J. Surender Kumar,
భారతీయ జనతా పార్టీ వల్ల దేశానికి ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీని ఢీకొంటున్న సీఎంలు ఎవరూ లేరు. కేసీఆర్, మమత మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్‌కు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని ఉండవల్లి స్పష్టం చేశారు. బీజేపీని ఎదుర్కొనే దమ్ము కేసీఆర్‌కు ఉందని ఉండవల్లి తేల్చిచెప్పారు. కేసీఆర్ కరెక్ట్ లైన్‌లోనే వెళ్తున్నారని.. పక్కా అజెండా ఉందని అన్నారు.
కేసీఆర్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని
ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ మీడియాతో పంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పది రోజుల క్రితం ఫోన్ చేశారు. ఒకసారి రండి అన్నారు. సరే మాట్లాడుకుని పదేండ్లు అవుతోంది. మొదటిసారి ఎంపీ అయినప్పుడు కొంచెం మాట్లాడుకునే వాళ్లం. సెకండ్ టైం ఎంపీ అయ్యాక ఇంట్రాక్షన్ లేదు. కేసీఆర్ సీఎం అయ్యాక తొలిసారి కలిశాను. నిన్న లంచ్‌కు పిలిచారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు మాట్లాడామని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.
జాతీయ పార్టీ గురించి చర్చ జరగలేదు..
మొత్తానికి మీరు అనుకుంటున్నట్టు జాతీయ పార్టీ గురించి చర్చ జరగలేదు. ఆంధ్రాకు నువ్వు ఇంఛార్జి అనే విషయం చర్చకు రాలేదు. బీజేపీ విషయంలో నేను అనుకున్నదే ఆయన అనుకున్నారు. బీజేపీని సరిగ్గా వ్యతిరేకించకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదాలు తప్పవని కేసీఆర్ చెప్పారని అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
ఏపీలో బీజేపీ బలంగా ఉంది..
ఏపీలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. ఏపీలో ఏ పార్టీ నెగ్గినా బీజేపీతోనే ఉంటాయి. బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదు. కేసులకు భయపడి మొన్నటిదాకా బాబు వ్యతిరేకించలేదు.. ఇవాళ జగన్ కూడా వ్యతిరేకించడం లేదు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకే మద్దతిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క మాట కూడా అనరు. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద వారికి వ్యతిరేకత లేదని ఉండవల్లి స్పష్టం చేశారు.
బీజేపీకి చెక్ పెట్టాల్సిందే..
మోదీ ప్రధాని అవటంలో అభ్యంతరం లేదు. అయితే వారి విధానాలు బాగాలేవు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో నాలుగైదు దేశాలు క్షమాపణలు కోరాయి. ప్రపంచంలోని అన్ని దేశాల మీద మనం ఆధారపడ్డాం. మన దేశంపై కూడా ఇతర దేశాలు ఆధారపడ్డాయి. ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకం అని ముద్ర పడితే చాలా నష్టపోతాం. కానీ దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని ఉండవల్లి తేల్చిచెప్పారు.
కేసీఆర్‌కు చాలా క్లారిటీ ఉంది.
.ఈ దేశంలో అపోజిషన్ ఉండొద్దనే ఉద్దేశంతో బీజేపీ కేసులు పెడుతోంది. ఏదో ఒక రకంగా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రాష్ట్ర సీఎం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. వారిని ఎదుర్కొనే దమ్ము కేసీఆర్‌కు ఉందన్నారు. ఆయన మీద గౌరవం ఉంచి పిలిచిన వెంటనే ఉన్నాను. ఆయనకు చాలా క్లారిటీ ఉంది. ఒక ఎజెండాతో ఉన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చెప్పారు. సాగు, తాగునీటితో పాటు కరెంట్ తో పాటు ఇతర సమస్యలపై చాలా హోం వర్క్ చేశారు. దాని మీద చెబుతుంటే నేను ఆశ్చర్యపోయానని ఉండవల్లి తెలిపారు.
బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారు. దాదాపు 3 గంటల పాటు చర్చించాం. బీజేపీ విషయంలో మాట్లాడటం ఇంకా పెంచాలని తనకు సూచించారని ఉండవల్లి చెప్పారు. బీజేపీకి చెక్ చెప్పకపోతే.. ఆ పార్టీకి ఉన్న 36 శాతం ఓటు బ్యాంకు పెరిగే ప్రమాదం ఉంది. బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.
మళ్లీ త్వరలోనే పిలుస్తానని చెప్పారు..
మళ్లీ త్వరలోనే పిలుస్తానని చెప్పారు. లంచ్‌లో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు. ఆయన చర్చలో ఎక్కువ పార్టిపిషేన్ చేయలేదు. హరీశ్‌రావు రీసివ్ చేసుకున్నారు, ఆయనతో అర గంట పాటు చర్చించిన తర్వాత కేసీఆర్‌తో సమావేశమయ్యాను. చాలా విషయాలపై కేసీఆర్ క్లారిటీగా ఉన్నారు. ఆధారాలతో సహా చర్చించారు. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. రాబోయే రోజుల్లో ఇలా అవ్వబోతోంది. దీని కోసం ఏం చేయాలో చర్చించాం. మళ్లీ పిలుస్తాను రావాలన్నారు. రావడానికి అభ్యంతరం లేదని చెప్పాను. మనమంతా అండర్ స్టాండింగ్‌గా ఉండాలన్నారు. తన పార్టీ తరపున ఉండాలని ఆయన అడగలేదని ఉండవల్లి స్పష్టం చేశారు.