గల్లీ నుంచి ఢిల్లీ వరకు .. వడ్ల లొల్లి ఎందుకు ? సాధించింది ఏమిటి!

J.Surender Kumar,


మోడీ ఎవరి దబాయింపులకు బెదరడు .. మూడు చట్టాలు రద్దు చేసి రాజకీయంగా యూపీలో గెలిచి విజయం సాధించాడు .. టికాయట్ కు వారి ఊళ్ళోనే మద్దతు లేదు .. . అలాంటి వారు కే సి ఆర్ కు ఎలా ఉపయోగకరం ? .


తెలంగాణా రైతాంగం యాసంగిలో పండించిన ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వివాదానికి తెరలేపింది. ధాన్యం కొనుగోళ్ల విషయం ఆహారభద్రతా చట్టం ప్రకారం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనంటూ… రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నిరనసల హోరును ఉధృతం చేసింది. దాంతో మరోసారి అధికార టీఆర్ఎస్ పై రెండు టర్మ్స్ లో ఎంతో కొంత పెరుగుతూ వస్తున్న వ్యతిరేకతను… తనపైనుంచి బీజేపిపైకి తిప్పేయాలన్న రాజకీయ ఆసక్తీ అందులో ఉండొచ్చుగాక! అందుకే వారం రోజుల పాటు చేపట్టిన టీఆర్ఎస్ నిరసనలకు అంత హైప్ కూడా వచ్చింది.

అయితే ఢిల్లీలో దీక్షనంతరం… 24 గంటల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగిరాకపోతే… ఇక గాయిగత్తరేనన్న గులాబీబాస్ ప్రకటన మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఆ క్రమంలో డెడ్ లైన్ అయిన వెంటనే సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారోనన్న రాష్ట్ర ప్రజలు… మరీ ముఖ్యంగా మీడియా, రాజకీయ విశ్లేషకుల ఉత్కంఠను.. గులాబీబాస్ తనవైపుకు ఫోకస్డ్ గా తిప్పుకోగల్గారు.

రాష్ట్రంలో, దేశంలో హాట్ టాపిక్ కోసం…


చదరంగంలో రాజుకు చెక్ మేట్ పెట్టడానికి.. ప్రతీ అడుగూ ఎలా వేయాలో.. రాజకీయంలోనూ సేమ్ టూ సేమ్! అందులో ఎత్తులకు పైఎత్తులు సాధించేవాళ్లే.. డైనమిక్ గా నిలుస్తారు. అలాంటి ఎత్తుగడల డైనమిక్స్ తో ముందుకెళ్లే నేతల్లో దేశంలో కేసీఆర్ ది ఇప్పుడు ముందువరుస! ఆ క్రమంలో రచించిన పక్కా ప్లాన్డ్ స్క్రిప్ట్ ప్రకారమే… ఏప్రిల్ 4 నుంచి 11 వరకూ గల్లీ టూ ఢిల్లీ నిరసనలన్నది కేసీఆర్ ను బాగా చదివే రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట!! తెలంగాణా రైతుల తరపున తాను వకాల్తా తీసుకుని… ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని రాజకీయాస్త్రంగా మల్చుకుని… తమపై పెరుగుతున్న వ్యతిరేకతకు తోడు… మరోసారి మొన్న జరిగిన ఎన్నికల్లో నాల్గు రాష్ట్రాల్లోనూ జయకేతనమెగిరేసి… ఇప్పుడు తెలంగాణా వైపు ఆబరాగా చూస్తున్న బీజేపికి ఎంతో కొంత పెరుగుతున్న సానుకూలతలను కూడా దృష్టిలో పెట్టుకునే ఈ రైతు రాజకీయానికి తెరతీశారనేవారూ లేకపోలేదు. ఈ క్రమంలోనే తమపై ఉన్న వ్యతిరేకతను… ఇక్కడ జెండా పాతకముందే బీజేపిపైకి మళ్లించే ఒక యోచనతో… పక్కా రాజకీయపార్టీ తరహాలో కేసీఆర్ అడుగులు వేశారు. అందులో భాగంగానే వారంపాటు నిరసనల తర్వాత… కేంద్రాన్ని తెలంగాణా రాష్ట్రంలోని గల్లీ నుంచి… ఢిల్లీ స్థాయి వరకూ దోషిగా నిలబెట్టి… ఆ తర్వాత తెలంగాణ రైతాంగం ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా పర్లేదు.. మా రైతులకు మేం అండగా ఉంటామంటూ.. మళ్ళీ అన్నదాతలను తమకనుకూలంగా మల్చుకునే ఓ వ్యూహాత్మక రాజకీయమే.. ఈ రైతు ధాన్యం కొనుగోలు రాజకీయమన్నది దాన్ని నిశితంగా పరిశీలించేవారికి ఇట్టే అర్థమైపోతుంది!

అయితే తమపై వస్తున్న వ్యతిరేకత అనుకోవచ్చు… లేదా నిజంగానే కేంద్రం తీరుపై యుద్ధమనుకోవచ్చు… ఏ విశ్లేషణలకూ అందని ఇంకా అంతర్గత వ్యవహారాలైనా ఉండొచ్చుగానీ… ఎప్పుడూ అవే ఎత్తుగడలు ప్రజాస్వామ్యంలో పనిచేస్తాయా ? అన్నదే ఇప్పుడు మరో ఇంగితజ్ఞానంతో రాజకీయపార్టీలు తమకు తాము సమాధానం చెప్పుకోవాల్సిన ప్రధానప్రశ్న..?.ఇవాళ పేపర్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు… చేతుల్లోనే ఆండ్రాయిడ్ ఫోన్ సర్వస్వాన్ని జనం ముందుంచుతున్న వేళ… సోషల్ మీడియా యుగంలో ఎత్తుగడలను ,ప్రజానీకం పసిగట్టలేరని సో కాల్డ్ రాజకీ పార్టీలనుకుంటున్నాయా…? తాము వేస్తున్న ఎత్తుగడలు కాలం చెల్లినవా.?. లేక, ఇంకా ఏవిధంగా అడుగులు వేయాల్సి ఉందన్న ? ఇన్నోవేటివ్ ఐడియాలపై దృష్టి సారించకనా…? మొత్తంగా ఇటు రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం… అటు కేంద్రంలోని అధికార బీజేపి ప్రభుత్వం… ఇలా ఈ రెండింటిపైనా రైతులు విసిగిపోవడం… రెండుపార్టీలాడిన రాజకీయ డ్రామా బూమరంగ్ గా మారిందనడానికి నిలువెత్తు సాక్ష్యంలా కనిపించింది.

రాజ్యాంగంలో పొందుపర్చినట్టుగా ఆహారభద్రత కేంద్రం బాధ్యతైనప్పటికీ…ఆయా పంటల దిగుబడులు, నిల్వల పెరుగుదల, ఎగుమతులు వంటి పలు అంశాల్లోనూ పరిస్థితులు మారుతుంటాయి. యాసంగిలో డైరెక్ట్ రారైస్ మిల్లింగ్ చేస్తే నూకశాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టే… బాయిల్డ్ రైస్ గా మారుస్తున్నామన్న తెలంగాణా మాటా ముమ్మాటికీ నిజమే !. అయితే అంతకుముందు బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేంద్రానికి రాష్ట్రం లేఖ ఇచ్చినట్టు.. ఏకంగా ఒప్పందం కూడా చేసుకున్నట్లు.. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్రంలోని బీజేపీ నేతలంతా చర్వితచరణంగా చెప్పుకొచ్చారు. ఆ సమయంలో అలాంటి ఒప్పందాలేవీ జరగకపోయుంటే.. అధికార టీఆర్ఎస్ దాన్ని ఆసరా చేసుకుని బీజేపీ టార్గెట్ గా మరింత కుండబద్దలు కొట్టాల్సింది. అదే విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సింది. కానీ, అది మాత్రం ఎక్కడా అంత తీవ్రంగా కనిపించకపోగా.. వరి వేయొద్దని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం చెబితే…బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం రైతులను రెచ్చగొట్టి వరి వేయించారనే వాదననే బలంగా వినిపించింది. రాజకీయపార్టీలన్నాక హామీలివ్వడాలు.. అవి వీడియోల రూపంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తిరుగుతున్నా… ఆ తర్వాత వాటిని ఏమార్చి బుకాయించడాలు అధికార టీఆర్ఎస్ పార్టీకీ తెలియని కొత్త విషయమేమీ కాదు! మరింతగా రాజకీయం తెలిసిన అధికార గులాబీపార్టీ… అసలు నిజాలను బయటపెట్టకుండా.. ప్రతిపక్ష బీజేపి నాయకులు మాట్లాడిన రాజకీయ మాటలను మాత్రమే పట్టుకుని ప్రజల్లోకి వెళ్లడంతోనే… మళ్లీ ప్రజల్లో, ఏ రైతాంగం కోసమైతే పోరాడుతున్నామంటున్నారో ఆ అన్నదాతల్లోనే ఏదో ఓ మూల అనుమానాల సృష్టికీ మళ్లీ అదే టీఆర్ఎస్ కారణమైంది.


ఇంకో విషయమేంటంటే… కేంద్రంలోని అత్యధికశాతం రాష్ట్రాల్లో బీజేపి అధికారంలో ఉన్నప్పటికీ… మొత్తంగా లేదుకదా…? మరి మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడాలేని ఈ ఆందోళన తెలంగాణాలో మాత్రమే ఎందుకు తలెత్తిందన్నదీ మరో ప్రశ్న..? టీఆర్ఎస్ నిరసనల్లోనూ పంజాబ్ కో న్యాయం.? తెలంగాణాకో న్యాయమా ? అంటూ ప్రశ్నించిందే తప్ప… ఏయే రాష్ట్రాలు బాయిల్డ్ రైస్ ఇస్తామన్నాయి… వాటిలో ఏ ఏ రాష్ట్రాల నుంచి మాత్రమే కేంద్రం కొనుగోళ్లు చేస్తోంది… ఏయే రాష్ట్రాలకు కొర్రీలు పెడుతుందనేటువంటి అంశాలను ఎక్కడా కూడా స్థూలంగా, శాస్త్రీయంగా, జనసామాన్యానికి అర్థమయ్యేట్టు చెప్పకపోవడం కూడా.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపిపై పోరులో టీఆర్ఎస్ కు బూమరంగైంది.
2014 నుంచీ.. కొన్ని నెలల ముందు వరకూ మోడీతో సత్సంబంధాలు కలిగి ఉన్న కేసీఆర్ కూ, మోడీకి ఎక్కడ చెడింది…? అనే వాదనతో పాటే… ఇది ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ఊసు లేకుండా… దాని గురించే ఎక్కడా మాట్లాడుకోకుండా చేసే ఓ వ్యూహాత్మక కొట్లాట అనే వాళ్లూ ఉన్నారు! సరే టీఆర్ఎస్, బీజేపి అంత టగ్ ఆఫ్ వార్ అన్నట్టుగా కొట్లాడుతుంటే… వారిద్దరూ కలిసే ఈ రాజకీయ డ్రామా ఆడుతున్నారని అనుకోవడమంత అమాయకత్వం లేదని అనుకునేవాళ్లూ ఉన్న క్రమంలో… లోగుట్టు పెరుమాళ్లకెరుక అని రాజకీయాలను నిశితంగా పరిశీలించేవాళ్లు మనసుకు చెప్పుకునే మాట!
టీఆర్ఎస్, బీజేపీది డిష్యుం డిష్యుమా…? లేక, వ్యూహాత్మక కొట్లాటలా…? అన్నవి కాస్సేపు పక్కనబెట్టి… అంత అంతరాళాల్లోకి పోకుండా… ఓ సామాన్యుడిలానే చూస్తే… ఢిల్లీలో చేపట్టిన నిరసన వేదికపై బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలుగానీ.. వారి ప్రతినిధులు గాని, ఉత్తరాదికి చెందిన రైతు సంఘాలుగానీ, ఆ సంఘాల నాయకులుగానీ… చివరాఖరకు బీజేపిని వ్యతిరేకించే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఆ నిరసనలో కనిపించకపోవడం… కేవలం రైతుసంఘం నేత రాకేష్ ఠికాయత్ మాత్రమే హాజరవ్వడం కూడా ఓ చర్చకు తావిచ్చింది.


కేంద్ర ప్రభుత్వం 2020 సెప్టెంబర్ లో, పార్లమెంట్లో చేసిన మూడు రైతు చట్టాలను రద్దు చేయాలంటూ… కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు 16 నెలలపాటు ఢిల్లీ పరిసరాల్లో ధర్నాలు, ఆందోళనలు చేసి.. మోడీ ప్రభుత్వం మెడలు వంచగల్గింది. అనేకమంది రైతులు లాఠీ దెబ్బలు తిన్నారు. ఎక్కడ ఉంటే అక్కడే ఎండా, వాన, చలి అన్నది లేకుండా రోడ్లపైనే వంటావార్పు పెట్టి ఠికాణా పెట్టారు. వివిధ కారణాలతో పలువురు రైతులు మృత్యువాత పడ్డారు. కేంద్రమంత్రి కుమారుడి వాహనం రైతులను తొక్కించేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన ఘటనలో… ఓ జర్నలిస్ట్ తో పాటు… నల్గురు రైతులూ మృతి చెందారు. ఈ దుర్ఘటనలన్నీ బీజేపిపైన తీవ్ర వ్యతిరేకతను రేకెత్తిస్తున్న క్రమంలో… మొత్తంగా రద్దు చేసే వరకు మొక్కవోని దీక్ష చేపట్టిన ఉత్తరాది రైతుల మొక్కవోని దీక్ష సఫలీకృతమైంది. అయితే ఆనాడు…16 నెలల సుదీర్ఘ కాలంగా రైతుల ఆందోళన చేస్తే… ఆప్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, లోక్ తాంత్రిక్, అకాలీదళ్, శివసేన తదితర పార్టీలు రైతులకు మద్దతు ప్రకటించి వారికి సంఘీభావం తెలిపినప్పుడు… ఏపీ లోని జగన్ ప్రభుత్వంగానీ.. తెలంగాణాలోని కేసీఆర్ ప్రభుత్వంగానీ… అవకాశం దొరికితే ఇప్పుడొంటికాలిపై లేస్తూ గతంలో అంటకాగిన ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుగానీ… ఎందుకు మద్దతుగానీ, సంఘీభావాన్నిగానీ ప్రకటించలేదన్న విషయమూ జనసామాన్యంలో చర్చలో ఉంది!


రైతుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 11 రైతుసంఘాలు, ఢిల్లీ వీధులకెక్కి నాడు, ఒక జేఏసీగా ఏర్పాటై… రైతులకు బాసటగా నిల్చాయి. కానీ అదే రైతుల కోసం ఢిల్లీ వేదికగా కేసీఆర్ నినదిస్తే… కేవలం రాకేష్ ఠికాయత్ మినహా ఇంకెవ్వరూ కనిపించకపోవడంతో.. . దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలవసరం ఉంటోందని ,గాయిగత్తర్ లేపుతానంటున్న కేసీఆర్ ను ,మిగిలిన రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు కావచ్చు, తనతో కలిసివచ్చే ఇతర ప్రతిపక్ష నేతలు కావచ్చు, రైతుసంఘాల నాయకులు కావచ్చు, ప్రజాసంఘాలు కావచ్చు… ఇలా వీరంతా ఎంతవరకూ నమ్ముతున్నారన్నదీ ఇప్పుడు రూఢీ కావల్సిన ఓ సందేహం..? అయితే కేసీఆర్ భవిష్యత్ రాజకీయాలు… కాంగ్రెస్, బీజేపియేతర ప్రత్యామ్నాయ వేదిక వంటివి కాస్సేపు పక్కనబెట్టినా… లేదా అందులో భాగంగానే ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని చూసినా… లేదంటే ఏ ఎండకు ఆ గొడుగన్నట్టు ప్రజల్ని అమాయకులనుకుంటూ.. ఆయా జాతీయ పార్టీలతో అంతర్గతంగా ఒప్పందాల్లో భాగంగానే పైకి డ్రామాలాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో.. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో రెండు అధికారపార్టీలైన టీఆర్ఎస్, బీజేపిలు మాత్రం అటు రైతాంగంలోగానీ… ఇటు ప్రజల్లోగానీ చులకనయ్యాయే తప్ప… సాధించిందేమీ లేదు..