అంతు పట్టని కేసీఆర్ అంతరంగం !
అవి మెట్లెక్కే అడుగులా.? దిగుతున్న అడుగులా.?

( J. Surender Kumar )


తెలంగాణ రథసారథి కేసీఆర్ అంటే , ఓ చరిత్ర, ఓ ప్రభంజనం, ఒక సంచలనం. ఆయన్ను ప్రశంసించేవాళ్లకు ఈ మాటలన్నీ చిన్నగానే అనిపించొచ్చు. ఆయన్ను విమర్శించేవాళ్లకు ఇవే మాటలు అంతలేదూ అనిపించొచ్చు. ఏవరమనుకున్నా, తాననుకుంటే తన లక్ష్యం వైపు తగ్గేదేలే అంటూ దూసుకెళ్లడటమే బక్కపల్చని ఆ బలవంతుడి లక్షణం.


ఇప్పుడెందుకు మళ్లీ కేసీఆర్ గురించంటే..


సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు, ప్రారంభోత్సవాలు, సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినాన్ని నిర్వహిస్తామన్న ప్రకటనలు… వెరసి జాతీయ రాజకీయాల్లో తన మార్క్ కోసం యత్నిస్తున్న కేసీఆర్… రాష్ట్రంలోనూ, కొంగొత్త అడుగులు వేసే యత్నం మొదలెట్టారా ? అన్న చర్చకు తెరతీస్తోంది. అంశాలవారీపై ఫుల్ క్రిస్టల్, క్లియర్ క్లారిటీతో ముందుకెళ్లే కేసీఆర్.. త్వరలో పుత్రరత్నం మంత్రి కేటీఆర్, ప్రమోషన్ కోసమే రాష్ట్రంలో ఈ అడుగులు పడుతున్నాయా ? అనేది పొల్టికల్ సర్కిల్స్ లో జరిగే పిచ్చాపాటి.

ముఖ్యమంత్రి పీఠంపై,మంత్రి కేటీఆర్ ను ఎక్కించడానికి ముహూర్తానికి రంగం సిద్ధం చేస్తున్నారా..? అదే సమయంలో ముందస్తు ఎన్నికలైతే అందుకు బెటర్ అని యోచిస్తున్నారా.? ఇదీ ప్రధానంగా జరుగుతున్న ఓ డిబేట్.


ఇప్పుడు కేసీఆర్ ముందున్న లక్ష్యాలు రెండు..


గతంలో ఉద్యమం చేయడం… తెలంగాణా సాధించడం… ఆ తర్వాత ముఖ్యమంత్రయ్యాక తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం… అందులో భాగంగా ఓ సుదీర్ఘమైన రాజకీయ ప్రణాళిక… అందుకవసరమయ్యే అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన… ఇలా సాగింది ఇంతకాలం కేసీఆర్ ప్రస్థానం. అయితే, ఇప్పటివరకూ ఒక లెక్క… ఇక ఇప్పట్నుంచీ ఒక లెక్క. ఏంటా లెక్కలంటే…? తనదనుకున్న అడ్డాలో బీజేపి హల్చల్ సీఏం కేసీఆర్ కు ఇప్పుడు గిట్టడం లేదు. కాంగ్రెస్ ను చంపేసి… బీజేపీని లేపిందే తాననే విషయాన్ని తను గమనించి నాలుక్కర్చుకున్నా లాభం లేని స్థితిలో బీజేపి సవాళ్లు విసురుతోంది. జీహెఎచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ వంటి ఎన్నికలతో పాటు…

నాల్గు ఎంపీ సీట్లను కూడా గెల్చుకోవడంతో… గతంలో రెండు సీట్ల నుంచి ఇవాళ దేశాన్ని శాసించేస్థాయికి బీజేపి ఎలా ఎదిగిందో మరోసారి బీజేపి ఇండికేట్ చేస్తోంది. ఇప్పటికే కేంద్రంలో మెజార్టీ సీట్లను సాధించి ఏలుతుండటంతో పాటు… దేశంలో 18 రాష్ట్రాల్లో అధికారంలోనూ ఉన్న బీజేపి… ముల్లును ముల్లుతోనే తీయాలనే రాజకీయాలకూ ఇప్పుడు పదును పెడుతోంది. బీహార్, కర్నాటక వంటి చోట్ల ఇలాంటి పరిణామాలు మనకు కళ్లకు కడుతూనే ఉన్నాయి.

మోడీషా స్ట్రాటజీస్, పై బయటకు బీజేపి వైరిపక్షాలు విరుచుకుపడ్డా…. లోలోపల ప్రత్యర్థులకు దడ పుట్టిస్తోంది బీజేపి! ఎప్పుడైతే కమలనాథులతో, గులాబీబాస్ కు చెడిందో… అప్పట్నుంచీ బీజేపీ మరింత తెలంగాణాపై దృష్టి సారించడంతో… ఇతర పక్షాల్లాగే కేసీఆర్ లోనూ ఆ భయం ఆవహించింది. పైగా పైకెంత విమర్శలు చేస్తున్నా.. ఈడీ, సీబీఐ, ఐటీ టెన్షన్స్ మరింత గుబులు పుట్టించేవే! ఈ భయం ఇప్పుడు కేసీఆర్ కే కొత్తేం కాదు… బీజేపీ ప్రత్యర్థుందరూ రుచి చూసిందే.. మున్ముందు చూడబోయేదే! ఇలాంటి సందర్భంలో తన అడ్డా అనుకున్న చోట బీజేపికి చెక్ పెట్టాలంటే… కొత్త ప్రత్యామ్నాయం పేరిట జాతీయ రాజకీయాల్లోకి తాను వెళ్లాలనుకోవడమే కేసీఆర్ యోచనా.. నిజంగానే ఉన్నపళంగా ప్రత్యేక తెలంగాణాలాగే, దేశంపైనా అనురాగం పుట్టుకొచ్చిందో తెలియదుగానీ… బీజేపి ఫోకస్ కేసీఆర్ పైనా… ఆయన కుటుంబంపైనా… మరీ మఖ్యంగా తెలంగాణా రాష్ట్రంపైనా ఎక్కువయ్యేందుకు మాత్రం కేసీఆరే కారణమయ్యాడు.


ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ రానురానూ డీలాపడుతుంటే… అదే స్థాయిలో బీజేపి బలపడుతోంది. గతంలో థర్డ్ ఫ్రంట్ పేరిట, ఏర్పడిన సంకీర్ణాల సంగతి భారతావని చూసిందే. పైగా అన్నీ పీలికల్లాంటి పార్టీల్లో స్థానికంగా ఉన్న బలుపును చూసి… దేశవ్యాప్తంగా ప్రభావితం చేయగలమన్న, అతి విశ్వాసం వాపుగా గుర్తించలేని స్థితిలో ఇతర రాష్ట్రాల నేతలు తప్పటుడుగులు ఏవిధంగా వేస్తున్నారో… సేమ్ టూ సేమ్ కేసీఆర్ వీ అవే అడుగులా అన్నట్టుగా ఇప్పుడు రాజకీయాలను బాగా నిశితంగా చూసేవారి కళ్లకు కడుతున్న పరిస్థితి. అలా అంటే ప్రాంతీయ పార్టీల నేతలు రాజకీయాల్లో రాణించడం అసంభవమని కూర్చోవాలా..? కేసీఆర్ వంటి నేత ముందుకెళ్తుంటే విమర్శలేంటనుకునేవారు.. దాన్ని నెగటివ్ కోణంలో చూడకుండా సాధ్యాసాధ్యాలు.. అందుకు ఎంచుకునే మార్గాలు.. ఎంచుకునే సమయం.. ఇవన్నీ ముందుగా యోచించాల్సి ఉంటుంది. లేకపోతే ఇంతవరకు కష్టపడి గూడు కట్టుకున్నదీ బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

కేసీఆర్ ఓవైపు దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లడం… అక్కడి ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖ నేతలతో భేటీలవ్వడం… ఆయా ప్రాంతాల్లో ఉద్యమించిన రైతు కుటుంబాలకు బాసటగా నిలవడం… ఇతర రాష్ట్రాల్లోని సైనిక కుటుంబాలకూ తనవంతు సాయం చేయడంతో… తాను జాతీయ రాజకీయాల్లోకి ఇక ఎంట్రీ ఇచ్చాననే విషయాన్ని తన టూర్లతో కేంద్రంలోని బీజేపికి ఇండికేషన్! కానీ, బీజేపీ మాత్రం తామేం తక్కువ తిన్నామా అన్నట్టుగా… రోజుకోచోట, రోజుకో కేంద్రమంత్రిని తెలంగాణాలో తిప్పుతూ… కాక పుట్టిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే గులాబీదళం సహనానికి పరీక్ష పెడుతోంది. ఫ్రస్ట్రేషన్ లో గులాబీ కీలక నాయకుల నుంచి చోటోమోటా వరకూ తామేం చేస్తున్నాం.? ఏం మాట్లాడుతున్నాం..? అటువైపెంత బలముంది.? మన బలమెంత.? ఇలాంటి అంచనాలేవీ లేకుండా సోషల్ మీడియా ఉందికదా అని చేస్తున్న పోస్టింగ్స్… తమకే బూమరంగవుతూ… మరింత ఫ్రస్ట్రేషన్ కు కారణమవుతున్నాయి.


పర్ సపోజ్ మనం బైకెక్కి ఓ డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణానికి సిద్ధమయ్యాం. టైర్లలో గాలుందా… పెట్రోలెంత పడుతుంది…
ఎంత సమయంలో డెబ్బై కిలోమీటర్లు చేరుకోగలము… ఇలా కనీసం ఓ అంచనా ఉంటుంది. అలాంటిది కేసీఆర్ తను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే విషయంలో ఆ మాత్రం అంచనాతో ఉండడా అనిపిస్తుండొచ్చు! కానీ జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఢీకొనబోతోంది మోడీషా చేతుల్లోని బీజేపీని అనే అంచనా మాత్రం తప్పినట్టుగానే కొడుతోంది. అసలు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎంతవరకూ రాణిస్తారు…? జాతీయస్థాయి నేతలు… ముఖ్యంగా అంత త్వరగా మింగుడుపడని ఉత్తరాది నేతలు…
ఇంతకాలం నుంచీ కేసీఆర్ వేస్తున్న అడుగులను పరిశీలిస్తున్నవారు అంత ఈజీగా నమ్ముతారా.?. పీవీసాబ్ వంటివారే ఉత్తరాది రాజకీయాలను దినదినగండంగా లాక్కెళ్లాల్సిన పరిస్థితులనెదుర్కొన్న చరిత్రను ముందు పెట్టుకుని కేసీఆర్ ఇప్పుడు వేస్తున్న అడుగులకు ఇది సరైన సమయమేనా..? అసలా అడుగులు సరైనవేనా ? అన్నటువంటి చర్చా పిచ్చాపాటిగా సాగుతోంది.

తాను జాతీయ రాజకీయాల్లో రాణించేందుకు.. ప్రగతి భవన్ వేదికను చేసి… పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘం నాయకులతో కేసీఆర్ రెండు రోజులపాటు చర్చలు, భోజనాలు , వారికి సన్మానాలు జరపడంతో జరిగేదేముంటుంది. చుట్టపుచూపుగా వచ్చినవారు వారి అస్తిత్వాన్ని దెబ్బ తీసుకునే విధంగా… తమ స్థానిక నేతలకు కాదని… కేసీఆర్ కు ఔట్ రేట్ గా సపోర్ట్ చేయగలరా.? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలిసి ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు… జర్నలిస్టుల నుంచి ఎదురైన ప్రశ్నే… కేసీఆర్ పై ఇతర రాష్ట్రాల నేతల నమ్మకాన్ని ఒకింత ప్రశ్నార్థకం చేసింది. మీరు ఒకవేళ ప్రత్యామ్నాయ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తే… నితీష్ కుమార్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా ? అంటూ ఇరకాటంలో పెట్టిన ప్రశ్న అది. ఆ ప్రశ్న అక్కడి విలేకర్ల నుంచే స్పాంటేనియస్ గా రావొచ్చు… లేదా, కేసీఆర్ ను టెస్ట్ చేయించేందుకు నితీష్ కుమార్ వర్గమే అడిగించి ఉండొచ్చు… లేదా, అసలు కూటమేంది, ఈ కథేంది ఆదిలోనే తుంచేస్తే పోలా అని బీజేపీలోని యోధానుయోధుల ఓ కుట్రా అయ్యుండొచ్చు. ఏదేమైనా… అదే సమయంలో నితీష్ లేచి వెళ్లిపోతుండటం… సోషల్ మీడియాలో దానిపై జరిగిన ట్రోలింగ్ తో
బీహార్ లో అంత హంగామా చేసిందాంతో వచ్చే మైలేజ్ కన్నా… మైనస్సే ఎక్కువైంది.

అయితే కేసీఆర్ తన ఆలోచనలు తను చేస్తూనే ఉన్నాడు. విశ్రమించని అతని తత్వమే ఆయనకు ఓ ప్లస్ పాయింట్. మరోవైపు క్యాబినెట్ సమావేశంలో కీలకంశాలపై తీర్మానాలు, ప్రత్యేకంగా సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినాన్ని, నిర్వహించాలన్న తీర్మానం, దళిత బందు లబ్ధిదారుల సంఖ్య నియోజకవర్గానికి 500కు పెంచడం, 3000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, 57 సంవత్సరాల వారికి ఆసరా పెన్షన్ల కార్డుల జారీ, తదితర క్లిష్టఅంశాలు జాతీయస్థాయిలో కంటే రాష్ట్రంలో మైలేజీకే ఉపయోగపడుతాయి. తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి… బీజేపిని నిలువరించి రాష్ట్రంలో నిలబడటానికి మళ్లీ తన ప్రయత్నాలన్నీ తాను చేస్తూనే ఉన్నాడన్నదే ఇప్పుడు జరిగే చర్చ! .అయితే కొన్ని వ్యూహాలు బీజేపి, కాంగ్రెస్సే కాదు… దేశంలోని ఏ పార్టీ అధినాయకులు చేయలేనివి కేసీఆర్ లో కనిపిస్తాయి. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. సెప్టెంబర్ 17న తాము కూడా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరపనున్నామని.. అందుకు హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించడం వెనుక ఆంతర్యాన్ని రాజకీయ విశ్లేషకులు ఇట్టే పట్టేయగలరు. కేటీఆర్ ను సీఎం చేసేందుకు… సెప్టెంబర్ 17ను కూడా సీఎం కేసీఆర్ తన రాజకీయాలకు వాడుకుంటున్నారా అనేదీ ఇప్పుడు ఓ చర్చే!


సీఎం కేసీఆర్ వెంట సీనియర్ లు ?
తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమని కుండ బద్ధలు కొడుతున్నాడు సీఎం కేసీఆర్. నాడు కాంగ్రెస్ ముక్త్ భారత్ ను బీజేపి ఎలా ఎత్తుకుందో… ఇప్పుడు బీజేపి ముక్త్ భారత్ నినాదాన్ని కేసీఆర్ అలాగే భుజాన మోస్తూ తిరుగుతున్నాడు. దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంటు ఇస్తాం.. వచ్చేది కేంద్రంలో మన ప్రభుత్వమేనంటూ నిజామాబాద్ బహిరంగ సభలో కేసీఆర్ ఎవరికి భరోసా కల్పించారు…? మళ్లీ అదీ తెలంగాణా ప్రజలకే కదా…? కేసీఆర్ వాణి ప్రతిబింబించాల్సిందెక్కడ..?. కానీ, మాట్లాడిందెక్కడ…? ఇంత పెద్ద దేశంలో… ఎంతమందికి ఆ వాయిస్ పోయి ఉంటుంది..? దానికెంత మంది ఆకర్షితులై ఉంటారు..? ఎంతమంది నమ్మి ఉంటారు….? ఇవన్నీ ప్రశ్నలు కాగా…. నవ్వుకోవడం కూడా జర్నలిస్టులు, మేధావులు, పొల్టికల్ సర్కిల్స్ లో కనిపించిన పరిస్థితి. అంతేకాదు… సమయం అనుకూలించకపోతే అన్నీ నవ్వులపాలేనన్నట్టుగా… టీఆర్ఎస్ఎల్ఫీ సమావేశంలోనూ… మీలో చాలామంది కేంద్ర మంత్రులు , గవర్నర్లు, విదేశీ రాయబారులు అవుతారంటూ.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు ఇస్తా గెలిపించుకుంటాను, గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తాను అనేక సందర్భాల్లో చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారని.. కార్లలో వస్తారన్న మాట నేడు నిజం అయిందంటూ ఓ మెలిక పెట్టి ఆశ కల్పించే యత్నం చేయడం, కొందరు మేధావులకు మరింత నవ్వు తెప్పించింది.

అయితే ఇందులోనూ చాలామంది చాలా మర్మాలే వెతికారు. చాలామంది సీనియర్ నాయకులు, మంత్రులు.. కేసీఆర్ తమని, తన వెంట తీసుకువెళ్తారని… అప్పుడు మంత్రి కేటీఆర్ సీఎం బాధ్యతలు చేపట్టి తన అనుకూల వర్గంతో మంత్రివర్గంకు మార్గం సుగమమవుతుందనీ, అలా అని ఉంటారనే వారూ ఉన్నారు. అయితే ఆయన వెంట నడిచే నేతలంతా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన నందంటే నంది, పందంటే పంది, అంటున్నారేమోగానీ.. వారు ఆ మాత్రం గ్రహించలేక అననుకుంటే పొరపాటే!


రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో అపర చాణక్యుడిగా, ఇంతవరకు రాజకీయంగా పెద్దగా తప్పుటడుగులు వేయని కేసీఆర్.. ఇప్పుడు వేస్తున్న అడుగులు సరియైనవేనా ? రాజకీయ ప్రత్యర్థులను సరిగా అంచనా వేస్తున్నారా ? రాజకీయ మిత్రులనుకునేవారు మనస్ఫూర్తిగా సహకరిస్తారా ? చెయ్యి ఇస్తారా ? అనే పలు అంశాల్లో ఇప్పుడు కేసీఆర్ ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయమిది. రాష్ట్రాన్ని యువరాజుకు అప్పగించి కేంద్రం బాట పట్టాలనుకోవడంలో తప్పులేదు. కానీ, అవ్వా కావాలి, బువ్వా కావాలన్నట్టుగా రెండు పడవల ప్రయాణంలో… ఎదురుగా ఉన్న బలమైన ప్రత్యర్థి గట్టి దెబ్బ కొడితే… భవిష్యత్తేంటన్న సోయి కూడా ఉండాలన్నదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో జరిగే చర్చ!


దసరాకు నూతన సెక్రటేరియట్ తో పాటు… రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి కూడానా…?


నూతన సెక్రటేరియట్ భవనాన్ని, పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరగుతుండగా… దసరా రోజు దాని ప్రారంభోత్సవం ఉండవచ్చన్నది సమాచారం. అయితే అదే దసరా పండగ రోజున కేవలం సెక్రటేరియటే కాదు.. కొత్త ముఖ్యమంత్రీ ఈ రాష్ట్రానికి రాబోతున్నాడన్న ఓ ప్రచారమూ ఉంది. తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి… తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారన్నది ప్రచారంలో వినిపించే సమాచారం. రాజకీయాలు ఎవ్వరినీ ప్రశాంతంగా ఉండనివ్వవు. పదవులు శాశ్వతం కాదని తెలిసేంత ఆలోచనా యోధులైనా… ఆ చిత్తభ్రమలు ఆ ఆలోచనల్ని పక్కదోవ పట్టిస్తూనే ఉంటాయి. అవకాశ ఆకాశహర్మ్యాలను, రంగుల కలల్లో చూపిస్తూనే ఉంటాయి. చివరాఖరకు నేల విడిచి సాము చేసేలా ఊరిస్తాయి, ఉత్తేజపరుస్తాయి, ఉసిగొలుపుతాయి కూడాను!
దసరా రోజే ఎందుకంటే..?


సెంటిమెంట్స్ ను వాడుకోవడమే కాదు… సెంటిమెంట్స్ ఎక్కువగా ఉన్న నేతల్లో కేసీఆర్ ఒకరు. అందుకే విజయదశమిని ఎంచుకుంటే… అంతా విజయమేనన్న ఆశతో కావచ్చు.. దసరాకు కొడుకును సింహాసనమెక్కించి… తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం! పైగా 2015లో ఆయత చండీయాగం, 2018లో రాజ్యశ్యామల యాగం, ఘనంగా నిర్వహించిన అమ్మవారి భక్తుడు కేసీఆర్. “ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయోనని” లెనిన్ అన్నట్టుగా.. సీఎం కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా, నిజామాబాద్ జిల్లా లో పురాతనమైన శ్రీ రాజ్యలక్ష్మి నరసింహ ఆలయాన్ని కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరణ చేసిన ఘటనలూ రాజకీయాల్లో చర్చనీంశాలే!
చరిత్ర సృష్టించనున్నాడా?


దాణా కుంభకోణంలో చిక్కుకుని… అప్పటి బీహార్ సీఎం లాలూప్రసాద్ యాదవ్.. తన భార్యను సీఎం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అప్పటి మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్, సంపూర్ణ మెజారిటీ సాధించి.. తన తనయుడు అఖిలేష్ యాదవ్ కు సీఎం పీఠం అప్పగించాడు. ఇలా వారసులకు కట్టబెట్టే వాళ్ల సంఖ్యే రాజకీయాల్లో ఎక్కువ. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో యూపీఏ చైర్ పర్సన్ హోదాలో ఉండి… తానో.. లేక తన కొడుకునో ప్రధానిగా చేసుకునే వెసులుబాటు, అవకాశమున్నా… ప్రధానిగా మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేసిన సోనియా వంటివారిని ఇప్పుడున్న వారసత్వ రాజకీయాల్లో వేళ్లపైనే లెక్కించుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారమే… ఒకవేళ కేసీఆర్ గనుక రాబోయే దసరాకే.. తనయుడు కేటీఆర్ కు దసరా పండుగ బహుమతిగా సీఎం పదవిని గనుక ఇస్తే… అది దేశ రాజకీయాల్లో ఓ హాట్ టాపిక్ గా మారడంతో పాటు…. రాష్ట్ర, జాతీయ రాజకీయాలను బాగా పరిశీలించేవారి నిశిత దృష్టి అప్పుడు కేసీర్ వేయబోయే అడుగులపైనే ఉంటుంది.