( J.Surender Kumar,)
పందులను అడ్డుపెట్టుకుని కొన్ని సామాజికవర్గాల వాళ్లు రుణవసూళ్లు చేసిన నాటి పరిస్థితులెందరికి గుర్తున్నాయోగానీ… నేటి లోన్ యాప్స్ పరిస్థితీ అందుకు భిన్నమేమీ కాదు. అప్పుడు పందులను ఇళ్లకు తీసుకొచ్చి వసూళ్లు చేస్తే… ఇప్పుడు పరువు, మర్యాదలకు భంగం కల్గిస్తూ వసూళ్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుత సమాజంలో శృతి మించుతున్న లోన్ యాప్స్ పై పాలకులు ఉక్కుపాదం మోపే యోచన చేయకపోతే… అమాయక జనానికి రక్షణే కరువవుతున్న పరిస్థితులు నానాటికీ కళ్లకుగడుతున్నాయి.
లేనోడు ఎలాగైనా బతికేయగలడు… ఉన్నోడికి ఇలాంటి లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకునే గత్యంతరమే ఉండదు. ఇక మిగిలింది సామాన్య మధ్యతరగతి. పరువు, మర్యాదలే ప్రాణంగా జీవించే సగటు మధ్యతరగతి వ్యక్తులే టార్గెట్ గా ఇప్పుడు లోన్ యాప్స్ ప్రాణాంతంకంగా మారుతుండటం… సమాజంలో పెచ్చుమీరుతున్న ధోరణులకు ఓ నిలువెత్తు సాక్ష్యం.
రెండు దశాబ్దాల క్రితమే కరీంనగర్ జిల్లాలో ఇలా లోన్ యాప్స్ తరహాలోనే పందుల వేధింపుల వ్యవహారం సంచలనం రేపింది. గ్రామాల్లో నాడు ఇలాంటి పైనాన్స్ సంస్థలను కూడా పందుల ఫైనాన్సనే పిల్చేవారు. పందులను ఇళ్లకు పట్టుకొచ్చి కొన్ని సామాజికవర్గాల వారు నిర్భంధంగా వసూళ్లు చేసే పర్వం ఒక్కో ఇంట్లో హృదయవిదారకంగా కనిపించేది. ఆస్తులు, వ్యవసాయ భూములు అమ్మి రెట్టింపు వడ్డీతో సహా చెల్లించినా… రుణవిముక్తి కల్గక చాలామంది సాధారణ మధ్యతరగతి ప్రజల బాధ అరణ్య రోదనయ్యేది.

సరిగ్గా 20 ఏళ్ల క్రితం జగిత్యాల జిల్లాలో ఓ కుటుంబం పందుల ఫైనాన్స్ లో డబ్బులు రుణంగా తీసుకున్న పాపానికి ఆ డబ్బు తిరిగి చెల్లించలేక.. వడ్డీలు, వడ్డీలకు వడ్డీగా బారువడ్డీ, చక్రవడ్డీలు కట్టలేక బలవన్మరణానికి గురైంది. అయితే ఈ ఫైనాన్స్ ఇచ్చేవారంతా ఎక్కడో ఏసీ గదుల్లో ఉండరు. పంటపొలాల మధ్య వలస జీవుల్లా కనిపించే ఓ వర్గం వీరిది. పందుల పెంపకం చేస్తూ… వాళ్ల దగ్గరున్న డబ్బులను మిత్తీలకిస్తూ… సామాన్య, మధ్యతరగతి జన మానాన్నే ఆసరగా చేసుకుని ప్రాణాలు తోడేసెంత వేధింపులకు పాల్పడేవారు. అప్పు ఇవ్వాలన్నా కొన్ని కండీషన్స్ అప్లై అనేవారు. ఎలాంటి డిపాజిట్స్ గానీ.. బంగారం, వెండి వంటివి తాకట్టుగానీ లేకుండా కేవలం అప్పు పత్రంపై ఓ సంతకంతో అప్పిచ్చేవారు. ఆ అప్పులెలా ఉండేవంటే వందకు 14 రూపాయలు… పదివేలు కావాలంటే ముందే వెయ్యి కట్ చేసుకోవాల్సిందే… అంతేకాదు, పదివేలల్లో వెయ్యి కట్ చేసుకుని.. ఆరునెలల వడ్డీ 5 వేల రూపాయలతో కలిపి… మొత్తం 14 వేల రూపాయలకు ప్రామిసరీ నోట్ రాయించుకుని… నెలకు వంద రూపాయలకు 2 రూపాయల మిత్తీ చొప్పున ఆర్నెల్ల వాయిదావరకూ ఈ అప్పిచ్చేవారు.
అయితే అప్పివ్వాలంటే గ్రామంలో సొంత ఇల్లు కల్గి ఉండాలి. లేదా, సమిష్ఠి కుటుంబమైనా అయ్యుండాలి. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జమానత్ దారుడై ఉండాలె. అప్పుడుగానీ ఈ ఫైనాన్స్ లో అప్పులు లభించేవి.
అప్పు వసూళ్లు చేసే తీరు!
గడువు ముగిసినా బాకీలు తీర్చకపోతే… ఇక సినిమా చూపించుడే ఉండేది. ఎలాంటి ఇతర కిరాయిగూండాలు, మందీ మార్బలం అవసరమే ఉండేది కాదు. సదరు సామాజికవర్గీయులు తమ పందులతో సహా వచ్చి మానంగా బతుకున్న మధ్యతరగతి ఇళ్లల్లో తిష్ఠ వేసేవారు. బాకీ డబ్బు చెల్లించేవరకూ ఆ ఇంట్లోనే తిండి, వంట, పడుకోవడం ఇలా సాగేది.

కొందరినైతే ఏకంగా కిడ్నాపులు చేయడం… భయపెట్టి వసూళ్లు చేయడం వంటివెన్నో సరిగ్గా 20 ఏళ్ల క్రితం జరిగినవే. దీంతో చాలా మంది బలవంతంగా ఊపిరాగిపోయివాళ్లూ ఉన్నారు. నాటి పందుల ఫైనాన్సుల తీరుపై ఉన్నతాధికారులకు విన్నవించినా లాభం లేకపోవడం… బాహటంగా మాట్లాడితే తమకెక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో కొందరు పెద్దమనుషులు మీడియా దృ,ష్టికి తీసుకొచ్చి పందులతో బెదిరించే ఫైనాన్స్ దందాకు తెర దించాలనుకున్నారు. అలా మీడియాలో వచ్చిన కథనాలు నాడు పోలీస్ కేసులు చేసేవరకూ తీసుకుపోవడంతో… ఆ పందుల వడ్డీవ్యాపారం కాస్తో కూస్తో నాడు కట్టడైంది.
ఇలాంటి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న కొందరిపై ధర్మపురి పోలీస్ స్టేషన్ లో 2001 ఆగస్ట్ 27న క్రైమ్ నంబర్ 136/2001 పేరిట కేసు నమోదైంది. అప్పుడు పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అది కాస్తా కంట్రోలైంది. ఇక ఇప్పుడు ఆ తరహాలోనే లోన్ యాప్ లు ప్రాణాలు తీస్తుండటంతో మరోసారి ఫైనాన్స్ వ్యాపారం వివిధ మార్గాల్లో ఎలా జరుగుతుందో చర్చకు వస్తోంది.
రాష్ట్రంలో 80 లోన్ యాప్స్…
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో ప్రస్తుతం రాష్ట్రంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలూ
చోటుచేసుకుంటున్న క్రమంలో… ఆర్థికశాఖ కార్యదర్శే ఏకంగా ఆర్బీఐకి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. లోన్ యాప్స్ ఉదంతంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. ఈడీ దాడులు నిర్వహించి… 12 కంపెనీలకు సంబంధించి 105 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు కూడా చేయడంతో పాటు… 15 వందల కోట్ల రూపాయల నగదును స్వాధీనపర్చుకుంది. లోన్ యాప్స్ ద్వారా 4 వేల 430 కోట్ల రూపాయల రుణపంపిణీ జరిగినట్టు… అందుకుగాను ఆయా కంపెనీలు 819 కోట్ల రూపాయల లాభాలార్జించినట్టుగా కూడా ఈడీ తనిఖీల్లో వెలుగు చూసింది. గత ఆర్నెల్ల కాలంలోనే ఆర్బీఐకి బాధితుల నుంచి సుమారు 900 ఫిర్యాదులందాయి. ఐదుగురు ఇప్పటికే లోన్ యాప్స్ వేధింపులతో ఆత్మహత్యలు చేసుకున్నారు. 80 లోన్ యాప్స్ లో 33 మాత్రమే ఆర్బీఐలో నమోదు కాగా… మిగిలిన 47 సంస్థలు అడ్రస్ లేనివి. లోన్ యాప్స్ వ్యవహారంపై ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సుమారు 46 చోట్ల ఎఫ్ఐఆర్స్ నమోదైనట్టు సమాచారం. అయితే రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తున్న లోన్ యాప్స్ పై ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి సారించకుంటే… ఇది ముమ్మాటికీ మధ్యతరగతి అమాయక జనానికీ, సమాజానికి మాత్రం ముప్పేనన్నది ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నవారందరి అభిప్రాయం.
ఆర్.బి.ఐ నిబంధనల జారీ !

అయితే ఇదే సమయంలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా జరుగుతున్న రుణ మోసాలను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ కొన్ని కచ్చితమైన నిబంధనలను విధించింది. ఆర్బీఐ నియంత్రిత వ్యవస్థ, రుణ స్వీకర్త మధ్యే లావాదేవీ జరగాలే తప్పితే.. థర్డ్ పార్టీలకు తావులేదని కరాఖండిగా చెప్పేసింది. ఇష్టారీతిన రికవరీ చేస్తే వెంటనే కఠిన చర్యలనీ ప్రకటించింది. అధిక వడ్డీల చెల్లింపులకిక ఆర్బీఐ చర్యలతో ఫుల్ స్టాప్ పడనుంది. అంతేకాదు డిజిటల్ పద్ధతిలో జరిగే రుణప్రక్రియలో ఆ రుణం నేరుగా స్వీకర్తల ఖాతాల్లోకే వెళ్లేలాని కూడా ఆర్బీఐ ఆదేశించింది. లోన్ యాప్స్ దందా రోజురోజుకూ శృతి మించుతున్న క్రమంలో ఆర్బీఐ చర్యలైనా వీటికి అడ్డుకట్ట వేస్తాయా… లేక, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు హ్యాకర్స్ వాటినీ తమకనుకూలంగామల్చుకుంటారా అన్నది వేచిచూడాల్సి ఉంది.