₹.75 లక్షల నిధులతో “రేడియాలజీ భవన “నిర్మాణంకు భూమి పూజ

జగిత్యాల :- జిల్లాలో రూ.75 లక్షల వ్యయంతో రేడియాలజీ పరీక్ష కేంద్ర హబ్ నూతన భవన నిర్మాణ పనులు చేపట్టామని జిల్లా కలెక్టర్ జి.రవి తెలిపారు. మంగళవారం రేడియాలజీ పరీక్షా కేంద్రం నిర్మాణ పనులకు జడ్పీ చైర్పర్సన్ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం కలెక్టర్ శంకుస్థాపన చేశారు.

3 నెలలోపు రేడియాలజీ ల్యాబ్ నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.జిల్లాలో మెడికల్ కాలేజ్ సమీపంలో రెడియాలజి ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడే తెలంగాణ రాష్ట్ర డయాగ్నొస్టిక్ సెంటర్ ఉందని, అందులో 57 రకాల పరీక్షలు ప్రజలకు ఉచితంగా చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, డయాగ్నస్టిక్ సెంటర్, రేడియాలజీ ఒకే ప్రాంతంలో ఉండటం పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా ప్రజల చిరకాల కోరిక జగిత్యాల ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

జగిత్యాల పట్టణ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు 16 ట్రాక్టర్లు, స్వీపింగ్ యంత్రం,32 ఆటోలు కోనుగోలు చేశామని , 12 ఎకరాల స్థలం డంపింగ్ యార్డ్ కోసం సేకరించామని తెలిపారు. రూ.56 లక్షలతో నూతన ట్రాక్టర్ జగిత్యాల మున్సిపాలిటీ కోసం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మున్సిపాలిటీ చుట్టూ ఉన్న 4 వాగులు కలుషితమవుతున్నాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వాగు పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మున్సిపల్ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, ప్రజలు సైతం అధికారులకు సంపూర్ణంగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. పట్టణ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామని, రూ.4 కోట్లతో నూతన మార్కెట్ నిర్మాణం పనులు చేపడతామని, పండ్ల మార్కెట్ లో 90 షాపులను రూ.5 కోట్లతో నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రూ.40 కోట్ల వ్యయంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పైప్లైన్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని, రూ.9 కోట్ల నిధులతో, రోడ్ల మరమ్మతు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లాలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాంతంలో రేడియాలజీ ల్యాబ్ కోసం భూమిని గుర్తించిన కలెక్టర్ ను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ,.మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి , జ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, డి.ఎం.హెచ్.ఓ., మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు , స్థానిక కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


ప్రతిపాదనలు సిద్ధం చేయండి !!
ప్రతి మండలంలో 2 పాఠశాలల ప్రతిపాదనలు ప్రాధమికంగా సిద్ధం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మన ఊరు మన బడి సాఫ్ట్ వేర్ పై ఇంజనీరింగ్ అధికారులకు శిక్షణ ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి ఇంజనీర్ తన పరిధిలో ఉన్న పాఠశాల పనుల అంచనాను సాఫ్ట్ వేర్ లో పొరపాట్లు జరుగకుండా తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సాఫ్ట్ వేర్ లో డాటా ఇన్పుట్ నమోదు చేసే సమయంలో ఇబ్బందులు ఎదురైతే వాటిని నోట్ చేసి సంబంధిత సాఫ్ట్ వేర్ ప్రతినిధులకు సమాచారం అందిస్తే పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.
ప్రతి మండలంలో కనీసం రెండు పాఠశాలలో మన ఊరు మన బడి కింద పనులను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని దీని కోసం అవసరమైతే మాన్యువల్ గా ప్రతిపాదనలు తయారు చేసి పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు.అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, ఈ. డి.ఎం., మాస్టర్ ట్రైనర్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.