ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల దాడులు !
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భయం.. భయం!
( J. Surender Kumar)
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ పట్టణ సమీపంలో గురువారం రాత్రి దాదాపు 10 గంటల సమయంలో వాహనదారులు, ప్రయాణికులు పెద్దపులి రోడ్డు దాటుతుండగా చూసినట్టు కలకలం మొదలైంది.
కాగజ్ నగర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ( రాజు నగర్) వద్ద స్పీడ్ బ్రేకర్ గల ప్రాంతంలో పెద్దపులి రోడ్డు దాటుతున్న దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు భయాందోళనల చెందారు. .సమాచారం తెలిసిన పోలీసులు, అటవీశాఖ సిబ్బంది , చెక్ పోస్ట్ వద్దకు వచ్చి పెద్దపులి కదలికలను ప్రయాణికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పులి అడుగులను తనిఖీ చేశారు.. ఇదే సమాచారాన్ని సోషల్ మీడియాలో కాగజ్నగర్ పట్టణ వాసులు వివరిస్తూ పట్టణ ప్రజలను అప్రమత్తం చేశారు.

‘ పెద్దపులి సంచారమును కొందరు చూశారని, పట్టణంలోని వినాయక్ గార్డెన్ వెనుక వైపు నుంచి పులి నడుస్తూ పోతున్న దృశ్యాన్ని వారు చూశారని, బాలాజీ నగర్ వాసులు, మరియు 14వ వార్డు కు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో ప్రజలను జాగ్రత్తగా ఉండమని అందులో కోరారు.

పెద్దపులి సంచారం వాస్తవమేనని, కాగజ్నగర్ పట్టణ శివారు ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని , సాధ్యమైనంతవరకు బయటకు రాకుండా ఉండాలని, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శివకుమార్ విజ్ఞప్తి చేసినట్టు సోషల్ మీడియాలో చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా వాంకిడి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన గిరిజన రైతు సీడం భీమ్, గత రెండు రోజుల క్రితం పెద్దపులి దాడి చేసి హతమార్చి కొంత దూరం మృతదేహాన్ని లాక్కుని వెళ్లిన విషయం తెలిసిందే. భీంపూర్ మండలం గుంజాల గ్రామంలో ఆవుపై పులి దాడి , ఇదే మండలం పిప్పరికోటి గ్రామ అటవీ ప్రాంతంలో పిట్ల నవీన్ కు చెందిన ఆవును పులి దాడి చేసి చంపింది. వరుస సంఘటనలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతం. గ్రామాలతో పాటు కాగజ్నగర్ పట్టణ ప్రజలు భయం భయంగా తమ నిత్య దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు.