తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 519వ వర్ధంతి కార్యక్రమాలు మార్చి 29న మంగళవారం సాయంత్రం తిరుమలలో జరుగనున్నాయి. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఊరేగింపుగా శ్రీవారి ఆలయం నుండి బయల్దేరి సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేస్తారు. అనంతరం ప్రముఖ కళాకారులతో దినము ద్వాదశి సంకీర్తనలు, సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. ఆ తరువాత అహోబిలం, శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 46వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తారు. చివరగా శ్రీ తాళ్లపాక వంశీయులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది.
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 29వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.