ధర్మపురి పట్టణ అభివృద్ధికి పటిష్ఠ చర్యలు – మంత్రి ఈశ్వర్ !


ధర్మపురి పట్టణ అభివృద్ధి దిశగా పటిష్ట చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సిసి రోడ్డు, విస్తరణ, లైటింగ్ నిర్మాణ, పనులకు భూమి పూజ చేసి మెడికల్ సిబ్బంది ఏ.ఎం.ఎం. ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందచేశారు.
ధర్మపురి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో రూ.24.9 లక్షలతో నిర్మించిన మూడు అదనపు తరగతి గదులు ప్రారంభించి, విద్యార్థులు తో విద్యాభ్యాసం పై ముచ్చటించారు, మహాలక్ష్మి ఘాట్ వద్ద రూ.కోటి నలభై లక్షల వ్యయం తో నిర్మించిన స్మశాన వాటిక ను మంత్రి ప్రారంభించారు.

అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ధర్మపురి పట్టణంలో ప్రజల సౌకర్యం కోసం ఆధునిక స్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేశామని, స్మశాన వాటిక నిర్మాణానికి భూమిని దానం చేసిన గుడ్ల శ్రీధర్ కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్లంపల్లి గేట్లు అమర్చడం వల్ల ధర్మపురి పుణ్యక్షేత్రంలో స్నానాల ఘాట్ వద్ద అకస్మాత్తుగా మురుగు నీటి సమస్య ఎదురైందని, రూ.7.5 కోట్లు ఖర్చు చేసి మురుగు నీటి తరలించడానికి .5.5 డయామీటర్ లు కలిగిన ప్రత్యేక పైప్ లైన్ పనులు పూర్తి చేశామని మంత్రి తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, వీటిని పూర్తి చేసిన తర్వాత పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు బాగా పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున అవెన్యూ ప్లాంటేషన్ చేపడతామని మంత్రి అన్నారు.


గత అరవై సంవత్సరాలలో ఒక్క సారి కూడా కోనేరు చెరువు లో పూడిక తీయలేదని, ఇటీవలే ఆ పనులు పూర్తి చేశామని, జమ్మిగద్దె నిర్మాణ పనులు ,సైతం పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ధర్మపురి పట్టణం లో పూర్తిగా ప్రజల సహకారంతో 60 సీట్ల రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్నామని, మరో 2,3 రోడ్ల పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
ధర్మపురి పట్టణంలో త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. రూ.3.5 కోట్ల వ్యయంతో అదనపు నీటి ట్యాంకు, పైప్ లైన్ పనుల ప్రారంభించామని మంత్రి అన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా బల్క్ నీటి సరఫరా పట్టణానికి అందుతుందని, 5 ట్యాంకుల, 1 సంప్ నిర్మాణం పూర్తి చేశామని అన్నారు. సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు సైతం ధర్మపురి పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా రెండవ నీటి సోర్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.


ప్రస్తుత సీజన్లో కొంతమేర ఇబ్బంది ఏర్పడితే స్థానిక కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు స్పందించి తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ధర్మపురి పట్టణంలో మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రూ.15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. ధర్మపురి లోని మండల గడ్డ స్నానాల ఘాట్ వద్ద సైతం స్మశాన వాటిక నిర్మాణ పనులు చేపడతామని మంత్రి తెలిపారు.


ధర్మపురి అభివృద్ధికి ₹.141 కోట్ల నిధులు !


ధర్మపురి ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ100 కోట్లు, మున్సిపాలిటీకి మంత్రి కేటీఆర్ ప్రకటించిన 35 కోట్లు, డి.ఎం.ఎఫ్.టి. నిధులు 6 కోట్లు మొత్తం 141 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అభివృద్ధిపై మంచి సలహాలు అందించాలని, అనవసరమైన వివాదాలకు సమయం వృధా చేయవద్దని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ ధర్మపురి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తున్నారని మంత్రిని ఆమె అభినందించారు.

పట్టణంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల వల్ల ప్రజలు చాలా ఉపయోగపడతాయని ఆమె అన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రవి, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సతమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి , జెడ్పీటీసీ బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టి బాబు, వైస్ చైర్మన్ రామయ్యా, తసీల్దార్, కౌన్సిలర్ లు నాయకులు అధికారుల తదితరులు పాల్గొన్నారు.