శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

J.Surender Kumar,                                                                                           

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామ అర్చన, నిత్యార్చ‌న‌ నిర్వహిస్తారు. మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. అదేవిధంగా శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో ఉగాది సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా ఉద‌యం 7 నుండి 7.45 గంట‌ల వ‌ర‌కు శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం, సాయంత్రం 5 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, ఆర్జితసేవలైన ఊంజ‌ల్‌ సేవను టిటిడి రద్దు చేసింది.

ఫైల్ ఫోటో


తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు!!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ఉదయం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాంభగీచా బస్టాండ్, బస్టాండు సమీపంలోని అన్న ప్రసాద వితరణ కౌంటర్ ను పరిశీలించారు. భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో భక్తులకు తాగునీటి ఇబ్బంది లేకుండా, పారిశుధ్య సమస్యలు, రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం పి ఎ సి 1 కు వెళ్ళి అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడారు. గదులు సులువుగా దొరుకుతున్నాయా ? దర్శనం ఎలా అయ్యింది,.? ఎంత సమయం పట్టింది ? అని తెలుసుకున్నారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఇక్కడ పారిశుధ్యం మరింత మెరుగు పరచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీదేవి, విజిఓ శ్రీ బాలిరెడ్డి చైర్మన్ వెంట ఉన్నారు

ఫైల్ ఫోటో


క్యూ లైన్లలో భక్తులకు ఆహారం, పాలు అందించండి!!
శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లలో వెళ్ళే భక్తులకు ఆహారం, పాలు అందించాలని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల లో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో శుక్రవారం ఆయన స్లాట్ సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న సమయంలో తాగు నీరు, మరుగు దొడ్ల సదుపాయాలు సరిగా ఉన్నాయా ? లేదా అని అడిగి తెలుసుకున్నారు. క్యూ లో దర్శనానికి వెళుతున్న భక్తులతో మాట్లాడారు. క్యూ లైన్ల నిర్వహణ పరిశీలించారు. సర్వదర్శనం ఎంత సమయంలో అవుతోందని అధికారులను అడిగారు. ఉదయం అయితే గంటన్నర లోపు, సాయంత్రం 6 గంటల తరువాత వారికి రెండు గంటల్లో అవుతోందని అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజిఓ శ్రీ బాలిరెడ్డి ని చైర్మన్ ఆదేశించారు.