యువత మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి పురస్కరించుకొని పట్టణంలోని మంచి నీళ్ల బావి వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి. కలెక్టర్ చైర్ పర్సన్, స్థానిక ఎమ్మెల్యే కలిసి హాజరయ్యారు. డా. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్, స్థానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలవేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు అందాలని, ఆ దిశగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని కలెక్టర్ తెలిపారు. 27 సంవత్సరాల చిన్న వయసులోనే ప్రజాప్రతినిధులుగా ఎన్నికై 50 సంవత్సరాలపాటు ప్రజలకు ప్రాతినిధ్యం వహించారని, 30 సంవత్సరాల పాటు కేంద్ర క్యాబినెట్ లో వివిధ హోదాలలో పనిచేసి ప్రజలకు సేవలు అందించారని తెలిపారు. దేశ కార్మిక శాఖ మంత్రిగా,రక్షణ శాఖ మంత్రి గా సేవలందించి బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేస్తున్న సమయంలో హరిత విప్లవం కోసం ఆయన కృషి ప్రశంసనీయమని కలెక్టర్ కొనియాడారు. బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహనీయుల జీవితాలు నుండి మనమంతా స్ఫూర్తి పొంది మంచి సమాజం రూపోందించే దిశలో ప్రయాణం సాగించాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. జీవితాలలో మార్పు ముఖ్యకారణ విద్యావంతులు కావడమని, దీనిని విద్యార్థులు గమనించాలని కోరారు. విద్యనభ్యసించడం వల్ల మన జీవితాలు స్పష్టమైన మార్పు తప్పనిసరిగా వస్తుందనడానికి బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ వంటి మహనీయులు ఆదర్శమని కలెక్టర్ తెలిపారు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు, స్టడీ సర్కిల్ ఏర్పాటు, స్కాలర్ షిప్లు, సంక్షేమ పథకాలు, ఆర్థికాభివృద్ధికి కార్పొరేషన్ రుణాలు, దళిత బంధు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. జగిత్యాల జిల్లా కు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అదనంగా కార్పొరేషన్ యూనిట్లను మంజూరు చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాల్లో డైరీ యూనిట్లు పెంపొందించేందుకు మంత్రి కృషి చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలో వస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రారంభించడం శుభ పరిణామమని, 100 మంది ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఏపీ స్టడీ సర్కిల్లో విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ పౌష్టికాహారం అందించడం జరుగుతుందని, తాను సైతం స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకున్నానని కలెక్టర్ తెలిపారు.పోలీసు శాఖ , ఎస్సీ సంక్షేమ శాఖ, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వాటిని యువత వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు .ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల ను రిజిస్టర్ చేయడం లో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి మాసం చివరి వర్కింగ్ డే నాడు గ్రామంలో సివిల్ రైట్ పై అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు . ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించుకుంటూ దళిత వర్గాలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు

కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకై సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. దళిత వర్గ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద సంఖ్యలో ఎస్సీ సంక్షేమ వసతి గృహాలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని, విదేశీ విద్య చదువుకునే వారికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు మంచి వైద్య సదుపాయాలు అందించేందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల మంజూరు చేశారని తెలిపారు
