(J. Surender Kumar)
నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో పోస్టుమార్టం సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఆదివారం ప్రగతిభవన్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, సీఎం కేసీఆర్ ను కలిసి 30 పడకల సామాజిక ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ పరిధిలోకి చేర్చాలని చేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి ఈశ్వర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

వైద్య విధాన పరిషత్ పరిధిలోకి ఈ ఆసుపత్రికి రావడంతో జగిత్యాల వైద్య కళాశాల నుంచి 9 మంది ప్రత్యేక వైద్య నిపుణులను డిప్యూటేషన్ పై కేటాయించారు. ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ , పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ మానస , చర్మ వైద్య నిపుణుడు డాక్టర్ సుమన్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఝాన్సీ, చెస్ట్ వైద్య నిపుణులు డాక్టర్ రాజ్ కుమార్, జనరల్ సర్జన్ డాక్టర్ హరి కిరణ్, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్, ఆస్పత్రిలో సాధారణ విధులు నిర్వహించడానికి డాక్టర్ శిరీష బేగం ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

తీరిన గ్రామీణ బాధితుల కష్టాలు!
ధర్మపురి, బుగ్గారం, బీర్పూర్ ,సారంగాపూర్ మండలాల గ్రామీణ ప్రాంతాలలో ప్రమాదాలలో గాని ,అనుమానాస్పద మరణాలు, ఆర్థిక ఇబ్బందులతో కానీ ,తదితర సమస్యలతో ఆత్మహత్యలకుపాల్పడిన, వారి కుటుంబ సభ్యులు వారి శవ పరీక్షల (పోస్టుమార్టం) పడిన కష్టాలు వర్ణనాతీతం. గతంలో మృతుల కుటుంబాలు ఆర్థికంగా, శారీరికంగా, మానసికంగా ,అనేక కష్టాలు పడ్డారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి శవం తరలించడానికి వాహనం అద్దే కనీసం.₹ 5000/- నుంచి.₹ 10,000/- చెల్లించక తప్పేది కాదు. జగిత్యాల ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం బంధుమిత్రుల శవ జాగారం, తదితర అనేక కష్టాలు అనుభవించేవారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవ చూపించి, స్వయంగా కేసీఆర్ కు పరిస్థితి వివరించి, ధర్మపురి ఆసుపత్రిని, వైద్య విధాన పరిషత్ లో చేర్చడంతో. ఈ ఆస్పత్రిలో పోస్టుమార్టం సేవలు నిర్వహించే హోదా నిబంధన మేరకు కలిగింది. పోస్టుమార్టం సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష , పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు రాజకీయాలకతీతంగా మంత్రి ఈశ్వర్ చర్యలను అభినందిస్తున్నారు.