పార్లమెంటులో గల్ఫ్ సమస్యలు –  సమాధానాలు ! 7 లక్షల మంది  కార్మికులు భారత్ కు  వచ్చారు !

(J. Surender Kumar)


కేరళ రాష్ట్రం కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్
ఎంపీ ఎం.కె. రాఘవన్ గల్ఫ్ కార్మికుల సమస్యలపై అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ తేది: 29.07.2022 నాడు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  వాటి వివరాలు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ లో ఇలా ఉన్నాయి.
వందే భారత్ మిషన్ లో  7,16,662 మంది  గల్ఫ్ కార్మికులు భారత్ కు  వచ్చారు
గత రెండున్నర ఏళ్ల కాలంలో 4,16,024 మంది ఈసీఆర్ దేశాలకు వెళ్లడానికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ జారీ చేయబడింది.
ప్రభుత్వ అంచనాల ప్రకారం, వందే భారత్ మిషన్ లో ఆరు గల్ఫ్ దేశాల నుండి 7,16,662 మంది కార్మికులు తిరిగి వచ్చారు. యూఏఈ (3,30,058), సౌదీ అరేబియా (1,37,900), కువైట్ (97,802), ఓమాన్ (72,259), ఖతార్ (51,190), బహరేన్ (27,453) మంది వాపస్ వచ్చారని 
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ తేది: 29.07.2022 నాడు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.


మంత్రి మరిన్ని వివరాలను ఈ విధంగా తెలియజేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో,
విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయ కార్మికులు తిరిగి రావడానికి ‘వందే భారత్ మిషన్‌’ లో భారత దౌత్య కార్యాలయాలు దోహదపడ్డాయి. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్‌ (భారతీయ సామాజిక నిధి) ను ఉపయోగించి సామాజిక సంఘాలతో సమన్వయం చేయడం ద్వారా భారతీయులకు క్రియాశీలకంగా మద్దతునిచ్చారు. ఈ నిధిని వసతి సౌకర్యం, విమాన టికెట్లు, అత్యవసర వైద్య సంరక్షణ మొదలైన వాటికి అవసరాల ప్రాతిపదికన ఖర్చు చేశారు.

పార్లమెంట్ ప్రొసీడింగ్స్

కోవిడ్ మహమ్మారి సమయంలో విదేశాలలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయ కార్మికులపై తక్కువ నష్ట ప్రభావం ఉండేలా ప్రభుత్వం ప్రాధాన్యతతో చర్యలు తీసుకున్నది. ఆ దిశగా, మన విదేశాంగ శాఖ మరియు గల్ఫ్‌లోని అన్ని భారత రాయబార కార్యాలయాలు గల్ఫ్ దేశాల ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదిస్తూ కార్మికుల సంక్షేమం, ఆర్థిక చెల్లింపుల గురించి నిమగ్నమై ఉన్నాము. భారత ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాలకు గల్ఫ్‌లోని అన్ని దేశాలు సానుకూలంగా స్పందించాయి. దీని ఫలితంగా వాపస్ వచ్చిన చాలామంది తిరిగి గల్ఫ్ కు వెళ్లగలిగారు. భారతీయ కార్మికులు తిరిగి గల్ఫ్ కు వెళ్లడం, వారి బకాయిల చెల్లింపులు, ఆర్థిక పునరుద్ధరణ నేపథ్యంలో కొత్త నియామకాలు (రిక్రూట్మెంట్), సంక్షేమ కార్యక్రమాల గురించి భారత రాయబార కార్యాలయాలు గల్ఫ్ దేశాల ప్రభుత్వాలతో చర్చలు కొనసాగిస్తున్నాయి.
వాపస్ వచ్చినవారి డేటా బేస్ కోసం ‘స్వదేస్’
భారత ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంట్రప్రెన్యూర్‌షిప్ (నైపుణ్య అభివృద్ధి & పారిశ్రామిక) మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త చొరవగా ఒక డేటాబేస్‌ (సమాచార గణాంకాలు) రూపొందించే లక్ష్యంతో ‘స్వదేస్’ అనే  స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ సపోర్ట్ (ఉద్యోగ మద్దతుకోసం నైపుణ్య వంతులైన కార్మికుల సమాచార సేకరణ) పోర్టల్‌ను ప్రారంభించింది. విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయి ‘వందే భారత్ మిషన్’ ద్వారా వాపస్ వచ్చిన వారి వివరాలను వారి నైపుణ్యాల ఆధారంగా ‘స్వదేస్’ పోర్టల్ లో నమోదు చేస్తారు. 
స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం, ఉద్యోగార్థులను, వివిధ రంగాల యాజమాన్యాలను అనుసంధానం చేయడానికి  ‘ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయీ ఎంప్లాయర్ మ్యాపింగ్ (అసీమ్) పోర్టల్‌లో వివరాలను నమోదు చేయడానికి ‘స్వదేస్’ అభ్యర్థుల డేటాబేస్‌ పొందుటకు అందరు వాటాదారులకు అవకాశం ఇవ్వబడింది. జూన్ 2022 నాటికి ‘స్వదేస్’ స్కిల్ కార్డులో 34,118 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.


నాలుగు లక్షల మందికి అనుమతి!


ఇటీవల కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో, కార్మికులు త్వరితగతిన తిరిగి గల్ఫ్ కు మళ్ళీ వెళ్లాలని ఒత్తిడి పెరిగింది. గల్ఫ్ లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో తిరుగు ప్రయాణాలు పెరిగాయి. ఇ-మైగ్రేట్ పోర్టల్ ప్రకారం 1 జనవరి 2020 నుండి 30 జూన్ 2022 వరకు రెండున్నర ఏళ్ల కాలంలో ఈసీఆర్ దేశాలకు 4,16,024 మందికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ (విదేశాలకు వెళ్ళడానికి అనుమతి) జారీ చేయబడింది.

వారానికి 181 విమానాలు నడిపారు !

కోజికోడ్ ఎయిర్ పోర్టు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలతో బాగా అనుసంధానించబడి ఉంది. 2022 వేసవిలో కోజికోడ్ విమానాశ్రయం మరియు గల్ఫ్ దేశాల మధ్య వారానికి 181 విమానాలు నడిచాయి. అబుదాబి (18), దుబాయి (37), షార్జా (21), రాసల్ ఖైమా (2), సౌదీ అరేబియా (49), ఖతార్ (22), కువైట్ (5), ఓమాన్ (14), బహరేన్ (13).

ఎంపీ రాఘవన్.


అక్రమ రవాణా, అక్రమ వలసల నిరోధం !

తమ యంత్రాంగం ద్వారా విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అక్రమ రిక్రూట్‌మెంట్ ఏజెంట్లపై ఫిర్యాదులను స్వీకరిస్తుంది.  ఫిర్యాదులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల అమలు సంస్థలకు పంపబడతాయి. ఎమిగ్రేషన్ యాక్టులోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది. మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలను నిరోధించడానికి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలైన బహరేన్, కువైట్, ఓమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ లతో పాటు జోర్డాన్‌ తో కార్మిక మరియు మానవశక్తి సహకార ఒప్పందాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లోని భారతీయ ఇంటి పనివారల ప్రయోజనాలు కాపాడేందుకు కువైట్, సౌదీ అరేబియా లతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాము అని మంత్రి వివరించినట్టు
గల్ఫ్ కన్వీనర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి), ఎన్నారై సెల్, గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి – ప్రకటనలో వివరించారు.