జగిత్యాల ఏప్రిల్ 23:- రాష్ట్రంలో పల్లెల సమగ్ర అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జిల్లాలోని అంతర్గాం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, జెడ్పి చైర్ పర్సన్ తో కలిసి ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసే మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

అంతర్గాం గ్రామంలో రూ.1.8 కోట్ల వ్యయంతో నిర్మించే ఎల్లమ్మ గుడి రోడ్డు నిర్మాణ పనులకు, రూ.10 లక్షలతో నిర్మించే హనుమాన్ టెంపుల్ మండపం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జగిత్యాల జిల్లాలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అంతర్గాం గ్రామంలో మంత్రి ప్రారంభించారు.
జగిత్యాల జిల్లాలో అంతర్గం గ్రామానికి చాలా ప్రాముఖ్యత ఉందని, గ్రామస్తులంతా ఐక్యమత్యంతో ఉండటం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ రాజేశం గౌడ్ సూచించిన విధంగా గ్రామానికి డబుల్ రోడ్డు మంజూరుకు కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల ఫలితాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోని పల్లె సీమలలో 24 గంటల విద్యుత్, ఇంటింటికి త్రాగునీరు, హరితహారం కింద నాటిన పచ్చని చెట్లు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ ,నర్సరీ, ట్రాక్టర్ ఏర్పాటు చేసుకున్నామని మంత్రి తెలిపారు. గ్రామీణ అభివృద్ధి లో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 ఉత్తమ గ్రామాలలో 7 తెలంగాణ రాష్ట్రంలో ఉండడం గర్వకారణమని మంత్రి తెలిపారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు ,రైతు బీమా, సకాలంలో ఎరువులు విత్తనాలు సరఫరా, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో పరిష్కరించారని మంత్రి తెలిపారు. కరోనా సమయంలో సైతం రైతు సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలిగించలేదని మంత్రి పూర్తి చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వ్యవసాయ అభివృద్ధి గణనీయంగా పెరిగిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తున్నప్పటికీ యాసంగి కాలానికి సంబంధించి ధాన్యాన్ని కొన్ని వేల కోట్ల నష్టం భరించి రైతుల వద్ద నుండి మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి అన్నారు. యాసంగి సీజన్ లో అధిక ఉష్ణోగ్రతల వల్ల నుక శాతం అధికంగా ఉంటుందని, వీటి వల్ల కలిగే నష్టాన్ని పూర్తిగా 100% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉందని మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిందని, రైతుల ఉద్యమానికి దిగివచ్చి చట్టాలను వెనక్కి తీసుకుందని మంత్రి అన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యుత్ చట్టం రూపొందిస్తుందని, దీనిని సీఎం కేసీఆర్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రైతుల వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించాలని, లేనిపక్షంలో రుణాలు నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినప్పటికీ, సీఎం కేసీఆర్ రైతు ప్రయోజనాల దృష్ట్యా అంగీకరించలేదని మంత్రి తెలిపారు. దేశంలో అనేక రాష్ట్రాలు కేంద్ర ఒత్తిడికి అంగీకరించి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నాయని, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో సైతం మీటర్లు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. రైతు పక్షపాతి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని, ఇలాంటి ఒత్తిడులకు లొంగ కుండా 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ,మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్, సుద్దాల దేవయ్య, జిల్లా కలెక్టర్ జి. రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు