” ఆజాదికా అమృత్ మహోత్సవం” సందర్భంగా….
(J.Surender Kumar,)
రామాయణ చరిత్రలో శ్రీ రాముడు లంక నగర అధినేత రావణాసురుని పై యుద్ధం చేయుటకు సముద్రంపై వారధి నిర్మాణం లో వానరుల పాత్ర తో పాటు శ్రీ రాముడి సేవ కోసం ” ఉడుత ” భక్తిగా చిన్న చిన్న రాత్రి ముక్కలు తెచ్చి నిర్మాణం పనులు అందించిన సహాయాని నేటికి ఎవరైనా కొద్దిపాటి సహాయం చేస్తే, ఉడతా భక్తిగా సహాయం చేశారు అంటారు.. రామాయణ చరిత్ర ప్రవచనం లో ఈ అంశం శ్రోతలకు వినిపించడం విధితమే.
అయితే బ్రిటిష్, నైజాం, పాలన విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర సమర పోరాటంలో ప్రాణ త్యాగాల, తీరుతెన్నులు, దేశభక్తి, త్యాగనిరతి గూర్చి నేటికీ మనం నిత్యం మననం చేసుకోవడం షరామామూలే. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 న మన భారతీయ జెండా ఎగరవేసిన ఇద్దరు స్వాతంత్ర సమరయోధులను నిజాం ప్రభుత్వం అరెస్టుకు యత్నించగా, వారిని నిజాం పోలీసులకు, ప్రభుత్వానికి చిక్కకుండా కాపాడిన చరిత్ర” బల్ల ఈత ది ” అని అతి కొద్దిమందికి తెలుసు. దాదాపు 40 సంవత్సరాల లోపు వయసు వారికి దీని చరిత్ర తెలియకపోవచ్చు, స్వాతంత్ర పోరాట చరిత్రలో ఈ” బల్ల ఈత ” గురించి వివరాలు ఉండకపోవచ్చు.
“బల్ల ఈత ” పుట్టుపూర్వోత్తరాలు !

గోదావరి నదిలో ఉధృత నీటి ప్రవాహం ఏటవాలుగా ఓ పొడవాటి చెక్క పై అభిముఖంగా పడుకొని దాదాపు 40,50 కిలోమీటర్లు దూరం ఆయాసం లేకుండా ఈతగాళ్ళు ఈదుతు ఉంటారు. గోదావరి నదిపై వంతెనల నిర్మాణం కాని రోజుల్లో ( బ్రిటిషు పాలనలో రైలు పట్టాల, నిజాం ప్రభుత్వ హాయంలో నదిపై నిర్మించబడిన వంతెనలు మినహా )
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి, బీర్పూర్, రాయికల్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలు పరిధిలోని నదీ తీర ప్రాంత గ్రామీణులకు, ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి, జన్నారం, ఖానాపూర్, ద్వారక, లక్షత్ పెట్ మంచిర్యాల్, నదీతీర గ్రామ ప్రాంతాల పరిసరాలు గ్రామీణులకు ఈ బల్ల గీత గురించి తెలిసి ఉండి ఉంటుంది. ఈ బల్ల ఈత ద్వారా ఆదిలాబాద్ పరిసర గ్రామీణులు కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంతాలకు కూలి పనులకు, పాలు పెరుగు, కూరగాయలు, విక్రయాల కోసం తమ, తమ దైనందిన జీవనంలో అవసరాలు తీర్చుకోవడం కోసం, ఈ బల్ల ఈ తద్వారా గోదావరి నదిపై రాకపోకలు కొనసాగించేవారు. గోదావరి నది ఉద్ధృత నీటి ప్రవాహం లో కొట్టుకుని పోతున్న పశుసంపదను, గొర్రెలు, మేకలను, ప్రమాదవశాత్తు మనుషులు, యాత్రికులు, ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారిని ఈతగాళ్ళు కాపాడిన చరిత్ర ఉంది. స్థానిక. బోయలు చేపలు పట్టడానికి, ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చెట్లను, వంట చెరుకు ల కోసం ఈవలి తీరం తరలించడానికి , కొన్ని సందర్భాలలో ఆదిలాబాద్ జిల్లా నుంచి అక్రమంగా టేకు కలప తరలింపుకు సైతం కలప స్మగ్లర్లు గజ ఈతగాళ్లను గతంలో వినియోగించుకునేవారు.
సమరయోధులను అరెస్టు కాకుండా కాపాడిన తీరు !

1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్రం ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి తెలంగాణలో నైజాం ప్రభుత్వం ఎలాంటి ఉత్సవాలు నిర్వహించరాదని జాతీయ జెండాను ఎగురవేయ రాదని హుకుం జారీ చేసింది. ధర్మపురి క్షేత్రం కు చెందిన స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయులు మాజీ మంత్రి కెవి కేశవులు, ప్రముఖ వేద శాస్త్ర పండితుడు సంగనభట్ల మాణిక్య శాస్త్రి, ( ప్రముఖ సినీ డైరెక్టర్ హరీష్ శంకర్ తాతగారు శ్రీ మాణిక్య శాస్త్రి ) వీరు నైజాం ప్రభుత్వ ఆదేశాలు దిక్కరిస్తూ, గోదావరి నది తీరంలో గల మాజీ మంత్రి కెవి కేశవులు ఇంటిపై భారతదేశ జాతీయ జెండాను 1947 ఆగస్టు 15 న ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి మాణిక్య శాస్త్రి అధ్యక్షత వహించారు, అయితే నైజాం ప్రభుత్వ ఆదేశాలు దిక్కరిస్తూ జెండా ఎగర వేసిన సమాచారం నైజాం పోలీసులకు తెలిసింది వారిని, అరెస్టు కోసం నైజం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజా కంట కుడిగా పేరుపొందిన నైజాం పోలీస్ అధికారి సుజ ఉద్దీన్ పోలీసు బలగాలను, జగిత్యాల, నిజామాబాద్ వైపు రాయపట్నం, కరీంనగర్ వైపు నిఘా ఉంచారు. కరీంనగర్ ,ఆదిలాబాద్ సరిహద్దు ధర్మపురి ని అనుకొని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది, వారు అటువైపు నుంచి తప్పించుకోలేరు, అనే ధీమాతో నైజాం పోలీస్ అధికారికి ఉండింది మరుసటి రోజు ఆగస్టు 16న రాత్రి వీరి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు సమరయోధుల బంధువులు వివరించారు. నైజాం పోలీసులు వీరిని పట్టుకోవడానికి రావడంతో కెవి కేశవులు, మాణిక్య శాస్త్రి లు గోదావరి నది వైపు పరిగెత్తా రు. అక్కడ రెండు బల్లపై గజ ఈతగాళ్లు, మేర అంతయ్య , మరొకరు మల్లయ్య ( పేరు సరిగ్గా గుర్తు రావడం లేదని ఓ సందర్భంలో సమరయోధుడు మాణిక్య శాస్త్రి కుమారుడు ప్రముఖ హిందీ పండితులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత స్వర్గీయ నరహరిశర్మ అనేక సందర్భాల్లో వివరించేవారు.) కె.వికేశవులు, మాణిక్య శాస్త్రి,ఇద్దర్నీ గోదావరి నదిలో బల్ల ల పై ఎక్కించుకొని ఉధృత గోదావరి నీటి ప్రవాహం ద్వారా రాత్రికి రాత్రే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల తీరప్రాంతం కు చేరుకొని మంచిర్యాల నుంచి మహారాష్ట్ర కు వెళుతున్న. ” భూసవలి.” .రైలులో నాగపూర్ కు, చేరుకొని అక్కడ క్యాంపు లో తలదాచుకున్న రు అని మాణిక్య శాస్త్రి తనయుడు నరహరిశర్మ అనేక సందర్భాల్లో వివరించారు..
” బల్ల ” అంటే ..ఈత తీరు !

‘ బల్ల’ ఆరున్నర అడుగుల పొడవు, .10 లేదా 11 అంగుళాల వెడల్పు, ఐదు లేదా ఆరు అంగుళాల మందం ఉంటుంది. ఎండిన ” బూరుగు” చెట్టు కలప తో దీన్ని తయారు చేస్తారు. ఉధృత నీటి ప్రవాహం లో ఈ చెక్క బల్ల పై ఈతగాళ్ళు సగ భాగం పడుకొని మిగతా సగభాగం నదీ ప్రవాహానికి కొంచెం పైగా నిలబడి ఉండేలా చూసుకుంటారు.

బల్లకు ఏటవాలుగా నాభి వరకు పడుకొని రెండు చేతులు, కాళ్ళు, నీటిలో ఈతకు అనువుగా ఉంచుకుంటారు. బల్ల చెక్క సైతం వీరి శరీరం కు ఏటవాలుగా ఏర్పాటు చేసుకుంటారు. నది ఉధృతి నీటి ప్రవాహం ప్రయాణిస్తున్న దిశగా బల్లపై ఈత కొడుతూ ఉంటారు. ఎలాంటి ఆయాసం రాకుండా దాదాపు నలభై యాభై కిలోమీటర్లు దూరం వరకు ఈదుతూ వుంటారు. ఈ బల్లపై మరొకరిని కూడా తమ వీపుపై ఎక్కించుకొని ఈతగాళ్ళు ఈదడం ప్రత్యేకత. నది ఉధృత ప్రవాహంతో రాయపట్నం వంతెన, మునిగిన సందర్భాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ నిత్యం రాకపోకలు కొనసాగించే కరీంనగర్ జిల్లా ఉద్యోగులను జిల్లాలో విధులు నిర్వహించే ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగులను ఈ బల్ల ద్వారా గజ ఈతగాళ్లు గతంలో ఒడ్డుకు చేర్చే వారు. నేటికి ధర్మపురి క్షేత్రం లోని బోయ వారి ఇళ్లలో వందలాది ఈ బల్లలు ఉన్నాయి 50 సంవత్సరాలు పై బడిన వారికి మాత్రమే ఈ బల్ల ఈత గూర్చి వాటి మెలుకువలు గురించి తెలుసు, ప్రస్తుతం ధర్మపురి క్షేత్రంలో నీ గోదావరి నదిలోకి ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్ల బ్యాక్ వాటర్ నిలువ నీటిలోనే చేపల వేటను. ధర్మకోల్ తెప్ప ను బోయ వారు వినియోగిస్తున్నారు తప్ప బల్ల ఈత ను వారు వినియోగించడం లేదు. మేధావులు ,స్వాతంత్ర సమర పోరాట తీరుతెన్నులను వ్రాసే నేటి రచయితలు ఆ పుస్తకాలలో, గ్రంథాలలో బల్ల ఈత చరిత్ర గూర్చి వివరించి భవిష్యత్ తరాల వారికి బల్ల ఈత చరిత్ర వివరాలు అందిస్తారని ఆశిద్దాం.