సంస్కృత భాష -భారతీయ మాతృ భాష
మనలో చాలామందికి సంస్కృత భాషపై ప్రేమ మరియు గౌరవం ఉంటాయి, ఎందుకంటే అది దైవభాష అని ఒక నమ్మకం. వేదాలు, పురాణాలు మరియు ఇతర పూజా విశేషాలు అన్నీ సంస్కృతంలోనే చెప్పబడ్డాయి. అందుకే అది ఒక బ్రాహ్మణ వృత్తిలో ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉండాలి అనే భ్రమను మనకు మార్కెట్ చేయబడ్డది. కానీ ఇదంతా ఒక పెద్ద కుట్ర….ఇతర దేశాలనుండి ఇక్కడకు వచ్చి మన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సంపదను దోచుకున్న దుర్మార్గులు కల్పించిన ఒక కల్పన…వారు మనదేశం నుంచి ఎంత సంపదను ఎన్ని సార్లు దోచుకుపోయినా కూడా, మళ్ళీ మళ్ళీ కొద్దికాలంలోనే గొప్పదేశంగా మారుతుందంటే ఈ గొప్పదనం మన పూర్వీకులు మనకు ఇచ్చిన అసలైన సంపద – విజ్ఞాన సంపద..

అదే మన భాష – సంస్కృత భాష
ఇది మనం పోగొట్టుకుంటే మాత్రం ఇక మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. ప్రపంచంలోని ఇతర భాషలు భారతదేశంలో అడుగుపెట్టకముందు సంస్కృత భాష చాలా సాధారణ భాష, జానపద భాష, అందరూ ఈ భాషలోనే మాట్లాడేవారు..అనేక విజ్ఞాన సంబంధ విషయాలు, అనేక పనిముట్లను వాడే పద్ధతులు, ఆయుర్వేద గ్రంథాలు అన్నీ ఈ భాషలో రాయబడ్డాయి. ఎందుకంటే అన్ని వృత్తుల వారు ఈ భాషలోనే ఆలోచించేవారు.ఎప్పుడైతే ఈ భాషను ఒక దైవ భాషగా, పూజలకు యజ్ఞాలకు మాత్రమే వాడే భాషగా మార్కెట్ చేయబడ్డదో అప్పట్నుంచి భాష యొక్క పతనం మొదలైంది. మనందరికీ భాషపై గౌరవం కంటే భయం మొదలైంది, అందుకే ఈరోజు సంస్కృతం కొద్దిమందికే సొంతమనే నమ్మకం కలుగుతున్నది..

సంస్కృత భాష ఎందుకు మన మాతృభాష అంటే వేరే ఏ భాషలోనైనా అక్షరాలు పదాలుగా ఏర్పడ్డతర్వాత మాత్రమే అర్థం ఉంటుంది, కానీ సంస్కృతంలో ప్రతి అక్షరానికి అర్థం ఉంటుంది. ఉదా: నమః అనే పదంలో మః అంటే నేను, న అంటే లేను, కాను. నమః అంటే నేను లేను అంతా ఒక్కటే ఉన్నది అనే అర్థంలో వాడతాం. నమఃశివాయ అంటే నేను లేను ఉన్నది ఒక్కటే పదార్థం అని అర్థం. అందుకే వీటిని బీజాక్షరాలు అనీ పిలుస్తాం. .కానీ, అక్షరాలను దేవతలను చేసి, భాషను బ్రాహ్మణులకు అప్పచెప్పి, ఆక్రమణదారులు దేశాన్ని సంస్కృతిని నాశనం చేశారు .

.ఒకప్పుడు అన్ని కులాలవారు సంస్కృతంలోనే మాట్లాడినట్లు అనేక రుజువులు ఉన్నాయి. అలా అన్ని వర్ణాల వారికి ఈ భాష రాకుంటే వ్యవసాయం గురించి, ఆయుర్వేదం గురించి, అనేక చెట్ల గురించి, ఇంజినీరింగ్ గురించి, న్యాయశాస్త్రం, గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం, ఇలా అనేక విషయాల గురించి వేదాల్లో పురాణాల్లో ఏ విధంగా చెప్పబడింది?అప్పట్లో సమాజంలో ఉన్న అన్ని వర్గాలవారికి విజ్ఞానబోధ గురుకులాల్లో జరిగేది. వారి వారి ఇష్టానుసారం వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పొందే వారు. వారి యొక్క నైపుణ్యాన్ని బట్టి వర్ణ విభజన జరిగేది అంతే కానీ వర్ణాన్ని (కులాన్ని) బట్టి నైపుణ్యాన్ని ఆపాదించేవారు కాదు. ఉదా: విశ్వామిత్రుడు ఒక క్షత్రియుడు కానీ ఆయన ఇష్టంతో బ్రహ్మర్షిగా మారాడు. ఇలా అనేకమంది వారి పుట్టుకతో పనిలేకుండా గొప్ప జ్ఞానాన్ని పొంది ఋషులు, మహర్షులు అయినారు. అందుకే సంస్కృతభాష మనందరి భాష, ఒక సాధారణ భాష, మన మాతృభాష
మనందరం నేర్చుకోవాల్సిన భాష.
దయచేసి కొంతనైన సంస్కృతాన్ని చదవండి, నేర్చుకోండి. మీరు కచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు. నా మాట నమ్మండి మన పూర్వీకులు మనకు ఇచ్చిన అసలు సంపదను అర్థం చేసుకోండి.

సంస్కృత భాష జిజ్ఞాసి.
.
అమర్ నాథ్ సారంగుల
Entrepreneur
ఐఐటీ రూర్కీ
(Governing council member, National institute of MSME)
వ్యాసకర్త.