మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితారాణ,స్టడీ సర్కిల్ డైరెక్టర్ వేణుగోపాల్ రావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సివిల్స్, గ్రూప్ -1 పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చే విధంగా ఆ యా అంశాలలో నిపుణులైన వారి చేత ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ను త్వరితగతిన మంజూరు చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో వసతులను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
హాస్టళ్లలో విద్యార్థుల సౌకర్యార్థం డిజిటల్ క్లాస్ రూంలు, సౌరశక్తితో నడిచే వాటర్ హీటర్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు “సహజ “పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తుల గురించి మంత్రి వివరించారు. చౌకగా లభించే నాణ్యమైన ఈ ఉత్పత్తులను గురుకులాలు, హాస్టళ్లకు అందిస్తే బాగుంటుందని, ఈ అంశాన్ని పరిశీలించవలసిందిగా మంత్రి కోరగా, కమిషనర్ యోగితారాణ సానుకూలంగా స్పందించారు.

సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి:
తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి పిలుపునిచ్చారు.
గురువారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ కార్యాలయంలో విద్యార్థులకు అవసరమైన స్టడీ చైర్స్, రైటింగ్ ప్యాడ్స్,కూలర్లను గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ తో కలెక్టర్ అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను దశల వారీగా విడుదల చేస్తుందని, ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా యువత అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా విద్యార్థులకు విద్యార్థులకు 2 నెలల పాటు గ్రూప్ స్థాయి నాణ్యమైన శిక్షణ ఉచితంగా అందిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా యువతకు యూనిఫామ్ కోర్సులలో శిక్షణ అందిస్తున్నామని అన్నారు.
జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో త్వరలో బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభిస్తున్నామని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయం ప్రకారం శిక్షణ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో మరింతమంది యువతకు సహకారం అందించేందుకు గ్రంథాలయాలను బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ద్వారా తగిన సహకారం అందజేస్తున్నామని కలెక్టర్ అన్నారు.జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థులు సౌకర్యార్థం 150 కుర్చీలు,150 రైటింగ్ ప్యాడ్స్, 20 కులర్లు పంపిణీ చేశామని, త్వరలో షెడ్ సైతం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అన్నారు. యువత గ్రంథాలయంలో అధిక సమయం గడిపేందుకు గ్రంథాలయ సమయాన్ని పొడిగిస్తామని కలెక్టర్ అన్నారు

. జిల్లాలో అర ఎకరం స్థలంలో త్వరలో రూ.1.5 కోట్ల ఖర్చుతో శాశ్వత గ్రంధాలయ నూతన భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని కలెక్టర్ అన్నారు.
విద్యార్థులు అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని, ప్రభుత్వం విడుదల చేస్తున్న నోటిఫికేషన్ల లో ఒక దాని పై ప్రత్యేక శ్రద్ధ వహించి , పూర్తి ఏకాగ్రతతో ప్రిపేర్ కావాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా నుంచి సివిల్స్ లో 374 ర్యాంకు సాధించిన శరత్ నాయక్ సైతం ప్రభుత్వం అందించిన సదుపాయాలు వినియోగించుకుని విజయం సాధించారని, జిల్లా కలెక్టర్ గారి అందించిన గైడెన్స్ విద్యార్థులు పాటించి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో శ్రీమతి మాధురి , జిల్లా గ్రంథాలయ సెక్రటరీ సరిత గ్రంథాలయ సభ్యులు మారంపల్లి బాబు , గ్రంథాలయం అధికారులు, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన వారికి పథకాల లబ్ధి చేకూర్చాలి: కలెక్టర్
– అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధించిన అధికారులను ఆదేశించారు. కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, ధరణి పెండింగ్ మ్యూటేషన్, అక్రమ ఇసుక రవాణా నియంత్రణ తదితర అంశాల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
జిల్లాలో గత 2 వారాలుగా మండలాల వారీగా సీజ్ చేసిన అక్రమ ఇసుక రవాణా వివరాలు కలెక్టర్ తహసిల్దార్ లను అడిగి తెలుసుకున్నారు. అక్రమ ఇసుక రవాణా క్షేత్రస్థాయిలో నిలిపివేసేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, అధికారులు క్షేత్ర స్థాయిలో నిఘా పెంచాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో 173 పాఠశాలలో మన ఊరు మన బడి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, వీటికి అవసరమైన ఇసుకను కేటాయించాలనే, దీనిపై సంపూర్ణ నివేదిక తయారు చేయాలని కలెక్టర్ ఆర్డీవోలకు ఆదేశించారు.
జగిత్యాల రూరల్, ధర్మపురి, మల్లాపూర్, కోరుట్ల మండలాలలో అధికంగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, తాసిల్దారు సంబంధిత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం ధరణి దరఖాస్తులు, పెండింగ్ మ్యూటేషన్, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం మండలాల వారీగా వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఓటరు జాబితా దరఖాస్తుల పరిష్కారం సమయం గడిచినప్పటికీ జగిత్యాల నియోజక వర్గ పరిధిలో 53, కోరుట్ల నియోజకవర్గ పరిధిలో 21 దరఖాస్తులు పెండింగ్లో ఉండడానికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీసారు. వీటిని వెంటనే నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
అదనపు కలెక్టర్ బి.ఎస్. లత , జగిత్యాల,కొరుట్ల, రెవెన్యూ డివిజన్ అధికార్లు, తాసిల్దారు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర అభివృద్ధితోపాటు దేశాభివృద్ధి జరుగుతుందని
ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
గురువారం చొప్పదండి నియోజవర్గం గంగాధర మండలం గట్టు బూత్ పూర్ గ్రామంలో నిర్వహించిన ఐదవ విడత పల్లె ప్రగతి గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామ అభివృద్ధిని పటిష్టం చేయడంలో భాగంగా పంచాయతీ రాజ్ చట్టం తేవడం జరిగిందన్నారు.

ఈ చట్టం ద్వారా సర్పంచ్ కు అధికారాలు, బాధ్యతలు అప్పగించడం జరిగింది అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ సరిగా పని చేయని పక్షంలో తొలగించవచ్చని తెలిపారు. ప్రతి తండాకు గ్రామపంచాయతీ గా మార్చడంతో పాట ఒక గ్రామ కార్యదర్శి ని కూడా నియమించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామపంచాయతీలకు ప్రతి జీపి కి ఒక కార్యదర్శి నియమించడం జరిగిందని, ఏ కారణం చేతనైనా కార్యదర్శి పోస్ట్ ఖాళీగా అయితే అట్టి పోస్ట్ ను భర్తీ చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఇవ్వడం జరిగిందన్నారు.

గతంలో
6-10 నెలలకోసారి గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చేవని ఇప్పుడు ప్రతి నెల రాష్ట్రంలోని 12వేల గ్రామపంచాయతీలకు 250 కోట్లు పంపడం జరుగుతుంది అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి 2.50 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం కింద గత మూడు నెలల్లో వెయ్యి కోట్లు సిసి రోడ్లకు ఇవ్వడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ గ్రామాలకు శుద్ధ జలాలను సరఫరా చేస్తున్నట్లు, రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో గ్రామాలు అపరిశుభ్రంగా ఉండి మలేరియా, డెంగ్యూ,డయేరియా లాంటి విషజ్వరాలతో ప్రజలు ఆరోగ్యపరంగా ఇబ్బందులుపడి వేలాది రూపాయలు ఖర్చు చేసుకునే వారని కానీ నేడు పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెరగడంతో గ్రామాల్లోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు అన్నారు. గ్రామాలు పరిశుభ్రమైన ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు అన్నారు. గ్రామాల పరిశుభ్రతకు నిధులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే అని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని అన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా డస్ట్ బిన్ లో వేయ వలసిన బాధ్యత ప్రజలదే అన్నారు. ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు ఏడు వేల కోట్లు నిధులు కేటాయించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యాబోధన చేయడం జరుగుతుందని పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి విద్యార్థికి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని అన్నారు. అధికారులు ప్రజల భాగస్వామ్యంతో పని చేసినప్పుడే మంచి ఫలితాలను సాధించవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా పల్లె ప్రగతి నివేదిక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు గట్టబూత్కూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను, మురుగు నీటి కాలువలను, నర్సరీలను, పల్లె ప్రగతి వనం, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామంలను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం మొదలు పెట్టక ముందు గ్రామాల్లో అపరిశుభ్రమైన వాతావరణంతో డెంగ్యూ, విష జ్వరాలు ప్రభలి ప్రజలు ఇబ్బందులు పడేవారని, పల్లె ప్రగతి కార్యక్రమం తో గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉండడంతో గ్రామాల్లో డెంగ్యూ విషజ్వరాలు తగ్గిపోయాయని అన్నారు. గ్రామాల్లో డ్రైడే పాటించటం వల్ల దోమలు లేవన్నారు. మన గ్రామం బాగుండి మోడల్ గ్రామపంచాయితిగా ఉండాలంటే ప్రగతి కార్యక్రమాలను కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా నిత్యం జరిగేలా చూడాలని అన్నారు. గతంలో డెంగ్యూ వంటి విషజ్వరాలు అధికంగా ఉండేవని, ఇప్పుడు చేపడుతున్న ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో 2,3 కేసులు నమోదవుతున్నాయని అన్నారు మన ఇంటినుండి ప్రతిరోజు వెలువడే చెత్తను తడి పొడిగా వేరుచేసి చెత్తను సేకరించే వాహనాలకు అందించడం ద్వారా కంపోస్టు ఎరువును తయారుచేసుకోగలుగుతామని అన్నారు. 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయితీలు, హాబిటేషన్ లలో ప్రవేశపెట్టిన క్రీడాప్రాంగణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవి శంకర్ మాట్లాడుతూ గత ఏడున్నర సంవత్సరాల క్రితం తెలంగాణ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అని ప్రజలు గమనించాలన్నారు. కలలుగన్న గ్రామస్వరాజ్యం రావాలని, పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అని మా గాంధీ కన్న కలలను సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. దేశంలో లక్షల గ్రామాలు ఉన్నప్పటికీ జాతీయస్థాయిలో పదికి పది అవార్డులు మన తెలంగాణకు వచ్చాయన్నారు. చొప్పదండి నియోజకవర్గం లో వెలిచాల కొడిమ్యాల గ్రామాలకు వచ్చినవి అని అన్నారు. గతంలో నాయకులు చెట్లు నాటే ఫోటో దిగి తర్వాత చెట్లను రోడ్లను పట్టించుకునే వారు కాదని అన్నారు. వాతావరణ సమతుల్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో వేలాది మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు.

రోడ్డుకు ఇరువైపులా చెట్లు, నర్సరీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గతంలో జూలై, ఆగస్టు మాసాల్లో డెంగ్యూ, విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడేవారు అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో గ్రామాల్లో దోమలు పారిపోయే అన్నారు గ్రామాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడం వల్లే ఆరోగ్య సమాజం ఏర్పడిందన్నారు. పిల్లలు క్రీడలకు దూరమై మొబైల్ ఫోన్లకు, టీవీలో అంకితమైతున్నారని, పిల్లల మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి గ్రామానికి ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఊరూరా పల్లె ప్రగతి వివరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గట్టుబుత్కూర్ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణం కోసం రూ 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కరీంనగర్ అర్డిఓ ఆనంద్ కుమార్ జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య జడ్పిటిసి పుల్కాం రాధా నరసయ్య, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు కంకణాల రాజగోపాల్ రెడ్డి, సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు