ధర్మపురి నరసింహుడి ఆదాయం…!
( J. Surender Kumar )
రాష్ట్ర సాధన ఉద్యమంలో, కీలక భూమిక పోషించిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదాయం, కొంతమంది అధికారులకు ప్రసాదమై, అందినంత ఆరగిస్తున్నారు అని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ రికార్డులలో నమోదైన ఆదాయ, ఖర్చుల వివరాలు పరిశీలిస్తే భక్తులు చేస్తున్న ఆరోపణలు, అక్షర సత్యాలుగా అగుపిస్తున్నట్లు సమాచారం.
కెసిఆర్ ఉద్యమ ప్రస్థానం ఈ క్షేత్రం నుంచే….

టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ 2003 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు రాజమండ్రిలోనే కాదు, తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి, బాసర, కోటిలింగాల, కాళేశ్వరంలో జరుగుతాయని, ఈ క్షేత్రాల పట్ల వివక్షత ఎందుకు? అంటూ నాటి ప్రభుత్వంను తూర్పారపట్టారు. ఇదే సందర్భంలో లక్షలాది రూపాయలతో ధర్మపురి క్షేత్రంలో పుష్కర యాగం చేసి సంచలనం సృష్టించారు. రానున్న గోదావరి పుష్కరాలు తెలంగాణ స్వరాష్ట్రంలో జరుపుకుంటామని, . ఈ క్షేత్రానికి.కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తానని, నేను ఇక్కడే పుష్కర స్నానం చేస్తానంటూ, నాడు కెసిఆర్ ప్రకటన చేశారు. 2015 గోదావరి పుష్కరాల్లో ధర్మపురి క్షేత్రానికి కోట్లాది రూపాయలు కేటాయించి, సీఎం కేసీఆర్ ధర్మపురిలో పుష్కర స్నానం చేశారు. అందుకే రాష్ట్ర సాధన ఉద్యమంలో ధర్మపురి క్షేత్రం కీలక భూమిక పోషించిందనే విషయం చెప్పాల్సి వచ్చింది. ఇంతటి ప్రసిద్ధమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొందరు ఉద్యోగులు అందినంతగా నిధులను మాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి,. క్యాష్ బుక్ లో నమోదైన ఆదాయ వివరాల అవకతవకలను, ప్రభుత్వమే గుర్తించి ఉద్యోగులను ప్రశ్నించినట్లు సమాచారం, వివరాలు ఇలా ఉన్నాయి.
హుండీ ఆదాయంలో ₹ 9000/- మాయం ?
హుండీ ద్వారా వచ్చిన ఆదాయంలో వేలాది రూపాయలు గోల్ మాల్ అయినట్టు సమాచారం. రికార్డుల లో నమోదైన వివరాల ప్రకారం ₹ 9000/- తగ్గించి నమోదు చేసినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు. 2020 సంవత్సరం, జనవరి 29న హుండీనీ అధికారులు, పోలీసులు , స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ధర్మకర్తల, పర్యవేక్షణలో లెక్కించినట్టు సమాచారం. లెక్కింపులో ₹ 30,01,229/- వచ్చినట్టు హుండీ లెక్కింపు సమయంలో తాత్కాలిక ఆదాయ నమోదు పుస్తకంలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే శాశ్వత హుండీ ఆదాయ రాబడి నగదు నమోదు ( C.B ) పుస్తకంలో మాత్రం ₹ 29,92,229/- నమోదు చేసినట్టు సమాచారం. మాయం అయిన ₹ 9000/- రూపాయల కు బాధ్యులు ఎవరో ? శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికే తెలియాలి.

మరో ₹ 6000/- రూపాయలు మాయం ?
నిత్యం ఆలయముకు టికెట్లు, ప్రసాదాలు, భక్తుల విరాళాలాల ద్వారా వచ్చే నగదు మొత్తంను అధికారులు, సిబ్బంది, డైలీ కలెక్షన్ రిజిస్టర్ ( D.C.R ) లో నమోదు చేస్తారు.. ఇలా నమోదు చేసిన మొత్తంలో ₹ 6000/- రూపాయలను ఆలయ నగదు ( D.C ) పుస్తకంలో తగ్గించి నమోదు చేసినట్టు సమాచారం. 2019 సంవత్సరం, నవంబర్ 30 న D.C.R లో ₹ 1,24,458/- వసూలు అయినా మొత్తంను పుస్తకంలో నమోదు చేసినట్టు సమాచారం. ఆలయ శాశ్వత నగదు ( C. B ) పుస్తకంలో మాత్రం ₹ 1,18,458/- జమ చేసినట్టు సమాచారం. మిగతా ₹ 6000/- ఎవరు మాయం చేశారో ? లేక. డబ్బులు స్వామివారి ప్రసాదంగా స్వీకరించారో ? స్థానిక దేవుడికే తెలియాలి.
ఇది ఇలా ఉండగా నిధుల మాయంపై ఆలయ అధికారులను ప్రభుత్వం వివరణ కోరుతూ బాధ్యుల నుండి అట్టి రూపాయలు వసూలు చేసి దేవస్థానం ఖాతాలో జమ చేయవలసిందిగా ఆదేశించినట్లు సమాచారం.. బాధ్యుల నుండి మాయం అయిన.రూపాయలు వసూలు చేసి ఆలయ బ్యాంకు ఖాతాకు జమ చేశారో ? లేదో ?.సమాచారం లేదు.. ఇంచార్జ్ కార్య నిర్వహణ అధికారుల హయాంలోని హుండీలో డైలీ కలెక్షన్లుకు సంబంధించి వేలాది రూపాయలు మాయమైనట్టు సమాచారం. ఇట్టి రూపాయలను స్వామి వారి ప్రసాదంగా ఆలయ ఉద్యోగులో, అధికారులో . స్వాహా చేశారో ? లేదో ? అంతు అంతుచిక్కని మిస్టరీగా మారింది.