నాడుఅజాంగోరి.నేడు పీఎఫ్ ఐ
(J.Surender Kumar)
పేరు పెట్టుకున్నందుకు కావల్సినంత పాప్యులరైంది పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. అది స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియాకు మరో రూపమని… పోలీసులు ఇప్పటికే తేల్చేశారు. ఇప్పటికే సిమీ నిషేధిత సంస్థగా కొనసాగుతోంది. సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందన్న కారణాలతో 2019లో మరోసారి మరో ఐదేళ్లపాటు సిమీపై నిషేధాన్ని పొడగించారు. అయితే మొట్టమొదట పీఎఫ్ఐ ముసుగులో జరుగుతున్న కార్యకలాపాలు నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూడటంతో… ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కల్లోలానికి తెరలేచింది.
ఆ క్రమంలోనే పీఎఫ్ఐ కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఇందూర్ పోలీసులు… నల్గురిని అరెస్ట్ చేయడంతో… మరోసారి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి యావత్ దేశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జార్ఖండ్ వంటి రాష్ట్రంలో నిషేధిత సంస్థగా ముద్రపడ్డ పీఎఫ్ఐ కార్యకలాపాలు ఇందూర్ లో వెలుగులోకొచ్చిన తీరుతో.. నేషనల్ మీడియా కూడా నిజామాబాద్ వైపు చూసింది.
జూలైలో నిజామాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా… నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉగ్రకుట్రపై నిఘా పెట్టింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు… అంతకుముందు ఆర్మూర్ లోనూ ఎన్ఐఏ అధికారులు పర్యటించడంతోనే… ఎన్ఐఏ కేసును స్వాధీనపర్చుకుని జిల్లాపై ఎంత సీరియస్ గా దృష్టి సారించిందనే విషయం అర్థమైపోయింది. దాని పర్యవసానమే మొన్న ఆదివారం రోజు సెప్టెంబర్ 18న ఎన్ఐఏ దాడులు. 38 బృందాలతో రెండు తెలుగు రాష్ట్రాలను వణుకు పుట్టించిన ఈ ఎన్ఐఏ దాడుల్లో… 23 బృందాలు కేవలం నిజామాబాద్ లోనే సోదాలు నిర్వహించాయంటేనే… ఇందూరులో ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు. జూలైలో నిజామాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే… ఎన్ఐఏ కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యే విధంగా దాడులు జరిగాయి.
జగిత్యాల జిల్లాకు చెందిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి నిజామాబాద్ లో ఉన్నపళంగా ఇల్లు కట్టుకోవడం… కరాటే పేరుతో ట్రైనింగ్ ఇవ్వడం… వివిధ రాష్ట్రాలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకూ వెళ్తూ కరాటే కోచింగ్ క్లాసులు నిర్వహించడంతో పాటు… ఆయన దగ్గర లభించిన సాహిత్యం, నాంచాకులు, కట్టెలు, ఇతర ఆయుధాలవంటివన్నీ ఎన్నో అనుమానాలను రేకెత్తించాయి. దాంతో పోలీసులు మొదట అబ్దుల్ ఖాదర్ ను అరెస్ట్ చేశారు. అయితే నిజామాబాద్ ఓ సున్నిత ప్రాంతంగా ముద్రపడిపోవడంతో… పోలీసులైనా, సామాన్యులైనా, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీసైనా ప్రధానంగా ఫోకస్ ఈ పట్టణంపైనే ఉంటుందన్న నమ్మకమో, ఏమో… పీఎఫ్ఐ కార్యకలాపాలకు నిజామాబాద్ రూరల్ మండలమైన గుండారమూ ప్రధాన కేంద్రమైంది. కానీ, తమ పరిశోధనలో భాగంగా తోడుతూనే ఉన్న పోలీసులు… అబ్దుల్ ఖాదర్ ను అలా అరెస్ట్ చేశారో, లేదో నాల్గురోజులు తిరిగేసరికి… మరో ముగ్గురు పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిలో పీఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ గా వ్యవహరిస్తున్న షాదుల్లాతో పాటు… మోబిన్, ఇమ్రాన్ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఉగ్రలింకులనే అనుమానాలతో కేసు ఫైలైందో… ఇక కేసు మొత్తం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేతిలోకి వెళ్లిపోయింది.
ఇప్పటికే జిల్లాలో రెండుసార్లు పర్యటించిన ఎన్ఐఏ అధికారులు… ఆదివారం రాకతో మాత్రం కాక పుట్టించారు. అంతకుముందు ఆర్మూర్ జిరాయత్ నగర్ లో ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్లకు విదేశాల నుంచి అందిన ఫండ్స్ పై ఆరా తీశారు. ఆ తర్వాత మళ్లీ మొన్నటి ఆదివారం ఏకంగా 23 బృందాలు ఏకంగా పదిగంటల పాటు పీఎఫ్ఐలో పనిచేస్తున్న అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించాయి. కీలక డాక్యుమెంట్లు, పాస్ పోర్టులు, బ్యాంక్ లావాదేవీల వివరాలన్నీ సేకరించాయి. 8 లక్షల రూపాయల వరకూ స్వాధీనం చేసుకున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల్లో జరిగిన సోదాల్లో మొత్తం నల్గురిని అరెస్ట్ చేశాయి. నిజామాబాద్ లో సమీర్ అనే డిగ్రీ రెండో సంవత్సరం చదువుతన్న విద్యార్థిని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. షాహీద్ అనే వ్యక్తితో పాటు మరికొందరికి 41 సీఆర్పీసీ కింద హైదరాబాద్ లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీచేశారు. మొత్తంగా జిల్లా కేంద్రంలోని మాలపల్లి, అర్సపల్లి, హౌజింగ్ బోర్డ్, కంఠేశ్వర్, ఆటోనగర్ వంటి ప్రాంతాలతో పాటు… అటు నిజామాబాద్ రూరల్ మండలం గుండారం, ఆర్మూర్ లోని జిరాయత్ నగర్, ఎడపల్లి మండలం ఎంఎస్సీఫారంలలో సందేహాస్పదమైన ప్రతీ ఇంటినీ జల్లెడ పట్టారు. ఎంఎస్సీఫారమ్ లో ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తున్న షేఖ్ ముఖీమ్ ఇంట్లో సోదాలు చేశారు. రెండు మోబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. రెండురోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
ఇలా మొత్తంగా ఎన్ఐఏ దాడులు నిజామాబాద్ తో పాటు… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర కలకలం రేపగా… పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాలపై జనసామాన్యంలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టడం, దాడులకు పాల్పడటం, రాళ్లు రువ్వడం, దేశంలో విధ్వంసం సృష్టించే కుట్రలకు పాల్పడటం… వీటన్నింటిలో ట్రైనింగ్ నిచ్చేందుంకు… పైన ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో కరాటే ట్రైనింగ్ పేరుతో పీఎఫ్ఐ పాప్యులర్ అవుతున్న విధానాలన్నీ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఏ అనుమానాలైతే వ్యక్తం చేశారో… అదే కోణంలో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే దేశం పలు విధ్వంసకర ఘటనలు చూసిన నేపథ్యంలో… ఆ నెత్తుటి జ్ఞాపకాల నుంచి ఇంకా ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితుల్లో… మరోసారి ఉగ్రమూకలు దేశంలో అశాంతిని సృష్టించేందుకు యత్నం చేస్తుంటే కచ్చితంగా ఆపాల్సిందేన్న చర్చా సాధారణ జనంతో పాటు… సోషల్ మీడియాలోనూ తీవ్రంగా జరిగింది. అయితే ఇదంతా దేశరక్షణకు సంబంధించిన సున్నితమైన అంశం. కాబట్టి ఎక్కడా ఎలాంటి ఆశ్రిత పక్షపాతాలకు తావు లేకుండా ఇన్వెస్టిగేషన్ జరుపుతూనే… మరోవైపు అలాంటి కుట్రలేమైనా ఉంటే అడ్డుకోవాల్సిన సమయంలో… వీటిని సంకుచిత రాజకీయాలకు వాడుకోవడమూ సుతారమూ మంచిది కాదు.
ఐఎస్ఐ ఉగ్రవాది అజాంగోరి ఎన్కౌంటర్ తో ఉత్తర తెలంగాణా ఉలికిపాటు!
అది 2000 వ సంవత్సరం. అప్పటి నిజామాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ రవి శంకర్ అయ్యంగార్. దక్షిణ భారత కమాండర్ గా పనిచేస్తున్న అజామ్ గోరి అనే ఐఎస్ఐ ఉగ్రవాదిని ఎదురుకాల్పుల్లో ఎన్ కౌంటర్ చేసిన ఘటన ఓ సంచలనం. ఏప్రిల్ మాసంలో జగిత్యాల్లో జరిగిన ఈ ఘటనతో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. నకిలీ నోట్ల చలామణి, గల్ఫ్ ఏజెంట్ల మోసం, తదితర నేరాల నేపథ్యంలో ఎస్పీ రవిశంకర్ నాడు… నిజామాబాద్ పట్టణంలోని ఎస్టీడి బూతులపై నిఘా పెట్టారు. నాడు నిజామాబాద్లో రెండో, మూడో ఎస్టీడి బూతులు మాత్రమే ఉండేవి. జగిత్యాల పట్టణంలో కోర్టు భవనం ముందు.. క్లబ్ కాంప్లెక్స్ దగ్గర.. ఒకే ఒక ఎస్టీడి బూతు ఉండేది. జగిత్యాల నుంచి ఓ వ్యక్తి తరచుగా నిజామాబాద్ కు వెళ్లి.. అక్కడ నుంచి పాకిస్తాన్, ఇతర దేశాలకు ఫోన్ మాట్లాడేవాడు. ఆ విషయాన్ని నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న ఎస్పీ అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా మెట్టుపల్లి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్లో సీట్ల కింద 2000 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఓ టిఫిన్ బాంబు పేలింది. ఈ సంఘటనలో ఇద్దరు, ముగ్గురు ప్రేక్షకులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆకతాయులదని.. దీపావళి టపాసులంటూ అప్పుడు పోలీసు వర్గాలు ప్రచారం చేశాయి. పేలిన శకలాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించగా.. అవి అమోనియా నైట్రేట్ వంటి రసాయన పదార్థాలతో తయారైన పేలుడు పదార్థాలుగా ఫోరెన్సిక్ అధికారులు నివేదికనిచ్చారు. దాంతో పోలీసు వర్గాల్లో అప్పుడు మళ్లీ కలవరం మొదలైంది. నిజామాబాద్ పోలీస్ అదుపులో ఉన్న వ్యక్తిని ఈ అంశంపై తమదైన శైలిలో విచారణ జరపగా.. జగిత్యాల్లో స్థావరం ఏర్పర్చుకుని.. పిన్నిసులు, దువ్వెనలు, అద్దాలు విక్రయించేవాడిలా చలామణి అవుతూ… ఐఎస్ఐ దక్షిణ భారత కమాండర్ గా… అజామ్ గోరి చేస్తున్న కార్యకలాపాలు వెలుగులోకొచ్చాయి. దాంతో పకడ్బందీగా స్వయాన ఎస్పీ డాక్టర్ రవిశంకర్.. మఫ్టీలోప్రత్యేక పోలీసు బలగాల బృందానికి నాయకత్వం వహించి కొన్ని రోజులపాటు జగిత్యాలలో స్థావరం ఏర్పాటు చేసుకుని.. అజామ్ గోరి కదలికలపై రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. సరిగ్గా 2000 ఏప్రిల్ మొదటివారంలో అజామ్ గోరి సైకిల్ పై జగిత్యాల్లోని ఆర్టీసీ డిపోవైపు వెళ్లుతుండగా పోలీసులకు తారసపడ్డాడు. ఆ దశలో జరిగిన పెనుగులాట.. ఎదురుకాల్పులో అజామ్ గోరి హతమయ్యాడు. ఈ సంఘటనతో జగిత్యాల పట్టణంతో పాటు… పోలీస్ శాఖ ఉలిక్కిపడి ఐఎస్ఐ స్లీపర్ డెన్లు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నట్టుగా గుర్తించి అప్రమత్తమయ్యాయి.
ఓ గోకుల్ ఛాట్ ఉదంతం, ఓ లుంబినీ పార్క్ దుర్ఘటన, ముంబై తాజ్ ఘటన వంటివెన్నో కళ్లముందు ఇంకా కదలాడుతున్న తరుణాన… ఉత్తర తెలంగాణాలోనూ ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ ఉన్నట్టు ఇప్పటికే పలుమార్లు ఉనికిలోకి వచ్చిన క్రమంలో… ప్రస్తుతం పీఎఫ్ఐ ఉదంతం మరోసారి దేశం మొత్తం అలర్ట్ చేసిందనే చెప్పాలి. అయితే ఈ ఉదంతం ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది… ఎంతమందిని NIA అధికారులు ప్రశ్నిస్తారన్నది ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లేకొద్దీ మనకు అవగతమయ్యే విషయాలు కాగా… ఉత్తర తెలంగాణాలో సున్నితమైన ప్రాంతంగా పేరొందిన నిజామాబాదే మళ్లీ అందుకు బేస్ క్యాంపవ్వడమే ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తున్న ప్రధానాంశం.