మహనీయుల ఆశయాల సాధన కోసం కృషి చేయాలి-కలెక్టర్ రవి !

-మహనీయుల ఆశయసాధనకు మనమంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రవి అన్నారు. సోమవారం మహాత్మ జ్యోతిరావు పూలే 196 వ జయంతి పురస్కరించుకొని  స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి,  మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతిభాపూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించాడని ,మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, కుల వ్యవస్థ పూర్తిగా నిర్మూలించిన నాడే అభివృద్ధి సాధ్యమవుతుందని, కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతలకు వివక్షతలకు గురయిన బడుగు, బలహీన వర్గాలలో ఆత్మసైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిబాపూలేనని కలెక్టర్ తెలిపారు.

శతాబ్దాలుగా అణచివేతకు గురైన కింది కులాల గురించి ఆలోచించిన మొదటి నాయకుడు జ్యోతిభా ఫూలే.సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం అంటూ ఆలోచించి ప్రబోధించి దళిత వర్గాలను, బలహీన వర్గాలను జాగృతం చేసిన క్రియాశీలి అని అన్నారు.  మానవ హక్కుల కోసం పోరాటం నడిపిన విప్లవకారుడు జ్యోతిభాపూలే అని అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే అప్పటి సమయంలో సామాజిక అసమానతల పై పోరాటం చేశారని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం ఉన్న అసమానతలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.మహిళల విద్య కోసం మహాత్మ జ్యోతిబాపూలే ఎంతో కృషి చేశారని ప్రత్యేకంగా మహిళల కోసం మొదటి పాఠశాల ఆయన స్థాపించారని కలెక్టర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాల లను ప్రతి నియోజకవర్గంలో బాలికలకు ఏర్పాటు చేసిందని తెలిపారు.  విదేశీ విద్య అభ్యసించే విద్యార్థులకు మహాత్మ జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ అందజేస్తుందని, గీత కార్మికులకు పెన్షన్లు, వివిధ బీసీ కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. 

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ, మహిళా విద్య పై ప్రత్యేక శ్రద్ధ వహించి చేసిన మొదటి నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు.  మొదటగా తన సతీమణి సావిత్రి బాపూలే కు విద్య అందించి అనంతరం ఆమె సహకారంతో బాలికల కోసం ప్రత్యేకంగా దాదాపు 250 పాఠశాలలను స్థాపించిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ఆయన కొనియాడారు. కుల వివక్ష దూరం చేసేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని, ప్రతి వర్గం వారికి ఆలయ ప్రవేశం కలిగే విధంగా ఆయన పని చేశారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న  టి.బి.సి.జే.ఏ.సి. రాష్ట్ర అధ్యక్షులు & సీనియర్ సిటిజన్ నాయకులు హరి అశోక్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిబా పూలే తన గురువుగా స్వీకరించారని ఆయన పేర్కొన్నారు. మహిళా విద్య బాల్యవివాహాలు నిర్మూలన, వితంతు పునర్వివాహం, కుల నిర్మూలన దిశగా ఆయన కృషి చేశారని తెలిపారు. జిల్లాలోని కలెక్టరేట్ సమీపంలో మహాత్మ జ్యోతిబాపూలే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరిస్తామని తెలిపిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, జగిత్యాల ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్. లత  ,జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సాయిబాబా , జిల్లా అధికారులు,బిసి సంగం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీ నారాయణ, బి.సి.సంగం జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు,విద్యార్థి జేఏసి.జిల్లా అధ్యక్షులు జె రమేష్, బిసి మహిళా జిల్లా అధ్యక్షులు కె.శ్రీమంజరీ ఇతర నాయకులు అధికారులు, సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి ప్రతి ఒక్కరు సహకరించాలి


  జిల్లాలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల ను  నిషేధించామని , వాటిని వినియోగించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ జి రవి విజ్ఞప్తి చేశారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లాలో ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు మైనారిటీ ముస్లిం మహిళా సంఘాల చే తయారు చేసిన జూట్ బ్యాగుల ను పంపిణీ చేశారు.కరోనా సమయంలో ఫీవర్ సర్వే నిర్వహణ, మందుల పంపిణీ వ్యాక్సినేషన్ తదితర అంశాల్లో మంచి కృషిచేసిన ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలను గౌరవించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను నిషేధించామని, వాటి స్థానంలో జూట్ బ్యాగ్ లను వినియోగించాలని కలెక్టర్ ప్రజలను కోరారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే జరిమానాలు విధించడం జరుగుతుందని అధికారులు ఆకస్మిక తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.

ప్లాస్టిక్ కవర్ల స్థానంలో వినియోగించడానికి జ్యూట్ బ్యాగులు తయారు చేస్తున్నామని, దీని కోసం జిల్లా లోని వివిధ మహిళా సంఘాలకు శిక్షణ అందించి యూనిట్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. రెండున్నర లక్షల రూపాయలు వ్యయం చేసి 2 వేలకు పైగా ఉన్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు జ్యూట్ బ్యాగులు అందజేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జూట్ బ్యాగుల పంపిణీ రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
జిల్లా అధికారులు వారి శాఖ తరఫున నిర్వహించే కార్యక్రమాల్లో వినియోగించడానికి, సొంత అవసరాలు వినియోగానికి జ్యూట్ బ్యాగులు ఆర్డర్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న వివిధ వ్యాపారులు తమకు అవసరమైన రీతిలో ఆర్డర్లు అందించి బ్యాగులు తయారు చేయించుకోవాలని కలెక్టర్ కోరారు.
అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత ,  జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ప్రజావాణికి భారీ స్పందన !
జిల్లా కేంద్రంలో IMA సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పలువురు సమస్యల పరిష్కారానికి కలెక్టర్ వినతి పత్రాలు ఇచ్చారు.

జిల్లా యంత్రాంగం దరఖాస్తులకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ పిర్యాదు గార్ల ముందే  సిఫారస్  చేసి అధికారులను పరిశీలించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.