రాజకీయ, వార్, యుద్ధ తంత్రంలో .. కోవర్ట్ ఆపరేషన్లు !!

కోవర్ట్ ఆపరేషన్… ఇప్పుడీ పదం దేశంలోని రాజకీయ పార్టీలన్నింటిలో సర్వసాధారణంగా వినిపిస్తున్న ఓ నానుడి. మూడు దశాబ్దాల క్రితం వారు నక్సలైట్లను నక్సలిజం ,నేరివేయడానికి పోలీసులు… పోలీసులనేరివేసే క్రమంలో తీవ్రవాదులు.. ఇన్ఫార్మర్ల వ్యవస్థ ద్వారా చేసిన కోవర్ట్ ఆపరేషన్ ఇప్పుడు రాజకీయాల్లోనూ తిష్ఠ వేసింది. ప్రత్యర్థిని దెబ్బ తీయాలంటే… ముందుగా ఆ ప్రత్యర్థి వ్యూహాలేంటో తెలుసుకోవాలి. అందుకక్కడ తమ మనుషులనే వారుంటేనేగానీ సాధ్యపడదు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిన కోవర్ట్ ఆపరేషన్… ఇప్పుడు రాజకీయ క్రీడలో ఓ ప్రధాన భూమికైంది. తెలుగు రాష్ట్రాల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడీ ఎత్తుగడలతో ముందుకెళ్తున్నట్టు ఈమధ్య చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తుండగా… గతంలో తెలుగుదేశం పార్టీతో పాటు… చోటామోటా పార్టీలు కూడా ఈ రాజకీయ క్రీడలో భాగస్వాములైనవే!!

అసలు కోవర్ట్ ఆపరేషన్ అంటే… ?

శత్రుదేశాలతో యుద్ధాలు జరుగుతున్నప్పుడు సైనికులను, సైనిక అధికారులను, ఆ దేశ రక్షణ విభాగంలో కీలక బాధ్యులను మచ్చిక చేసుకుని.. వారి సైనిక రహస్యాలు, ఎత్తులు తెలుసుకుని ప్రత్యర్థి దేశంపై విజయం సాధించే ప్రక్రియనే కోవర్ట్ ఆపరేషన్ అంటామని.. శతాబ్దాల కాలం నుంచీ ఈ ప్రక్రియ ఏ విధంగా నడుస్తుందో కూడా చరిత్రకారుల పలు పుస్తకాలు తేటతేల్లం చేసినదే!!

ఉత్తర తెలంగాణలో ఊపిరి పోసుకుని!!

దాదాపు 1990 ప్రాంతంలో ఉత్తర తెలంగాణ జిల్లాలో పీపుల్స్ వార్ నక్సలైట్లకు.. పోలీసులకు మధ్య నువ్వా.. నేనా అన్న తరహాలో యుద్ధ వాతావరణం నెలకొని ఉండేది. ఏ క్షణం ఎక్కడ మందుపాతరలు పేలుతాయో.. ఏ పోలీస్ స్టేషన్ పై దాడి జరుగుతుందో.. ఏ అటవీ ప్రాంతంలో, ఏ బస్టాండ్ లో ఎదురు కాల్పులు జరుగుతాయో కూడా తెలియని ఓ అనిశ్చితి. అలాంటి సమయంలో పీపుల్స్ వార్ నక్సలైట్లైన హుజురాబాద్ దళ నాయకుడు భూపతి ఉరఫ్ కోడిపుంజు ఎల్లయ్యతో పాటు… మరో నలుగురు దళ నాయకులు హుస్నాబాద్ ప్రాంతంలో చంపబడి గోనె సంచుల్లో ఉన్న వారి శవాలను పోలీసులు గుర్తించారు. ఇదే దళంలో కొనసాగుతున్న డిప్యూటీ కమాండర్ కత్తుల సమ్మయ్య మాత్రం మరణించిన వారిలో లేనట్టుగా పోలీస్ వర్గాలు నాడు వెల్లడించడంతో కోవర్ట్ ఆపరేషన్ అనే అనుమానానికి ఆస్కారం ఏర్పడింది. దళంలో అంతర్గత వివాదాలతోనే ఒకరినొకరు నక్సల్స్ కాల్చుకుని చంపుకుని ఉండవచ్చునన్నది అప్పుడు పోలీసులు చెప్పిన కథనం. పోలీసులే… కుట్రపన్ని తమ దళాన్ని అంతం చేశారని… అందుకు దళ నాయకుడు, డిప్యూటీ కమాండరైన కత్తుల సమ్మయ్యను పోలీసులు సూత్రధారిగా ఎంచుకుని కోవర్ట్ ఆపరేషన్ చేశారన్నది అందుకు భిన్నంగా నాటి పీపుల్స్ వార్ నక్సల్స్ వాదన. నాడు ఈ హత్యల ఉదంతంపై… తమపైనే ఆరోపణలు చేయడం హాస్యాస్పదమంటూ నాటి జిల్లా ఎస్పీ తుషార్ ఆదిత్య త్రిపాఠి కూడా మరో ప్రకటన జారీ చేయడంతో ఓవైపు పోలీసులు, మరోవైపు నక్సల్స్ చేసిన భిన్న ప్రకటనలు జనాన్ని కొంత అయోమయానికి కూడా గురిచేశాయి.

కోవర్ట్ ఆపరేషన్లు జరిగిన తీరు మచ్చుకు..

పీపుల్స్ వార్ జిల్లా కార్యదర్శి విజయ్ హత్య కేసులో జడల నాగరాజు పేరు.. అలాగే IPSఅధికారి వ్యాస్ హత్య కేసు నిందితుల్లో ఒకరైన నయీం పేరు, వార్ రాష్ట్ర కార్యదర్శి చిన్నన్నపై పావురాలగుట్ట వద్ద కాల్పులు జరిపిన సోమ్లానాయక్ పేరు, కిష్టంపేట వద్ద దళంపై కాల్పులు జరిపి తుపాకులెత్తుకెళ్లిన తిరుమలేష్ పేరు… కొయ్యూరులో జరిగిన వార్ కేంద్రకమిటీ సభ్యులు నల్లాఆదిరెడ్డి , శీలం నరేష్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిల ఎన్ కౌంటర్ కు బెంగళూరులోని డెన్ కీపర్ గోవిందరెడ్డి పేరు… ఇలా వీరందరూ కోవర్టులుగా పనిచేశారన్న వార్తలు వెల్లువెత్తాయి. ఈ కోవర్టుల్లో ఒకరు పోలీస్ కాల్పుల్లో మృతి చెందగా… మరొకరు విమాన ప్రమాదంలో మృతి చెందినట్టు.. అలాగే మరొకరు జనం చేతిలో హతమైనట్లు.. ఇంకొకరు విదేశాలకు పారిపోయినట్టు… మరొకరు అదృశ్యమైనట్టు ఇలా చర్చోపచర్చలకు నాటి కోవర్ట్ ఆపరేషన్లు తెరతీశాయి.

అదే కోవర్ట్ ఆపరేషన్ సంస్కృతి… ఇప్పుడు రాజకీయ పార్టీల్లోనూ!!

మాజీ మంత్రి, ప్రస్తుత BJPఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎపిసోడ్లో హుజురాబాద్ ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే.. అదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు కౌశిక్ రెడ్డి తన అనుచర వర్గంతో టీఆర్ఎస్ పార్టీలో తనకు మంచి భవిష్యత్తుందని.. అందుకు మీరంతా సహకరించాలని.. తనతో కలిసి రావాలంటూ తన అనుచరులతో మాట్లాడిన ఆడియో వెలుగు చూడడంతో… అప్పటికే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తో ఏ స్థాయిలో సంబంధాలు నెరుపుతున్నాడోనన్న చర్చకు దారితీసింది. దానికి కౌంటర్ గా పీసీసి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి… పార్టీలో కొందరు కోవర్టులున్నారని… తాము వారిపై బహిష్కరణ వేటు వేయకముందే పార్టీని విడిచి వెళ్లాలని కూడా ప్రకటనలు గుప్పించిన పరిస్థితి… తెలుగునాట కోవర్ట్ రాజకీయాల డ్రామా ఏవిధంగా కొనసాగుతుందో కళ్లకుగట్టేదే!

అధికార టీఆర్ఎస్ పార్టీలోనూ!!.

హుజురాబాద్ ఎన్నికల ఎపిసోడ్ అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కోవర్ట్ రాజకీయాలు తెరపైకొచ్చాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలోనే కోవర్టులున్నారనే చర్చకూ తెరలేచింది. టిఆర్ఎస్ తిరుగుబాటు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మేయర్ రవీందర్ సింగ్ పోటీ… టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా… ఆ తర్వాత టిఆర్ఎస్ అధినేతతో పాటు, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు చేయడం… సీఎం కేసీఆర్ కు అసలే మింగుడుపడని బీజేపి, కాంగ్రెస్ నాయకుల వద్దకు రవీందర్ సింగ్ కాళ్లరిగేలా తిరిగి మద్దతు కోరడం… అనూహ్యంగా 230కి పైగా ఓట్లు సాధించడంతో… కరీంనగర్ వేదికగా అధికార టీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత రాజకీయ డ్రామా రక్తి కట్టింది. అయితే… ఫలితాలు వెలువడిన 48 గంటల్లోనే రవీందర్ సింగ్.. తిరిగి సీఎం కేసీఆర్ ను కలవడం ఆ మొత్తం పొల్టికల్ డ్రామాలో మరో ట్విస్ట్. దాంతో… రవీందర్ సింగ్ తో అధికార టీఆర్ఎస్… కావాలనే కోవర్టు ఆపరేషన్ చేయించిందా.. ? సింగ్.. కేసీఆర్ విడిచిన బాణమా..? అనే కొత్త చర్చకు మళ్లీ తెరలేచింది. తనకు తానుగానే తిరుగుబావుటా ఎగురవేసి… బీజేపి, కాంగ్రెస్ నేతలను వారి నియోజకవర్గాలకు వెళ్లి మరీ కలిసి.. ఎన్నికల బరిలోకి కూడా దిగిన సింగ్… మరి మళ్లీ ఎందుకు తన మనసు మార్చుకున్నట్టు అన్న అంశంపై… అటు ప్రతిపక్ష బీజేపి, కాంగ్రెస్సే కాక… అధికార టీఆర్ఎస్ పార్టీలోని సింగ్ అడుగులను ఇప్పటికీ సరిగ్గా పట్టుకోలేకపోతున్న ఆయన అంతర్గత ప్రత్యర్ధులూ తమ తలలు బాదుకుంటున్నారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ తనయ, ప్రస్తుత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… నాటి ఎంపీ ఎన్నికల్లో ఓటమికీ… ఆమె దగ్గరివాళ్ళూ, పార్టీలోని శక్తులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధుల కోవర్టు ఆపరేషన్లే కారణమనే వార్తలూ చూసినవే! ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు నాయకులు తమకు అత్యంత దగ్గరి వారితో మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆడియోలు ప్రసార మాధ్యమాలతో పాటు… సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి. ఇటీవల సీఎం కేసీఆర్ చెన్నై పర్యటన సందర్భంలో.. అక్కడి సీఎం స్టాలిన్ తో ఒక కీలక అంశం చర్చించారంటూ ప్రచార మాధ్యమాల్లో ఓ కథనం ప్రచురితమైంది. ఆ సమాచారం తానే ప్రచార మాధ్యమాలకిచ్చానంటూ… పోలీసులు తనను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారంటూ గతంలో ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత దగ్గర పనిచేసిన ఓ ప్రైవేట్ సహాయకుడు… ఏకంగా ఎలక్ట్రానిక్ మీడియా ముందే బోరున విలపిస్తూ వివరించిన విషయమూ తెలిసిందే!!

భారతీయ జనతా పార్టీలోనూ!!

రాష్ట్ర బీజేపి అధ్యక్ష పదవీ, బాధ్యతలు చేపట్టి.. గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో గణనీయమైన కార్పోరేటర్ స్థానాలతో పాటు.. దుబ్బాక, హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ఊపు మీద ఉన్న తరుణంలో… సంజయ్ పై అసమ్మతి రాగానికి అదే కరీంనగర్ నగరం వేదికైంది. ఆ పార్టీ సీనియర్ నాయకులే కొందరు రెండుసార్లు రహస్య సమావేశం ఏర్పాటు చేసి సంజయ్ స్పీడుకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేసిన పరిస్థితి. సీనియర్లను పట్టించుకోవడం లేదంటూ, అసమ్మతి కుంపటికి శ్రీకారం చుట్టినట్టు ప్రసార మాధ్యమాల్లో వెలుగు చూసిన విషయమూ తెలిసిందే! అయితే పార్టీ పెద్దలకు మాత్రమే తెలిపేలా నిర్వహించాల్సిన రహస్య ఎజెండా సమావేశ వివరాలు… అసలు బయటి ప్రపంచానికి ఎలా తెలిశాయన్నదీ ఇప్పటికీ ఓ మిలియన్ డాలర్ ప్రశ్నే.. ? ఇదీ అధికార పార్టీ కనుసన్నల్లోనే జరిగిన ఓ కోవర్ట్ ఆపరేషనేనా అన్నదీ ఓ డౌటనుమానం..? అందుకే ఈ ఇష్యూపై… ఏకంగా ఓ నిజ నిర్ధారణ కమిటీనే ఏర్పాటు చేసేవరకూ వెళ్లింది.

తెలుగుదేశంలోనూ!!

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీలోనూ.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి కోవర్ట్ రాజకీయాలు రాజ్యమేలాయో అందరికీ తెలిసిందే! 1994లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం.. స్వయానా అల్లుడు, ఆయన మంత్రివర్గంలో కేబినెట్ మంత్రైన చంద్రబాబునాయుడే కారణమైనట్టు జరిగిన ప్రచారం… ఎప్పటికీ తెలుగుజాతి మరువలేని విషయమూ.. అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవం కల్గిన బాబు పొలిటికల్ కెరీర్ లో ఓ మాయనిమచ్చే!! అయితే… ఓ చేదు జ్ఞాపకంగా ఎందరో ప్రస్తావించుకునే ఆ విశేషానికీ కరీంనగర్ జిల్లా నుంచే స్కెచ్ వేయడం మరింత విశేషం. కరీంనగర్ కు చెందిన నాయకులతోనే మొట్టమొదట ప్రారంభించిన మంతనాలు.. నాటి కోవర్టు ఆపరేషన్ లో కీలకపాత్ర పోషించాయన్నది పొల్టికల్ సర్కిల్స్ లో జరిగే చర్చ! ఎన్టీఆర్ కు నమ్మినబంటుగా ఉన్న జిల్లాకు చెందిన ఓ నాయకుణ్ని.. ఆ కోవర్ట్ ఆపరేషన్ కు సూత్రధారిగా ఎంపిక చేసి… రామారావును సీఎం పదవి నుంచి గద్దె దింపారన్నది ఇప్పటికీ అప్పుడప్పుడూ ప్రస్తావనకొచ్చే విషయమే!! రాష్ట్ర విభజన పిదప ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ హాయంలో మొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కొనుగోలు విషయంలోనూ ( ప్రస్తుతం కోర్టు లో ఉన్న ఓటుకు నోటు కేసు ).. టీడీపి పార్టీలోని వారితో కోవర్ట్ ఆపరేషన్ చేయించి.. వీడియో, ఆడియో టేపులతో బట్టబయలు చేయడమూ సమాజమెరిగిందే! ,

ఊ… అంటున్నారు.. ఉ..ఊ .. అంటున్నారు !!

ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో కీలక నాయకుల వద్ద… బూత్ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకూ కూడా కార్యకర్తల మనోగతం అర్థం చేసుకోలేని ఓ సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఊ అంటారో… ఇంకెప్పుడు ఉ ఊ అంటారో తెలియని ఒకింత ఆందోళనకర పరిస్థితి. అసంతృప్తి లావాలా పెల్లుబికుతున్నా… కొందరు నాయకులతో పాటు… కార్యకర్తలు కూడా పైకి ఊ అంటున్నా… లోలోపల రగులుతున్న లావాను బయటకు వెళ్లగక్కడం లేకపోవచ్చునేమోగానీ.. ఉఊ అనే అధిష్ఠాన నిర్ణయాలపై గుర్రుగా ఉన్నట్టు రాజకీయ సర్కిల్స్ లో ఇప్పటికే చర్చకు కారణమైంది. అయితే ఆ లావాద్రవం ఎప్పుడో పెల్లుబికేదాకా తెలియని పరిస్థితి. ముఖ్యంగా… గత రెండు రోజుల క్రితం గూలాబీ దళపతి కేసీఆర్.. 33 జిల్లాల అధ్యక్షులను నియమిస్తూ జారీ చేసిన ప్రకటన… అధ్యక్షపీఠంపై ఆశలపల్లకీలో ఊరేగిన కొందరు నాయకులకు నిరాశనే మిగిల్చింది. తమ బాధలు, ఆవేదనలు తమ తమ నాయకుల ముందు వ్యక్తం చేసినా… ఓదార్పు మాటలే తప్ప… కనీసం భవిష్యత్తు భరోసా కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. దీంతో ఎవరెప్పుడేదారి చూసుకుంటారో.. లేక, పార్టీల్లోనే ఉంటూ ఎవరెవరికి కోవర్టులుగా మారుతారో తెలియని ఓ అయోమయ పరిస్థితిలో ప్రస్తుత రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక రాష్ట్రంలో బీజేపి, కాంగ్రెస్ పార్టీల్లో కోవర్టు ఆపరేషన్ లక్షణాలు…. కోవిడ్- 19 కంటే భయంకరమని మళ్లీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు.