మొబైల్ అంగన్వాడి యాప్ ను ప్రారంభించిన కలెక్టర్!

జగిత్యాల ఏప్రిల్ 8:- సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జగిత్యాల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా మొబైల్ అంగన్వాడీ యాప్ ను, వివేకానంద మినీ స్టేడియం లో శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. రంగారెడ్డి, జగిత్యాల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా M అంగన్వాడి యాప్ ను అమలు చేసేందుకు నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో 5 అంగన్వాడీ కేంద్రాల్లో సదరు యాప్ ను వినియోగించి, వచ్చిన అభిప్రాయాల ఆధారంగా అవసరమైన అదనపు లక్షణాలను యాప్ లో జత చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. M అంగన్వాడీ యాప్ వినియోగం పై అవసరమైన మేర శిక్షణ అందజేశామని, దీనిని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గత 15 సంవత్సరాలుగా గమనిస్తే అంగన్వాడీ కేంద్రాల్లో అనేక మార్పులు వచ్చాయని, ప్రజలకు అందించే సేవలు మెరుగు అవుతున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల పనితీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతంలో ఆశించిన ఫలితాలు రావడం లేదని కలెక్టర్ తెలిపారు. సి డి పి వో లు, సూపర్వైజర్లు, పట్టణ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాల పై, ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.
పేద ప్రజలు, దినసరి కూలీలు బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు అంగన్వాడీ కేంద్రాల్లో అధికంగా లబ్ధిదారులుగా ఉంటారని అని వారికి అత్యంత మెరుగైన సేవలు అందించే దిశగా నిర్విరామంగా కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అంగన్వాడి టీచర్లు, సహాయకులు మానవతా కోణంలో తమ విధులు నిర్వహించాలని, సామాజిక స్పృహతో, గర్భిణీ మహిళలకు అవసరమైన సహకారం అందజేయాలని సూచించారు.మంచి ప్రతిభ కనబరిచిన 10 అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి,2 మాసాల్లో మోడల్ అంగన్వాడి కేంద్రాలు గా తీర్చిదిద్దుతామని కలెక్టర్ తెలిపారు. M అంగన్వాడి ఆప్ పైలెట్ ప్రాజెక్టు కింద రెండు దశల్లో అమలు చేయడం జరుగుతుందని, ఏప్రిల్, మే, జూన్ నెలలో అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడి టీచర్ల పనితీరు, వివరాలను యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని, రెండవ దశలో జూన్ మాసం తర్వాత మంచి ఫలితాలు సాధించిన అంగన్వాడి టీచర్లకు గుర్తించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. M అంగన్వాడి ఆప్ పనితీరు తదితర అంశాలపై సాంకేతిక నిపుణులు అంగన్వాడి టీచర్లకు వివరించారు.


స్విమ్మింగ్ పూల్ పరిశీలన !
అనంతరం స్టేడియం గ్రౌండ్ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న స్విమ్మింగ్ పూల్ ను పరిశీలించి నెలలోపు దానిని వాడుకలోకి తీసుకోని రావాలని అధికారులను ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి నరేష్, సీడీపీవోలు, మాస్టర్ ట్రైనర్స్, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.