ధర్మపురిలో పకడ్బందీగా తాగునీటి సరఫరా జరగాలి-కలెక్టర్!

ఏప్రిల్ 6:- పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణంలో పకడ్బందీగా త్రాగునీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ధర్మపురి పట్టణంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ హరిత హారంలో నాటిన మొక్కలను, త్రాగునీటి పైప్ లైన్ పనులను పరిశీలించారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో త్రాగునీటి సరఫరా చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మున్సిపాలిటీలలో నీటి సరఫరా పనులు పూర్తయినప్పటికీ అంతర్గత పనులు పెండింగ్లో ఉన్నాయని, ధర్మపురి పట్టణంలో త్రాగునీటి సరఫరా కోసం అందుబాటులో ఉన్న పైప్లైన్ వ్యవస్థను మరమ్మతులు పూర్తి చేసి సిద్ధం చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.

ధర్మపురి త్రాగునీటి సరఫరా స్టెబిలైజ్ అవ్వడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణంలో రాబోయే వేసవి కాలంలో ఎలాంటి త్రాగు నీటి ఇబ్బందులు ఎదురవకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న నీటి వనరులు సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నందున, త్రాగు నీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ధర్మపురి పట్టణంలో మిషన్ భగీరథ బల్క్ నీటి సరఫరా పనులు పూర్తి చేసామని, అంతర్గతంగా ఉన్న పైప్లైన్ వినియోగించుకుంటూ ఇంటి వద్దకు తాగునీటి సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టణంలో 3.7 లక్షల లీటర్ల సామర్థ్యం గల 10 ఓవర్ హెడ్ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయని, పైప్లైన్ సైతం అందుబాటులో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ బల్క్ నీటి సరఫరా ఓహెచ్డి ట్యాంకుల కు అందిన తర్వాత అంతర్గత పైప్లైన్ ద్వారా ఇంటి వద్దకు నీటి సరఫరా జాగ్రత్తగా అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు వెడల్పు పనులు, మరమ్మత్తుల పనులలో భాగంగా పైపులైను లీకేజి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని, అలాంటి సమయంలో త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పైప్ లైన్ లీకేజి సమయంలో మరమ్మత్తు కోసం వినియోగించాల్సిన స్పేర్ పైప్ లైన్ భాగాలు ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

త్రాగునీటి సరఫరా ఫుల్లు ఉత్పన్నమయ్యే సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం చూపే విధంగా యాక్టివ్ గా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రాబోయే వేసవి సీజన్లో ధర్మపురి పట్టణంలో ఎవరికి త్రాగునీటి ఇబ్బంది కలగవద్దని, ట్యాంకర్ల ద్వారా ప్రజలు నీటి సరఫరా పోందాల్సిన దుస్థితి ఏర్పడితే మున్సిపల్ కమిషనర్ సంబంధిత కౌన్సిలర్ పై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. త్రాగునీటి సరఫరా అంశమును మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ చాలా సీరియస్ గా తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దని కలెక్టర్ సూచించారు. ధర్మపురి మున్సిపల్ ఛైర్పెర్సన్ సత్తెమ్మ, ఆర్.డి.ఓ.లు, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత అధికారులు ప్రజలు సమావేశంలో పాల్గొన్నారు