రైతుబంధు పేరిట రాయితీలకు కోత..

ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి


( Surender Kumar)
తెలంగాణ ప్రభుత్వం రాయితీలకు కోత పెట్టి రైతుబంధు ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.


సారంగాపూర్ మండల కేంద్రంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి సీఎం కేసీఆర్ కొత్త పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని అన్నారు. 2014 తో పోల్చుకుంటే ఎరువుల ధరలన్నీ రెట్టింపు అయ్యాయని దీంతో పెట్టుబడి వ్యయం పెరిగి రైతులకు గిట్టుబాటు కావడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కనీస మద్దతు ధర కల్పించామని, నేడు టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు మద్దతు ధర లభించడం లేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆపద్బంధు పథకం కింద రూ. 50,000 అందించే వారని, టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ పథకం ఎందుకు నిలిపివేసిందో సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కోటికి పైగా రైతులు ఉంటే కేవలం 35 లక్షల మందికి మాత్రమే రైతు బీమా కల్పిస్తున్నారని, భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు జీవించే హక్కు లేదని ఈ ప్రభుత్వం భావిస్తుందా.. అని నిలదీశారు., వడ్డీ రాయితీ, పంట రుణ రాయితి, విత్తన రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ, హమాలీ చార్జీలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని దీంతో రైతులపై భారం పడుతుందని అన్నారు. సంక్షేమ పథకాలను నిరుపేద లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలి., రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల వర్తింపులో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న నిరుపేద లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. సారంగపూర్ మండలం గణేష్ పల్లికి చెందిన గుండుగుల రాజేష్ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు. .జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్, ఇంటి తో పాటు ఒక లక్ష రూపాయల నగదు అందజేసి ఆదుకోవాలని అన్నారు. సమావేశంలో రామచంద్రం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.