ఓ ప్రాంతీయ పార్టీ , జాతీయ స్థాయిలో రాజకీయ మనుగడ సాధిస్తుందా ?

J.Surender Kumar,


” పన్నెండేళ్ళ ఉద్యమం, ఎనిమిదేండ్ల అధికారం తరువాత టీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖరరావు జాతీయ పార్టీ ఏర్పాటు వైపు అడుగులు వేస్తుండటాన్ని ప్రతి ఒక్కరూ ఆసక్తితో గమనిస్తున్నారు.
జాతీయ రాజకీయాలలో బలమైన ప్రత్యామ్నాయ శక్తి ఉండాలన్న తలంపులతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారన్నది ఇప్పటివరకు బయటకు వచ్చిన వార్తల సారాంశం.


అయితే దక్షిణాదికి చెందిన ఓ ప్రాంతీయపార్టీ జాతీయ స్థాయిలో ఆయా రాష్ట్రాల ప్రజల మన్ననను పొందగలదా ? మనుగడ సాధించగలదా ? అన్నదే ఇక్కడ ప్రశ్న.
దేశ రాజకీయాల్లో ఉత్తరాదిదే పెత్తనం అని రాజకీయాల్లో ఓనమాలు రానివారు కూడా అంగీకరించే నిజం.
ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ తీసుకున్న జాతీయ ఆరంగ్రేటం నిర్ణయం నిస్సందేహంగా సాహసోపేతమైనదని చెప్పుకోవచ్చు.
అయితే జాతీయ స్థాయి ప్రజానీకాన్ని మెప్పించడం
తెలంగాణలో మాదిరిగా సులువు అవుతుందని భావించడం వరకు బాగానే ఉన్నా, ఆచరణలో అది ఏ మేరకు సత్ఫలితాలు ఇవ్వగలద న్నది, మిలియన్ డాలర్ల ప్రశ్న.


మరో ఏడాదిన్నర కాలంలో అధికార టీఆర్ఎస్ రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కొనబోతున్నది. గత రెండు ఎన్నికల సందర్భంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు.
కొద్ది రోజుల క్రితం వరకు ఏకచ్ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన గులాబీ నేత, ప్రస్తుతం వ్యూహకర్తలపై ఆధారపడాల్సిన అనివార్యతలు కల్పించడం రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎదుర్కొంటున్న విషమ పరిస్థితిని

Northester states


చెప్పకనే చెబుతోంది.
తెలంగాణ వరకు టిఆర్ఎస్ , పటిష్టమైన రాజకీయ శక్తిగా అందరూ అంగీకరించాల్సిందే.
స్థానిక సంస్థల ప్రతినిధులు మొదలు రాజకీయ వాదులంతా అదే గూటిలో ఉన్నారు.
ఇదే పరిస్థితి జాతీయ రాజకీయాలలోను ఉంటుందని భావిస్తే అది ఒట్టి భ్రమే.
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలలోకి, లేదా అధికారంలోకి రాబోతుందని నమ్మకం ఉన్న పార్టీలలోకి నేతలు చేరడం అనేది ఓ ఆకర్షక సిద్ధాంతం.


దేశవ్యాప్తంగా తాడు, బొంగరం, లేని నూతన రాజకీయ పార్టీలోకి చేరే సాహసం ఎవరైనా చేస్తారని అనుకోవడం వట్టి మాటే.
జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలి కనుక ఆయా రాష్ట్రాలలోని మేధావులు, విద్యావంతులు, ఆలోచనాపరులను కొందరిని చేర్చుకోవడం కెసిఆర్ కు సాధ్యం అయితే కావచ్చు.
వారి వల్ల ఆ పార్టీకి ఏ మేరకు ప్రయోజనం ఉంటుందన్నది ?


ఆలోచించాల్సిన విషయం.
లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ, ఐఏఎస్ అధికారి,
తెలంగాణ జన సమితి ప్రొఫెసర్ కోదండరాం
చిత్తశుద్ధితో రాజకీయాలలోకి వచ్చినా వారు ఏ మేరకు విజయవంతం కాగలిగారన్నది మనం ప్రత్యక్షంగా చూశాం.


రాష్ట్రాలలో గట్టి పట్టు ఉన్న సాంప్రదాయ రాజకీయ వాదులు చేరనంతకాలం కెసిఆర్ , ఊహించిన జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కల సాకారం కాదు.
ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలలో కాలుమోపడం దక్షిణాది నుండి వచ్చే ఓ ప్రాంతీయ పార్టీకి అంత సాధ్యం కాదనేది నిర్వివాదాశం. ఒరిస్సాలో బీజు జనతాదళ్, పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, పాలన కొనసాగిస్తున్నాయి.

W.Bengal

ఇక్కడ మరో రాజకీయ పార్టీ ప్రవేశానికి అవకాశాలు లేవు.కలగుార గంపలాంటి ఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ అదనుచుాసి పాగా వేసింది. ఆ పార్టీ చేతిలో బిజేపి రెండు సార్లు ఘోర ఓటమి చవిచూసింది. పంజాబ్ రాష్ట్రంలోను ఆప్ అధికారం హస్తగతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వం రెండవ సారి అధికారం హస్తగతం చేసుకొని ప్రతిపక్ష పార్టీలను ఖంగు తినిపించింది. బీహార్ లో కుల సంస్కృతి, తుపాకుల సంస్కృతి, గుండా గిరి తెలిసిందే, ఈలెక్కన
తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలలో ఉనికి చాటుకోవడానికి మాత్రం జాతీయ రాజకీయ పార్టీ ప్రకటన ఉపయోగపడవచ్చు.

Tamilnadu


మహారాష్ట్రలో శివసేన ప్రాబల్యాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. మరోవైపు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా బలీయమైందే. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల నుండి నూతన జాతీయ పార్టీ లోకి చేరికలు ఉంటే ఉండొచ్చు.
తమిళనాడులో ద్రవిడ పార్టీలదే పెత్తనం..అక్కడ కాళ్ళునడానికి.. దశాబ్దాలుగా జాతీయ రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి చేస్తున్న ప్రయత్నాలే సఫలం కావడం లేదు. ఇక మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో టిఆర్ఎస్ ను, ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు.


ఉద్యమ కాలం నాటి విషబీజాలు వారి మనసుల్లో ఇంకా తొలగిపోలేదు.
రాష్ట్ర విభజనకు సంబంధించిన, నది జలాల వాడకానికి సంబంధించిన చిక్కులు, చికాకులు ఇంకా తొలగిపోలేదు.
ఈ స్థితిలో కేసీఆర్ నాయకత్వంలోని జాతీయ పార్టీని, ఆంధ్ర ప్రజలు గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు.
ఏతా వాతా దేశంలో ఏ రాష్ట్రాన్ని చూసిన నూతన రాజకీయ పార్టీ కనీసం అడుగుపెట్టే పరిస్థితులు కూడా సుదూరంలో కనిపించడం లేదు. మతపరమైన కారణాల ఆధారంగానే ఎంఐఎం మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బీహార్ లాంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాలలో అడుగు పెట్టగలిగింది. .ఆ స్థాయిలో కూడా టిఆర్ఎస్ ఆయా రాష్ట్రాల్లో వేళ్ళును కోగలదనే నమ్మకాన్ని ఆ పార్టీ వర్గాలే వ్యక్తం చేయలేకపోతున్నాయి.


రైతాంగ సమస్యలు, నదీజలాల వాడకం, విద్యుత్ ఉత్పత్తి తదితర సమస్యలు ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో పోరాడాలని భావిస్తున్న కెసిఆర్ కు.. నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి తెలంగాణలో చక్రం తిప్పినంత సులువు కాదు.
వీటన్నింటిని అధిగమించి జాతీయ పార్టీగా, కెసిఆర్ నేతృత్వంలోని సంస్థ, బలపడాలంటే కనీసం రెండు దశాబ్దాలయినా ఆగాల్సిందే. క్షణం అధికారం లేకపోతే ఆగం ఆగం అయ్యే రాజకీయ నేతలు, ఈ సుదీర్ఘ కాల పయనంలో పార్టీ పటిష్టతకు పనిచేసేందుకు ముందుకు వస్తారా? అది జరిగే పనేనా? ఇవన్నీ రాజకీయాలు అవపోసన పట్టిన కెసిఆర్ కు తెలియవా?


తెలంగాణలోనే తమకు తీవ్రమైన వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని
పాలకపక్ష పెద్దలకు తెలుసు. వాటిని అధిగమించి మరోమారు అధికారం దక్కించుకోవడం అంత సులువైన పనేం కాదని.. వాళ్లకు ఇప్పటికే అర్థం అయింది.
ఈ పరిస్థితుల్లో ఇంటిని చక్కదిద్దుకునే బదులు జాతీయ రాజకీయాల పేరుతో కథ నడిపించడంలో గులాబీ నేత ఉద్దేశం ఏమిటి? సమస్యలను దారి మళ్ళించి కొత్త అంశాలపై, చర్చకు ప్రజలను మళ్ళించేలా చేయడంలో టిఆర్ఎస్ అధినేత దిట్ట. నూతన రాజకీయ పార్టీ ప్రకటన బహుశా అందులో భాగమే కావచ్చు.