జగిత్యాల జైత్రయాత్రలో..
బహుజన వర్గాల పాత్ర కీలకం !

సెప్టెంబర్ 9 నాటికి 44 ఏళ్లు…

( జె సురేందర్ కుమార్. ధర్మపురి )
భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం 43ఏళ్ల క్రితం జగిత్యాల పట్టణంలో జరిగిన జైత్రయాత్ర విజయవంతం కావడానికి బహుజన వర్గప్రజల పాత్ర కీలకం.  దశాబ్దాలుగా అణగారిన వర్గాల ఆవేదన, ఆక్రందన,  ఆవేశం నుంచి అగ్నిపర్వత  విస్పోటంలా ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమ కెరటాల స్ఫూర్తి నాడు, నేడు ఎన్నో వర్గాల ప్రజలు కు  స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు. బాంచన్ అంటూ భయం, భయంగా, బతుకుతున్న  యువకులలో ధైర్యం నింపి వారితో బంధుకులు పట్టించింది అని కూడా చెప్పవచ్చు.  విప్లవాల ఉద్యమ చరిత్రలో జగిత్యాల జైత్రయాత్ర విశిష్ట స్థానం సుస్థిరపరచుకుంది అనే చర్చ నేటికీ  జరుగుతోంది. సెప్టెంబర్ 9 నాటికి జగిత్యాల చరిత్ర 44 ఏళ్ళు.

పీపుల్స్ వార్  పురుడు పోసుకోకముందే.
రైతు కూలీ సంఘం ఆవిర్భావం !


1975 నాటికి ఉత్తర తెలంగాణ జిల్లాలలో కొందరు దొరలు, భూస్వాములు, అటవీశాఖ, పటేల్, పట్వారీల దౌర్జన్యాలు, వర్ణనాతీతం. వారి ఆగడాలను, ప్రశ్నించేవారని గ్రామ చావడిలో ప్రజల ముందు కఠినంగా శిక్షించే వారు. గ్రామ పెద్దలు పంచాయతీలను, ఇష్టానుసారం నిర్వహించి తీర్పు చెప్పే వారు, డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లించే వారు కాదు, తీర్పు ఎలా ఉన్నా ఇరువర్గాలు ప్రశ్నించే సాహసం చేయలేక పోయేవారు . కొన్ని సందర్భాల్లో ప్రశ్నించే వారిని గ్రామాల నుంచి వెలి వేసేవారు. సాగు, తాగు, నీటి కటకట సంవత్సరాల తరబడి, కుటుంబాలకు, కుటుంబాలు వారి ఇళ్లలో వెట్టిచాకిరి. పాలేరు లకు జీతాలు ఉండేవికావు, వ్యవసాయ కూలీలకు ఇష్టానుసారంగా కూలీ డబ్బులు చెల్లించే వారు, దున్నేవాడికి భూమి ఉండేది కాదు, ప్రభుత్వ భూములు, బలవంతుల ఆక్రమణలో ఉండేవి. గ్రామాల్లో  సారాయి, కలు, గుత్త దారులు ( కాంట్రాక్టర్లు ) వారే, విద్య, వైద్యం, విద్యుత్  ఎండమావులే. ఇలాంటి తరుణంలో గ్రామ గ్రామాన రైతు కూలీ సంఘాలు ఏర్పడ్డాయి. (కుల వృత్తుల వారు,  పాలేర్లు, వ్యవసాయ కూలీలు ) ప్రధానంగా రైతు కూలి సంఘాల్లో కీలకం. పాలేరు లో జీతాలు పెంచకపోతే   పశువులను మేతకు తీసుకు వెళ్ళేవారు కాదు,  వ్యవసాయ కూలీ రేట్లు పెంచుకుంటే కలుపు, తీయడం నాట్లు, వేయడం వరి కోతలు, బంతి కొట్టడం, వారు నిషేధించే వారు. రజక, దళిత, నాయిని, కమ్మరి, కంచరి, కుమ్మరి, వడ్రంగి, గౌడ, తదితర కుల వృత్తుల వారు, తమ డిమాండ్ల సాధన కోసం ఐకమత్యంగా ఉండేవారు. ఇదే తరుణంలో వామపక్ష భావజాలం గల, మేధావులు, విద్యార్థులు, యువకులు  పల్లెలకు తరలండి అనే క్యాంపెయిన్ లో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామాల్లో వారు పర్యటించి గ్రామీణ ప్రజల జీవన విధానం, స్థితిగతులను వారు అధ్యయనం చేశారు.  రైతు కూలి సంఘల ఐక్యత, పరోక్షంగా వారిలో స్ఫూర్తినిచ్చింది కాబోలు.   దీంతో వారు.జగిత్యాల పట్టణ పాత బస్టాండ్ సమీపాన ప్రభుత్వ కళాశాల మైదానంలో 1978  సెప్టెంబర్ 9న జైత్ర యాత్ర పేరిట  రైతు కూలీ సంఘం సభ్యులతో భారీ బహిరంగ సభ, ఊరేగింపు నిర్వహించారు.
ఎలాంటి రవాణా, వసతి, సౌకర్యాలు టీవీ, పత్రికలు, టెలిఫోన్ లాంటి సదుపాయాలు లేవు కరీంనగర్ ,ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా లో  గోదావరి నది తీర ప్రాంతం  గ్రామాల నుంచి  వేలాది.మంది  బహుజనులు, ఎడ్లబండ్ల ద్వారా, కాలినడకన, కొన్ని రోజుల పాటు ప్రయాణించి, వంట చేసుకుంటూ సెప్టెంబర్ 9 నాటికి జగిత్యాల కు చేరుకున్నారు. ఈ సభలో ప్రజాయుద్ధ నౌక, గద్దర్ ఆడి ,పాడి రైతు కూలీలను ఉత్తేజపరిచి ,వారిలో ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఆయన కల్పించారు అని చెప్పవచ్చు. ప్రముఖ సాహితీవేత్త, రచయిత, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బి.ఎస్.రాములు తన ప్రభుత్వ ఉద్యోగం వదిలి, సాయుధ పోరు బాట పట్టి, అజ్ఞాతంలోకి వెళ్లి  దళిత సాహిత్యం , సృష్టించారు.
జైత్రయాత్ర  తర్వాత రెండు సంవత్సరాలకు  ఏప్రిల్ 22 ,1980లో, కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో పీపుల్స్ వార్ నక్సలైట్లు సంస్థ . పురుడు పోసుకుంది.  ఇదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పౌరహక్కుల సంఘాలు, విప్లవ రచయితల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు, విప్లవ, దళిత సాహిత్య సమ్మేళనాలు, జననాట్యమండలి, సింగరేణి కార్మిక సమాఖ్య, తదితర వామపక్ష భావజాల సంస్థలు పురుడు పోసుకున్నాయి అని చెప్పుకోవాల్సిందే.
ఉమ్మడి రాష్ట్రంలో కల్లోలిత ప్రాంతం !
గ్రామీణ ప్రాంత ప్రజలలో వచ్చిన ప్రశ్నించే తత్వం, తిరుగుబాటు తనం ,గుర్తించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1978-79  సంవత్సరంలో  ఈ ప్రాంతంను,  కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి, పారామిలటరీ, ఇండో-టిబెటన్, స్పెషల్ పోలీస్ ఫోర్స్ పోలీసు బలగాలను దించి,  గ్రామ గ్రామాల్లో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసింది. రైతు కూలీ సంఘం నాయకుల,  సభ్యుల గురించి వివరాలు సేకరిస్తూ వారి చితకబాదడం, దళ నాయకుడు ఎవరు ?  ఇందులో సభ్యులు ఎవరు ?  వారికి భోజనాలు, ఎందుకు పెడుతున్నారు?  అంటూ ఇళ్లపై దాడులు చేస్తూ, వంట సామాగ్రి లో, కిరోసిన్ కలపడం, ఇంటిని చిందరవందర చేయడం, గ్రామాల్లో చిన్న పెద్ద మహిళలు, వృద్ధులు, అనే తేడా లేకుండా గ్రామ చావిడిలో వారిని వరుసగా  కూర్చుండబెట్టి ఇష్టానుసారంగా స్పెషల్ పార్టీ పోలీసులు,  లాఠీలతో కొడుతూ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ( మంగళగిరి  స్పెషల్ పోలీస్ బెటాలియన్ )  వారు రాక్షస ఆనందం పొందే వారు. గ్రామాల్లో పోలీస్ క్యాంప్ లో,బట్టలు ఉతకడం, వంటపాత్రలు శుభ్రపరచడం, గ్రామీణుల తో చేయించడం షరా మామూలు. యువకులు, పై  నక్సల్స్ సానుభూతిపరులు గా ముద్రలు వేసి వందలమంది  పై పోలీస్ స్టేషన్లు కేసు నమోదు చేసే వారు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ. యువకులు ఆయా పోలీస్ స్టేషన్లకు, పోలింగ్ కేంద్రాలకు, బ్యాలెట్ బాక్సులు తరలించే వాహనాలకు, వీరిని రక్షణ కవచం గా పోలీసులు వాడుకునేవారు. పోలీసు దెబ్బలు, వేధింపులు, కేసులు భరించలేక అనేకమంది యువకులు బడుగు, బలహీన వర్గాల ప్రజలు,  ఉన్న ఊరును, చేతి వృత్తులను, తమ వ్యవసాయ భూములను, భార్య పిల్లల్ని,  వదిలి భీమండి, షోలాపూర్, ముంబాయి తదితర ప్రాంతాలకు వెళ్లి అజ్ఞాత జీవితం గడిపేవారు. 

కొంత శాతం యువత,నక్సలైట్ దళంలో చేరేవారు. దీంతో  గెరిల్లా దళాలు ఏర్పాట్లు, గ్రామాల్లో మిలిటెంట్ వ్యవస్థ ఏర్పాటు, టార్గెట్లను గ్రామ బహిష్కరణ, వారి భూములు   దున్న కపోవడం,పాలేర్లు బంద్ ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతాల్లో నెలకొన్న ఫ్యాక్షన్ రాజకీయాలు, ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు లేకపోవడం తో తాము స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని బడుగు ,బలహీన వర్గాల నాయకులు, అనేక సందర్భాల్లో జగిత్యాల జైత్రయాత్ర వల్లనే అంటూ వివరించడం పరిపాటి.
జైత్రయాత్ర తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలలో నిర్బంధాలు, తుపాకుల నీడలో జీవనం, ఎన్కౌంటర్లు, అమాయక పోలీసుల, ప్రజల ప్రాణత్యాగాలు, లక్షలాది విలువగా  ప్రైవేట్, ప్రభుత్వ, ఆస్తుల ధ్వంసం , పోలీసులు, ప్రభుత్వం ప్రజలు, ప్రాణాలు పణంగా పెట్టి, సమాజం ప్రశాంత మనుగడకు చేసిన కృషి అభినందనీయం. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాలో సాగునీరు తాగు,నీరు ,విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజానీకం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యాన్ని కల్పించింది మాత్రం, జగిత్యాల జైత్రయాత్ర లో బహుజన వర్గాల ప్రజలదే కీలక పాత్ర   అనే చర్చ నేటికీ కొనసాగుతుంది. .