( J. Surender Kumar)
రాజకీయాలను స్వార్థ ప్రయోజనాలే శాసిస్తున్నాయితప్ప ప్రజా ప్రయోజనాలు ప్రభావం చూపడంలేదు. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నాయకుల నాటకాలు. సిద్ధాంతాల బూటకాలు. ముఖ్య నేతల ముఖాలే తప్ప మూల విలువలు ఆవిరులైనాయి. యథా రాజా, తథాప్రజా అనేది నానుడి. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు. రాజు ప్రజలకు మార్గదర్శనం చేయాలి. పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పుడు పాలకులే రాజ ధర్మాన్ని వదలి, స్వార్థ మార్గాన్ని అనుసరిస్తే, వారికి తగిన సూచనలు చేయవలసిన, సచివాలయాలే మూగబోతే, నీతిబోధ చేయవలసిన ఆధ్యాత్మిక గురువులే భజనపరులైతే, ప్రజలు వారి వారి స్వలాభ౦ కోసం నాయకుల, అడుగులకు మడుగులొత్తితే, సమాజంలో మంచివారి మౌనం శాపంగా మారితే. సమాజ శ్రేయస్సు సాధ్యమేనా? సమన్యాయం ఎండమావి కాదా ? ప్రజాస్వామ్యం నేతిబీరకాయ కాక ఏమవుతుంది ? నేతల మాటలు నీటిమూటలు కావా ? ప్రజాభవిత ప్రశ్నార్థకంగా
మారదా?
చౌరస్తాలో…
ఇక ప్రస్తుతం దేశపరిస్థితులు, రాష్ట్ర, స్థితిగతులు నాలుగు కూడళ్ళవద్ద ఉన్నాయి. ఐతే ఆ నాలుగు మార్గాలు ఎటు తీసుకవెళ్తాయో చెప్పలేని, దారి చూపలేని, నాయకత్వం మనది. ఒకరేమో అంతా బాగున్నదని, ఇంకొకరేమో అంత అంధకారంగా మారిందని, మరొకరేమో ప్రజాస్వామ్యం లేదని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి నెట్టుతున్నారు. ఎవరి దృష్టి వారిది. ఎవరి లెక్కలు వారివి. అందుకే ఆంగ్లంలో మూడు రకాలైన అబద్ధాలు ఉన్నాయ్ అంటారు. అవి అబద్ధాలు, హేయమైన అబద్ధాలు, మరియు గణాంకాలు (There are three kind of lies. Lies, damned Lies and Statistics). అలాగే ఉంది ప్రస్తుత మన ప్రభుత్వాల వాదనలు, ప్రతి వాదనలు మరియు ప్రభుత్వపథకాలు. వాటి ప్రయోజనాలు.
తెలంగాణ వాదం బలమైంది…
ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించారు. ప్రత్యర్థులను చిత్తు చేసారు. కొన్నిమార్లు కుంగి పోయారు కాని లేచారు. లేచి గెలిచారు. వారి విజయంలో తెలంగాణ ప్రజల.మద్దతు, మేధావులు, కళాకారులు, విద్యార్థులు పాత్ర, సకల జనుల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష విస్వరించలేనిది. మహాభారతం ఎవరు చెప్పినా వినడానికి వినసొంపుగా ఉంటుంది. ఎందుకంటే గొప్పదనం భారత కథ బలంలో ఉంది. అలాగే తెలంగాణ వాదం బలమైంది. దాన్ని అందరూ బలపర్చారు. రాష్త్రావతరణకు ముందు తెలంగాణ వాదం, ఎవరు వినిపించినా వారిని, వారి వాణిని ఆదరించారు. ఆ వాదాన్ని గొప్పగా ఒడిసిపట్టుకొని ప్రతికూల పరిస్థితులకు ఎదురీదిన కెసీఆర్ తీరం చేరారు, చేర్చారు. ప్రతిఫలంగా రెండు మార్లు సీఎం పదవితో ఆయన సత్కరించబడ్డారు. మొదటి ముఖ్యమంత్రిగా ఒక గొప్ప అవకాశాన్ని పొందాడు.
టిఆర్ఎస్, బిజెపిలకు పరీక్షా సమయం ! రాజకీయాల్లో పరిస్థితులు ఒకేరకంగా ఉండవు. ఎప్పుడైతే బీజెపికి తెలంగాణలో అవకాశం కనిపించిందో కెసిఆర్ కు బీజెపిపట్ల వ్యతిరేక భావం ఏర్పడింది. .బీజెపి రాష్ట్రంలో పెరుగుతున్నకొలది, బీజెపిపై కెసిఆర్ వ్యతిరేక స్వరం పెరుగుతూవస్తున్నది. తెరాస రాష్ట్రంలో మూడవసారి అధికారంలోకి రావడానికి చూస్తున్నది. బీజెపి కేంద్రంలో మూడవసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నది. .రెండు విభిన్నమైన పోరాటాలు. పోల్చడానికి లేదు. కాని రెండు పార్టీలకు ఇది పరీక్షనే. మోడీ దేశంలో ఎంత ప్రజాదరణ కలిగిన నాయకుడో, రాష్ట్రంలో కెసిఆర్ అదే స్థాయి ఆదరణ కలిగిన నాయకుడు. విచిత్రమైన పరిణామం కెసిఆర్ జాతీయ పార్టీకి సన్నాహాలు చేయడం. ప్రతిపక్ష పార్టీలను కలపడానికి ప్రయత్నించడం బిజెపిని గద్దె దించడమే ధ్యేయంగా సాగడం. కెసిఆర్ కు రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేక గడచిన ఎనిమిది ఏళ్ళు సాఫీగాగడచాయి. కాని మోడీ, షా ద్వయం రూపంలో ఈసారి గట్టి పోటీ ఉంటుంది. వీరిని వాజ్ పేయి, అద్వాని ద్వయంతో పోల్చలేము. వీరు లక్ష్యసాధనలో, వ్యూహాలలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. కొన్నిసార్లు వారి వ్యూహాలు ఫలించకపోవచ్చు. కాని ఎక్కువసార్లు వారు అఖండ విజయాలు సాధించారు. ముఖ్యంగా మోడీ ప్రజల నుంచి వచ్చిన మనిషి. మొత్తంగా వీరి జుగల్బ౦దీ భారత రాజకీయాలను మున్నెన్నడూ లేని కోణాల్లో నడిపిస్తున్నది. వీరి రాజకీయ చతురతను, నిర్ణయసామర్థ్యాన్ని, వనరులను, కెసిఆర్ తక్కువ అంచనా వేస్తే ప్రమాదమే! ప్రస్తుత పరిస్థితి ఎవరికి అనుకూలం. ?

మోడీ జాతీయ రాజకీయాల్లో రావడానికి ముందు గుజరాత్ లో ఆయనకు ఎదురు లేదు. పార్టీని నాలుగు సార్లు అధికారంలోకి నడిపించాడు. వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నాయకుడిగా , అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిన సమయం మోడీకి కలసి వచ్చింది. .కాని కెసిఆర్ కు ఆ పరిస్థితి లేదు. ఆర్థిక ఇబ్బందులు, ప్రజల్లో వ్యతిరేక పవనాలు ప్రస్తుతం.అంతగా లేకున్నా “అంతా బాగా లేదు” అనే భావన, టిఆర్ఎస్ కింది స్థాయి నాయకులపై అసంతృప్తి, మౌలిక సమస్యల పట్ల అశ్రద్ధ, నెరవేర్చని కొన్ని ముఖ్య వాగ్దానాలు కెసిఆర్ ప్రభుత్వాన్ని వె౦టాడుతున్నాయి. కెసిఆర్ టీఆరెస్ కు బలం, బలహీనత. కెసిఆర్ కుటుంబంపై ఈ పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలు రావడం కెసిఆర్ కు కొంత ఇబ్బందికరమే. కెసిఆర్ కు మరొక సవాలు దేశంలోని బీజెపి ప్రతిపక్ష పార్టీలు. దాదాపు చాలావరకు అవి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవే. మొన్నటికి మొన్న మమత బెనర్జీ, ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలు త్వరగా మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతాయి. అలాంటి పార్టీలతో జత కెసిఆర్ కు మేలు కంటే కీడు చేసే అవకాశాలే ఎక్కువ.
సంకీర్ణ ప్రభుత్వాలవిశ్వసనీయత..?
మూడవది కాంగ్రెస్ తో దోస్తీ. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ఒక పెళ్ళి లడ్డు లాంటిది. తిన్నా బాధనే. తినకున్నా బాధనే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర బహుశః కెసిఆర్ ను జాతీయస్థాయిలో కాంగ్రెస్ వైపు అడుగులు వేయించే పరిస్థితికి తీసుకురావచ్చు. దాని పర్యావసనం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపకుండా ఉండవు. నాలుగవది సంకీర్ణ ప్రభుత్వాల విశ్వసనీయత. గత అనుభవాలు అపారం. సుస్థిరత ప్రశ్నార్థకం మోడీ పై నాయకులకు గల వ్యక్తిగత వ్యతిరేకత, ప్రజల్లో అదే స్థాయిలో ఉందా ? ఉంటే అది ఓట్ల రూపంలో మారుతుందా? కాలమే సమాధాన౦ చెప్పాలి. ఐదవది, కెసిఆర్ జాతీయ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది ? ఎన్ని సాధిస్తుంది ? ఎవరితో పొత్తు ముద్దు, ఎవరితో వద్దు , ఇది అత్యంత కీలకమైన సవాల్. ఎందుకంటే రాజకీయాలు నెంబర్ గేమే కదా ! కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళితే రాష్ట్రంలో, పార్టీలో నాయకత్వ మార్పులు దిద్దాలి. ఇలాంటి ఎన్నో సవాళ్ళను కెసిఆర్ ఎదుర్కోవడానికి కెసిఆర్ సన్నద్ధం కావాలి.
ప్రశ్నలకు ప్రశ్నలు సమాధానాలు కావు

కెసిఆర్ పెట్టబోతున్న జాతీయ పార్టీ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం పై సంధిస్తున్న సూటి ప్రశ్నలకు మోడీ సమాధానాలు ఇవ్వాల్సిందే. అదే సమయంలో బిజెపి ఎత్తి చూపుతున్న సమస్యలకు, ఆరోపణలకు కెసిఆర్ సర్కార్ సమాధానలు ఇవ్వాలి. ప్రశ్నలకు పశ్నలు సమాధానాలు కావు. వేరే బిజెపి రాష్ట్రాలతో తెలంగాణ ను పోల్చి సమాధానాలు దాటవేస్తే , టీఆర్ఎస్ పార్టీకే నష్టం. తెలంగాణ ప్రజలు, ఆ మాటకు వస్తే భారత ఓటర్లు వివేకవంతులు వారికి ఏమి కావాలో వారికి తెలుసు, ఏ నేత ఎన్నెన్ని మాటలు చెప్పినా హంస పాలు ,నీళ్ళను వేరు చేసినట్టుగా వారి మాటల్లోని నిజానిజాలను తెలుసుకోగలరు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోగలరు.
కెసిఆర్ తన రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే కెసిఆర్ పులి పై స్వారీ చేస్తున్న లాంటిదే అని చెప్పవచ్చు!