హైకోర్టులో ఉందని అధికారుల అలసత్వం!
ధరణిలో ఫిర్యాదుదారుల పేర్లే, రైతుబంధు వారిదే !
సుప్రీంకోర్టు తీర్పు ఈ భూమికి వర్తించదా?
(J. Surender Kumar)
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి చెందిన లక్షలాది రూపాయల విలువ గల ఏడెకరాల భూమి ఎవరి పరం కానున్నదో ? అంతు పట్టడం లేదు. భూ వివాదం హైకోర్టులో ఉందంటూ అధికారులు అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయానికి, ప్రత్యర్థులకు భూవివాదం న్యాయ పరిధిలో ఉన్నట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ధరణిలో పట్టేదారులుగా వారి పేర్లు, పహానిలో వారి పేర్లతో పాటు, వేలాది రూపాయల రైతుబంధు నిధులు వాళ్ళ ఖాతాలో సంవత్సరాలుగా జమవుతున్నట్టు సమాచారం. వివాదాల్లో ఉన్న భూములు రెవెన్యూ నిబంధనల మేరకు ‘పార్ట్ బీ’ లో చేర్చాలి. ఆలయ భూముల అంశంలో గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ధర్మపురి ఆలయ భూమికి వర్తిస్తుందో ? లేదో? న్యాయ నిపుణులే వివరించాల్సిన అవసరం ఏర్పడింది.
వివరాలలోకి వెళితే.
స్థానిక శ్రీ లక్ష్మీనరసింహస్వామికి బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో, సర్వేనెంబర్ 293, లో 7.09 ఎకరాలు. ( ఏడు ఎకరాల తొమ్మిది గుంటలు) భూమిని 1982 లో గూడూరి సదాశివరావు అనే దాత , ధర్మపురి ఆలయానికి దానం చేశారు.

2008 లో ఈ భూమిని రెవెన్యూ అధికారులు హద్దులు గుర్తించి, ఆలయ అధికారులకు అప్పగించి, బోర్డును పాతారు. ఈ భూమి తనదే అని గోపులాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. I.A.No. 270/2007 in O.S.No. 65/2007 వివాదం నడుస్తున్నది. O.A No.141/2008 ద్వారా హైదరాబాద్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ లో కొనసాగుతున్నది.
పిటిషనర్లు హైకోర్టులో W .P .No. 25174/2010,
W. P..M. P No. 32169/2010 ద్వారా ప్రొసీడింగ్ నిలుపుదలకు స్టే ఉత్తర్వులు పొందారు.
రైతుబంధు వారికె. ధరణిలో వారి పేర్లే !

ప్రభుత్వ ధరణి వెబ్సైట్లో సర్వేనెంబర్ 293/1 . ఖాతా నెంబర్ 338లో 3.2450/- (భూవిస్తీర్ణం). సర్వేనెంబర్ 293/2 . ఖాతా నెంబర్ 20206 లో.3.2450 (భూ విస్తీర్ణం) ఇద్దరి పేరున నమోదు కావడంతోపాటు, వారికి పాసుబుక్కులు జారీ అయినట్టు రెవెన్యూ రికార్డులలో ఉంది. దీనికి తోడు సీఎం కేసీఆర్ ఇస్తున్న వేలాది రూపాయల రైతుబంధు నిధులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా వీరి ఖాతాలో జమ అవుతున్నట్టు సమాచారం. వివాదాల లో ఉన్న భూములను పార్ట్ బీలో చేరుస్తారు. భూమికి సంబంధించిన విషయంలో ఆలయ అధికారులు అలసత్వం వహిస్తున్నారా ? లేక ఏదో మొక్కుబడిగా తమ ఉనికిని చాటుకుంటున్నారా ? అనే చర్చ భక్తజనంలో నెలకొంది.
సుప్రీంకోర్టు తీర్పుతో…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఆలయానికి సంబంధించిన భూమి, రెవెన్యూ రికార్డులలో ఆలయ పూజారి తన పేరును, నమోదు చేసుకున్నాడు. ఈ అంశంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది, న్యాయస్థానం, కలెక్టర్ కోర్టు, పూజారి కి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ అంశంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం, సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 2021
నెల 6న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హేమంత్ గుప్త, ఏ. ఎస్ బొప్పన్న, లు ” దేవాలయాల భూములకు, దేవుడే యజమాని , రెవెన్యూ రికార్డుల లో పట్టే దార్ కాలంలో, దేవుడి పేరు మాత్రమే ఉంటుందని. పూజారులు, కౌలు రైతులు, లీజ్ దారులు, పర్యవేక్షకులకు, దేవుడి భూములపై ఎలాంటి హక్కు, అధికారం, ఉండదని, రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు నమోదు చేయవద్దంటూ చారిత్రాత్మక తీర్పునిచ్చారు. దేవాలయాల భూములకు దేవుడే సుప్రీం పూజారులు, కౌలుదారులు, కాస్తు దారులకు ఎలాంటి హక్కు, అధికారం, లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
2021 సెప్టెంబర్ మాసంలో మంత్రి ప్రత్యేక సమావేశం!
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , తమ శాఖ అధికారులతో 2021 సెప్టెంబర్ మాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆలయాలకు సంబంధించిన భూముల వివరాలు, సర్వే నెంబర్ల వారీగా, నిషేధిత జాబితాలో చేర్చాలి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లేఖలు రాయాలని ,ఇతరుల ఆక్రమణలో ఉన్న భూములను, వివాదాల్లో ఉన్న భూములను, న్యాయపరంగా, స్వాధీనం చేసుకోవాలని మంత్రి ఆదేశించినట్లు సమాచారం. రెవెన్యూ , దేవాదాయ శాఖ అధికారులతో, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి , ఇతరుల ఆక్రమణలో, అక్రమంగా పట్టాలు చేయించుకున్న, వారి నుండి భూములను స్వాధీనపరచుకొనుటకు కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. కానీ నేటికీ ధర్మపురి స్వామివారికి చెందిన భూమి దుస్థితి యధావిధిగా ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో నైనా దేవుడి భూములు దేవుడికి చెందుతాయో? లేదో ?వేచి చూడాల్సిందే.