చదువుల తల్లి !
డా!! వారిజారాణి కి ప్రొఫెసర్ గా పదోన్నతి !

ఉస్మానియా యూనివర్సిటీ లో

( J. Surender Kumar )
జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన చదువుల తల్లిగా గుర్తింపు పొందిన  డా॥ వారిజారాణి, ఉస్మానియా యూనివర్సిటీ లోని తెలుగుశాఖలో ప్రొఫెసర్ గా పదోన్నతిపొందారు.

ఈమెను  ఇటీవల యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ , డైరెక్టర్‌గా  నియమించారు.
చదువుల తల్లి గా !


వారిజారాణి, ధర్మపురి లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో చదివారు.  బి.ఎ లో కాకతీయ యూనివర్సిటీ నుండి బంగారు పథకం సాధించారు.  ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు, మరియు సంస్కృత భాషల్లో ఎం.ఎ .పట్టాను ఉత్తమశ్రేణిలో సాధించారు.     కమ్యూనికేషన్, మరియు జర్నలిజంలో, తెలుగు యూనివర్సిటీ  నుండి M.C.J పట్టా పొందారు. సెంట్రల్ యూనివర్సిటీ  నుండి ప్రముఖ విమర్శకులు, సాహితీ మూర్తులైన ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య పర్యవేక్షణలో ఎం. ఫిల్, మరియు పి.హెచ్ డి,  పట్టాలను పొందారు.  పి.హెచ్ డి పట్టా, కొరకు తులనాత్మక అధ్యయనంలో  తెలుగు, సంస్కృత కావ్యాలలో ప్రక్రియా భేదంతో వచ్చిన ఒకే ఇతివృత్త కావ్యాలపై పరిశోధన చేసారు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించిన కంప్యూటర్ విద్యలో భాగంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా, ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ సాధించారు. యూజీసీ నిర్వహించే NET మరియు రాష్ట్ర సర్వీస్ కమీషన్, నిర్వహించిన SLET లలో ఉత్తీర్ణులయ్యారు.   తెలుగుపండిట్ శిక్షణ, సంగీతంలో డిప్లొమా  అదనపు అర్హతలు.
భారత ప్రభుత్వ ఫెలోషిప్ !


ప్రొఫెసర్ డాక్టర్ వారిజారాణి , భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖచే దేశవ్యాప్తంగా  సాహిత్య, సంగీత, నాటక, వివిధ కళా రంగాలకు చెందిన   వంద మంది ప్రతిభావంతులైన యువతీ యువకుల ప్రోత్సాహంలో భాగంగా ఇచ్చే రెండు సంవత్సరాల స్కాలర్ షిప్, 2005 సంవత్సరంలో ఎంపిక అయ్యారు. దానిలో భాగంగా ” ప్రాచీన తెలుగు కవుల విమర్శ దృక్పథాల”  మీద పరిశోధన చేసారు. వారిజారాణి UGC వారి  “మైనర్ రీసెర్చి ప్రాజెక్టు” కు ఎంపిక కాబడ్డారు. దానికై “మహాభారతం- స్త్రీవాద దృక్కోణ అధ్యయనం” అనే అంశంపై పరిశోధన చేసారు.
అంతర్జాతీయ స్థాయిలో..


ప్రొఫెసర్ డాక్టర్ వారిజారాణి, అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. దాదాపు 40 పత్ర సమర్పణలు చేసారు.  దాదాపు ముప్ఫైకి పైగా పరిశోధనా ప్రచురణలు గావించారు. వీరు తెలుగులోనే కాక  “Impact of Globalization on Indian Polity, Telugu Language and Literature” ,  “ The Feministic Approach of Gurajada Kanyashulkam”  మరియు “ The Contribution of Hyderabad Sansthan (Province) Literature in the development of Hyderabad Culture”   ఇంగ్లీషులో పరిశోధనా ప్రచురణలు చేసారు.  ప్రభుత్వ RUSA ప్రాజెక్టులు “తెలంగాణలో ఎరుకల భాష”  మరియు   “బంజారా లిపి” పై పరిశోధకులుగా పని చేసారు.
అమెరికా దేశంలో..


ప్రొఫెసర్ వారిజారాణి, వివిధ కళాశాలల్లో, విశ్వ విద్యాలయల్లో విస్తృతోపన్యాసాలు చేసారు. అమెరికా లాంటి దేశంలోని  విశ్వవిద్యాలయాల్లో  “గెస్ట్ ఫాకల్టీ” గా బోధిస్తున్నారు. వివిధ సాహిత్య సభల్లో, విశేష అతిథులుగా, అధ్యక్షులుగా వ్యవహరించారు. వివిధ యూనివర్సిటీలలో , కళాశాలల పాఠ్య ప్రణాళిక సభ్యులుగా ఉన్నారు. వీరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ప్రభుత్వ ఓపెన్ స్కూల్ ,సొసైటీల దూర విద్యకై, పాఠ్య రచనలు చేసారు. డాక్టర్  వారిజ రాణి, రచించిన పుస్తకం  “ప్రాచీన తెలుగు కవుల విమర్శ దృక్పథాలు”  ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ముద్రింపబడింది. ఇతర నాలుగు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.  వివిధ యూనివర్సిటీలలో పరీక్షకులుగా  వ్యవహరించారు.
సెన్సార్ బోర్డు సభ్యురాలిగా…
డాక్టర్, వారిజారాణి, భారత ప్రభుత్వ సమాచార శాఖ వారిచే  ప్రాంతీయ “సెన్సార్ బోర్డు”  సభ్యులుగా నియుక్తులై  రెండు సంవత్సరాలు సేవలందించారు. ఆకాశవాణిలో ప్రసంగాలు చేసారు.  టెలివిజన్ కార్యక్రమాల్లో ప్రసంగించారు,  న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
24 మంది పరిశోధక విద్యార్థులు!
ప్రొఫెసర్ డా! వారిజారాణి  వద్ద 24 మంది విద్యార్థులు పరిశోధన చేస్తున్నారు. వారిలో ఆరుగురు పి హెచ్ డి పట్టా పొందారు.  ప్రస్తుతం 18 మంది పి హెచ్ డి పట్టాకై పరిశోధన చేస్తున్నారు. .వీరు ఉస్మానియా యూనివర్సిటీలోని,  వివిధ పరిపాలన, పరిశోధన, సాంస్కృతిక,  కమిటీల్లో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాదులోని  కోఠీలోని మహిళా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.