సర్వే నివేదికలలో నిజాల శాతం ఎంత.?

(J. Surender Kumar )


ప్రస్తుతం దేశంలో, ఆయా రాష్ట్రాలలో, రాజకీయ పార్టీలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు సర్వేల ఫీవర్ పట్టుకుంది. తమపై, తమ పార్టీపై,  ప్రజాక్షేత్రంలో అనుకూల, ప్రతికూల ప్రభావం, ఎంత ?  ఇతర పార్టీ నాయకులకు, ఉన్న బలం ,  బలహీనత  తెలుసుకోవడం కోసమే ఈ సర్వే బృందాలకు పెద్ద మొత్తం ముట్ట చెప్పి నివేదికలు తెప్పించుకుంటున్నారు.  సర్వేల నివేదికలో నిజాల శాతం ఎంత ?  అవస్తవాల శాతం ఎంత ?  అనే అంశం ఆయా రాజకీయ పార్టీలు, నాయకులు, పరిశీలిస్తున్నరో లేదో తెలియదు గాని  నివేదికల ఆధారంగానే తమ రాజకీయ ప్రాబల్యాన్ని శాశ్వత పరచుకోవాలనే ప్రయత్నాల. ముమ్మరం చేసుకుంటున్నది మాత్రం నిజం.


గత రెండు దశాబ్దాల క్రితం రాజకీయ సర్వేల తీరుకు ప్రస్తుతం పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న సర్వేజెన్సీల తీరుకు చాలా తేడా ఉందనే విషయం అధిక శాతం పార్టీలకు, నాయకులకు, తెలిసి ఉండకపోవచ్చు.

నాటి సర్వే తీరు!
ఉమ్మడి రాష్ట్రంలో ప్రముఖ ప్రాంతీయ దినపత్రికలు, ఎన్నికల కు కొన్ని నెలల ముందు, లేక ప్రభుత్వాలు ఏర్పడ్డాక సంవత్సర కాలానికో,  కరువులు, వర్షాభావం ధరలు పెరుగుదల, తదితర సందర్భాలలో ఆయా పత్రికల పక్షాన సర్వేలు నిర్వహించేవారు.  ఈ నివేదిక లు పాలకుల కు అప్పగించేవారా?  ప్రచురించేవారా ?  పాలకులను అప్రమత్తం చేసేవారా ?  ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు నిర్వహించేవారా ?  అనే విషయం తెలియదు.  తమ తమ పత్రికల్లో పనిచేసే మండల జర్నలిస్టులకు  జిల్లా కేంద్రంలో, డివిజన్ కేంద్రంలో కానీ, పత్రికా యాజమాన్యాలు సర్వే నిర్వహణ తీరుతెన్నులపై శిక్షణ ఇచ్చేవారు.
ప్రింటెడ్ ఫార్మేట్.!
పరీక్ష లో ఆబ్జెక్ట్ టైప్ పేపర్ మాదిరిగా,  ప్రింటర్ ఫార్మేట్లో సమస్యలు పొందుపరిచేవారు. ( ఇందులో ప్రధానంగా వ్యవసాయం, కరువు, విద్యుత్తు, విద్య, వైద్యం నక్సల్స్ ప్రాబల్యం, సాగు,తాగునీరు, రైతుల ఇబ్బందులు, తదితర అంశాలు ఉండేవి ) మండలంలోని గ్రామాలలో, రైతులను ఉద్యోగులను, మహిళలను, వ్యవసాయ కూలీలను, నిరుద్యోగ యువతను, తదితరుల ముందు ఈ ప్రశ్నల నుంచి వారి అభిప్రాయాలను ఫార్మేట్ పై టిక్కు చేయాల్సి ఉంటుంది.  సర్వే చేపట్టే వారి  సొంత అభిప్రాయాలకు అవకాశం ఉండేది కాదు. .ప్రతి గ్రామంలో కనీసం 50 నుంచి 100 మందిని ప్రత్యక్షంగా కలిసి అభిప్రాయాలను ఫార్మేట్లో నమోదు చేసేవారు. నిర్ణీత  కాల వ్యవధిలో మండలంలోని ప్రతి గ్రామాల నివేదికను మండల జర్నలిస్టులు, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కు అందజేసేవారు. సర్వే నిర్వహించినందుకు గాను  జర్నలిస్టులకు అదనంగా కొంత మొత్తం నగదు చెల్లించే పత్రిక యాజమాన్యాలు కూడా ఉండేవి.  చాలా రహస్యంగా ఇతర (పత్రికలకు) కొన్ని సందర్భాల్లో తెలియకుండా సర్వే చేయించేవారు.  క్షేత్రస్థాయిలో ప్రజల  అభిప్రాయాలు పాత్రికేయుడు  ఆ ప్రాంత ప్రజలతో  స్నేహ సంబంధాలు కలిగి ఉండడంతో సర్వే నివేదికలలో దాదాపు 80 శాతం నిజాలే ఉండి ఉండవచ్చు.


మారిన ట్రెండ్!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా  ప్రశాంత్ కిషోర్, సునీల్ కనుగోల, సర్వే ఏజెన్సీలో ట్రెండింగ్  కొనసాగుతుంది. 2014 పార్లమెంట్  ఎన్నికల ఫలితాలు,  ప్రశాంత్ కిషోర్ సర్వే నివేదికలు, వ్యూహాలు, తదితర అంశాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పేరు ప్రస్తుతం ప్రింటింగ్ లో కొనసాగుతోంది. ప్రశాంత్ కిషోర్, సునీల్ మానియా  ఆయా రాష్ట్రాల అధికార పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు నాయకులకు పట్టుకుంది. ఈ సంస్థలకు వారు పెద్ద మొత్తంలో చెల్లించి సర్వే నివేదికలు తెప్పించుకొని రాజకీయ ఎత్తులను అమలు  పరచడం అనేది, ఆత్మహత్య సాదృశ్యమే అవుతుంది.  ఇలాంటి సర్వే  ఏజెన్సీలకు  క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉన్నారా ?  ఎంతకాలంగా వారు ఆయా సెగ్మెంట్లలో నివాసం ఉంటున్నారు ?  ఒక తెలంగాణలో 119 అసెంబ్లీ  సెగ్మెంట్ల పరిధిలో కనీసం 50 మంది  సిబ్బంది అయినా  ఉన్నారా ?  ఆయా ప్రాంతాల ప్రజలతో వీరు ఏ ప్రాతిపదిక నా మమేకమై ( కలసి మెలసి స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు.? ) వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు ?  తదితర అంశాలు ఆయా రాజకీయ పార్టీలు, నాయకులు పరిగణములోకి తీసుకుంటే వారిచ్చే నివేదికలో నిజాల శాతం ఎంత?  అనేది  తెలిసే అవకాశం ఉంటుంది.
నిఘా వ్యవస్థ లో నిస్తేజం ?
రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఏం జరిగినా  క్షణాల్లో ప్రభుత్వంకు  నివేదికల అందించే నిఘా వ్యవస్థలో నిస్తేజం ఆవరించిందా ?  నిద్ర మత్తులో ఉందా ?  అనే అనే చర్చ ఉంది. .గతంలో జరిగిన సంఘటనల జోలికి వెళ్లకుండా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో వీఆర్ఏల ,  ఉపాధ్యాయ సంఘాలు , తదితర ఏడు సంఘాలు చలో అసెంబ్లీ ముట్టడి  ఆందోళన కార్యక్రమాలు ముందస్తుగా  నిఘా వర్గాలు పసిగట్టకపోవడంతో ఈ చర్చకు అవకాశం కల్పించింది.  దుబ్బాక, హుజురాబాద్ ,  హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో, క్షేత్రస్థాయిలో వాస్తవాలు  ఉన్నతాధికారులకు వివరిస్తే, వారు ప్రభుత్వానికి అనుకూలంగా పరిస్థితి ఉందని నివేదికలు ఇచ్చారనే  చర్చ సైతం నాడు  నెలకొంది అనే చర్చ ఉంది.
వైఎస్ఆర్ హాయంలో నిఘా విభాగం

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, 2009 ఎన్నికల్లో 294 అసెంబ్లీ సెగ్మెంట్ ల లో కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీలు పోటీపడ్డాయి, ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తాయి అనే నివేదిక నిఘా వర్గాలు, జిల్లాల వారీగా అందించారు. తిరిగి తన ప్రభుత్వమే ఏర్పాటు అవుతుంది నాటి సీఎం వైఎస్ఆర్   బహిరంగంగానే ప్రకటించారు. ఉత్తర తెలంగాణ  జిల్లాకు చెందిన, రెండు అసెంబ్లీ నియోజకవర్గలలో తన ఆప్తులు, నమ్మకైన వారు ఓటమి  సమాచారం  ఆ నివేదికలో ఉండడంతో, . వైయస్సార్ మరోసారి ఆ నియోజకవర్గాల్లో  సర్వే చేయించుకుని   వారి ఓటమి ఖాయమని నిర్ధారించుకున్నట్టు సమాచారం.  మరుసటి రోజు ఓట్ల లెక్కింపుకు  ఓ రోజు సాయంత్రం స్వయంగా నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఫోన్ చేశారు. వారితో  పోలింగ్ జరిగిన తీరుతున్నలు, పర్సంటేజీ ,.ఇతర పార్టీల ఉనికి తదితర అంశాల మాట్లాడుతూ. “వచ్చేది మన ప్రభుత్వం, ఫలితాలు కొద్దిగా ఓట్లతో తారుమారైన మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, 100% మన ప్రభుత్వం ఏర్పడుతుంది, గెలుపు నివేదికలు నాకు వచ్చాయి. ఒకవేళ ఫలితాలు తారుమారైతే మీరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు.  మీరు ఇద్దరు నా ఆత్మీయులు  అంటూ ఫోన్ పెట్టేసారు.  ఇదే అంశాన్ని ఓ ప్రముఖ దినపత్రిక ఓట్లు కౌంటింగ్ జరిగే రోజునే  ” కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ ఇద్దరు ఓడితే ?”  అంటూ  సీఎం వైఎస్ అభ్యర్థులకు ఫోన్ చేసిన అంశం లేకుండా  వార్తను  ప్రచురించారు.
సోషల్ మీడియాతో …
ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఏం జరిగినా సోషల్ మీడియా ద్వారా యావత్ ప్రపంచానికి    క్షణాల్లో సమాచారం  తెలుస్తున్నది.  ప్రత్యక్ష ప్రసారాలు, ప్రసంగించిన అంశాలు,  విమర్శలు, ప్రతి విమర్శలు, అభివృద్ధి పనులు, సమస్యలు, పోలీసుల త్యాగాలు, వేధింపులు, రెవెన్యూ ,ఎక్సైజ్ వారి దౌర్జన్యాలు,  ఆయా రాజకీయ పార్టీలలో గ్రూప్ తగాదాలు, గొడవలు,రైతు సమస్యలు, రైతుల సమస్యలు, తదితర అంశాలు పత్రికలో ప్రచురణ కాక ముందే , సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.  ఇలాంటి తరుణంలో ప్రజల అభిప్రాయాలు, మనోభావాలు, వారికి ప్రభుత్వం, నాయకుల మీద ఉన్న వ్యతిరేకత, అనుకూలత, ఆయా సర్వేజెన్సీలు ఇచ్చే నివేదికలలో ఏముంటుందో ?  ఆయా పార్టీలకు, నాయకుల గుర్తించగలిగితే చాలు.