయా సామాజిక వర్గలు ప్రతిస్పందిస్తున్న తీరుతెన్నులు, నిశితంగా పరిశీలిస్తుంటారు. నియోజకవర్గంలోని వివిధ అంశాలు, సంఘటనలు, సెగ్మెంట్లో లో వివిధ వర్గాలను 100 నుంచి 150 విభాగాలుగా విభజించి. ఓటర్లు, ప్రజానీకం ఆశిస్తున్న ది ఏమిటి ? అమలు జరుగుతున్నది ఏమిటి? అనే అంశాలపై నివేదిక సిద్ధం చేసుకుంటారు. ఉదాహరణ కు బోధన్ సంఘటన, మంత్రి పై హత్యాయత్నం కుట్ర , రాజ్యాంగ సవరణ, జీయర్ స్వామి అంశం యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం తదితర అంశాల పై వెంటనే రెస్పాండ్ కాకుండా. కొన్ని రోజులు వేచి ఉండి ఆయా సంఘటనల్లో ప్రజానీకం అభినందించిన అంశం, ఆశించింది ఏమిటి ? ప్రతిస్పందించింది? విమర్శించింది ఏమిటి? అనే అంశాల పై నిశితంగా రోజుల తరబడి అధ్యయనం చేసి అందులో మెజార్టీ సమాజం ఆశిస్తున్నది ఏమిటి.? తిరస్కరిస్తున్నది ఏమిటి ? అనే సాంకేతిక ఇన్పుట్ సమాచారం సేకరించి ఓ ప్రత్యేక ఎజెండాను వారు సిద్ధం చేసుకుంటారు. ( ఇందులో యువత, మహిళలు, సామాజిక వర్గం, ఉద్యోగ ఉపాధ్యాయ, ప్రతిపక్ష నాయకుల,వివరాలను. అభిప్రాయాలను, రోజుల తరబడి చర్చించి రోడ్ మ్యాప్ ను ఐప్యాక్ సంస్థ సిద్ధం చేసుకుంటుంది)


బడ్జెట్ ను బట్టి డైవర్షన్ సమయం!!
ఢిల్లీలో ఆప్ అధినేత క్రేజీవాల్ కోసం గతంలో ఢిల్లీ నగరాన్ని దాదాపు 250 విభాగాలుగా విభజించి 6 నెలలు ముందుగానే ” అరవింద్ క్రేజీవాల్ దశ గ్యారెంటీ ” అనే లే నినాదంతో 10 అంశాల మ్యానిఫెస్టోను ఆయా ప్రాంతాల ఓటర్లలో విస్తృతంగా ప్రచారం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతరం.” జగనన్న నవరత్నాలు ” సింగిల్ పేజీ మేనిఫెస్టోను, ప్రకటించారు, ఓటర్ల అటెన్షన్ డైవర్ట్ చేస్తూ వీటి అమలు సాధ్యాసాధ్యాలపై చర్చ జరిగేలా చేస్తారు తప్ప, నిధుల కేటాయింపు, విధుల తీరుతెన్నులు , అంశం చర్చ జరగకుండా జాగ్రత్త పడతారు. ఓకే సామాజిక వర్గంలో వివిధ వర్గాల అంశంలో మెజార్టీ ఓటర్లు కలిగి ఉన్నవారికి అనుకూలంగా ఓ ప్రయోజనం గల హామీని వీరే లీక్ చేస్తారు . మెజార్టీ ఓటర్లు అనుకూలం కాగా 30 శాతం ఉన్న మరో వర్గం లో పది ఇరవై శాతం ఓట్లు అటూ ఇటూ అయినా ఇబ్బందిలేకుండా చూసుకుంటారు. (ఆదివాసీ, వర్గీకరణ, లాంటి అంశాలు కావచ్చు ) ఆయా పార్టీలు సర్వే కోసం వీరికి కేటాయించిన మొత్తం ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ప్రకటనకు 200 రోజులు, 100 రోజులు (బడ్జెట్ ను బట్టి) 50 రోజుల ముందు సమాజంలో చర్చనీయాంశ చర్చ, మాటలు, వివాదాస్పద అంశాలు,పరోక్షంగా వీరి నుంచే విడుదల చేస్తారు. ఈ అంశంల పై. యాభై రోజుల పాటు చర్చ కొనసాగుతుంది. చర్చలో అనుకూల, ప్రతికూల ,అంశాలను ఫీడ్ బ్యాక్ మెకానిజం ను తీసుకునీ ఎజెండా రూపొందించుకుంటురు. మరో 50 రోజులు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, అసందర్భంగా, పరోక్షంగా అనామకుడి పేరుతో , వాట్సప్, ఫేస్బుక్ లో వివాదస్పదమైన, సత్యదూరమైన ప్రకటన, ఓ సంఘటనను ,అంశాలను, ప్రచారం చేస్తారు, ఈ అంశంల పై జరిగే చర్చ ను ప్రయోగశాలలో పరిశోధించిన ట్టు ఇన్పుట్ సమాచారాన్ని నిక్షిప్తం చేసి ఎజెండా లో సమయానుకూలంగా అమలు చేస్తారని విద్యావేత్తల విశ్లేషణ.
ప్రశాంత్ కిషోర్ గూర్చి….

బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్, ప్రస్తుతం దేశంలో ట్రెండింగ్ లో కొనసాగుతున్న రాజకీయ వ్యూహకర్త. రాజకీయ ఎత్తులు, చిత్తులు రచించడంలో… ఆయన స్నేహితుడు రాబిన్ శర్మ, ఆయన దగ్గరే పనిచేసిన సునీల్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నప్పటికీ… ప్రతిపక్ష క్యాంపులకు వారు పనిచేస్తున్నప్పటికీ… పీకే, పేరే రాజకీయ వ్యూహకర్తగా ఇప్పటికైతే పాప్యులర్ నేమ్! ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని, తిరిగి గుజరాత్ సీఎం చేయడం కోసం 2011లో పీకే వ్యూహాలు ఫలించిన చరిత్ర తెలిసిందే! 2014 లో జనరల్ ఎన్నికల్లో నరేంద్ర మోడీని, ప్రధానిగా ప్రొజెక్ట్ చేయడంలోనూ ఐప్యాక్ గా పిల్చుకునే ఆయన బృందం( ఇండియన్ పొల్టికల్ యాక్షన్ కమిటీ) లక్ష్యాన్ని సాధించిన సంగతీ విదితమే!! 2015లో బీహార్ లో జేడీయూ వెనుకా.. 2017లో పంజాబ్ లో కాంగ్రెస్ వెనుకా.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ వెనుకా.. 2020 ఢిల్లీలో ఆప్ వెనుకా.. 2021 పశ్చిమబెంగాల్లో తృణ మూల్ కాంగ్రెస్ వెనుకా.. 2021లో తమిళనాడులో డీఎంకే వెనుకా.. ప్రభుత్వాలేర్పాటు చేయడంలో ఐప్యాక్ ది కీలక భూమిక! ఆయా పార్టీలతో కుదిరిన ఒప్పందాల మేరకు… కొన్ని పార్టీలను చాలా ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడంలో పీకే టీమ్ కృతకృత్యులై ఉండొచ్చుగాక! కానీ, 2017 లో ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో మాత్రం ఐప్యాక్ బొక్కబోర్లాపడింది. కాంగ్రెస్ పార్టీకి పీకే ఐప్యాక్ సర్వే మాత్రం ఉపయోగపడలేదు సరికదా.. బీజేపికి 300 స్థానాలను అక్కడి ప్రజలు కట్టబెడితే… కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ స్థానాలు కూడా దాటని ,దక్కని ఓటమి చరిత్రా ఐప్యాక్ దేనన్నది గమనించాల్సిన మరో ప్రధానాంశం! తమ ఐప్యాక్ పక్షాన సర్వే చేస్తే.. తాము ఏ పార్టీకైతే వ్యూహకర్తలుగా ఉంటామో.. ఆ పార్టీలు అధికారం హస్తగతం చేసుకోవడం తథ్యమంటూ, ప్రశాంత్ కిషోర్ అనేక సందర్భాల్లో బహిరంగంగా … ప్రసార మాధ్యమాల ద్వారా ఢంకా భజాయించిన సంగతీ ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే!!
అయితే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పక్షాన తాము సర్వే చేస్తున్నామని, నేటి వరకూ కూడా ఐప్యాక్ ఎక్కడా ప్రకటించలేదు. సీఎం కె.సి.ఆర్ మాత్రం పాత్రికేయుల సమావేశంలో ప్రశాంత్ కిషోర్ నా బెస్ట్ ఫ్రెండ్ 7 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఆయన జాతీయ రాజకీయాల అంశంపై సర్వే చేస్తున్నది వాస్తవం అంటూ స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ పరిధిలో అభివృద్ధి పనులు, రిజర్వాయర్లు, సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి పీకే పర్యటించి, పరిశీలించిన ఫోటోలు, ప్రసార మాధ్యమాలు అగుపించాయి. కావాలనే ఇలాంటి ఫోటోలు ఐ ప్యాక్ సంస్థ రహస్య పర్యటన అంటూ లీక్ చేసింది. అనే చర్చ రాజకీయ పార్టీలలో జరుగుతున్నది. గత రెండు మూడు రోజులుగా ప్రచార మాధ్యమాల్లో ఐప్యాక్ సంస్థ జారీ చేసిన ప్రకటన సారాంశం పరిశీలిస్తే…” రాష్ట్రమంతా ఐప్యాక్ తో కలిసి రాజకీయ ప్రచార అనుభవం పొందండి, మరియు ప్రచారాన్ని నడిపించండి, అట్టడుగు స్థాయి ప్రచారంలో భాగస్వామ్యం కావడానికి, ఐప్యాక్ తో కనెక్ట్ అవ్వండి” అనే ఇంగ్లీష్, తెలుగు భాష లో జరుగుతున్న ప్రచారం దేనికి సంకేతం? అనే చర్చ కొనసాగుతుంది. ప్రతి మండలం నుంచి కనీసం 10 మందిని ఎంపిక చేసి వారితో సర్వే చేయిస్తారా? లేక మండల రాజకీయ స్థితిగతులను వారి నుంచి సేకరిస్తారా ?అనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా కొనసాగుతుంది.


మన రాష్ట్రం విషయంలోకి వస్తే ఇక్కడి ప్రజానీకం లో
1) రాజకీయ చైతన్యం..2) ఆత్మాభిమానం, 3) ఆదిపత్యాన్ని ఎదిరించడం, 4) ప్రలోభాలకు లొంగరు, అనేది జగమెరిగిన సత్యం. ఎన్నికలలో రెండు, మూడు నెలల సమయంలో ఓటర్లు ప్రభావితం అవుతారని కొన్నిసార్లు సర్వేలు అంచనా వేయడం మామూలు. ఎన్నికల్లో కొన్ని పరిస్థితులు మొత్తంగా మారుస్తాయి. ప్రశాంత్ కిషోర్, సీఎం కేసీఆర్ వారి వారి రంగాల్లో ఉద్దండ పిండాలు. గత కొన్ని సంవత్సరాలుగా కెసిఆర్, కనుసన్నల్లో పార్టీ లీడర్లు, క్యాడర్ కొనసాగుతుండగా, ప్రశాంత్ కిషోర్ ఇచ్చే సలహాలు సూచనలు పార్టీ అమలు చేస్తుందా? అనేది ప్రశ్న? ” ఉష్ణం ఉష్ణేన శీతలం” గా పరిస్థితులు మారవచ్చు కాబోలు!!