తెరాస అధినేత, సీఎం కేసీఆర్
( J. Surender Kumar )
తెలంగాణ భవన్‌లో జరిగిన తెరాస విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.
కవితను పార్టీలో చేరాలని భాజపా ఒత్తిడి చేసింది..
సర్వేలన్నీ తెరాసకే అనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వందశాతం అధికారం మళ్లీ తెరాసదే అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భాజపా చాలా నీచంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఎమ్మెల్సీ కవితను కూడా పార్టీలో చేరాలని భాజపా ఒత్తిడి చేసిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు ప్రలోభాలు వెలుగు చూసినందున.. ప్రజాప్రతినిధులకు గులాబీ దళపతి కీలక సూచనలు చేశారు. సిట్టింగ్లకు మళ్లీ అవకాశమిస్తామని.. గతంలోనే పలు సందర్భాల్లో చెప్పిన పార్టీ అధినేత మరోసారి వారికి భరోసా ఇచ్చారు.
ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మన దగ్గర కూడా ప్రయత్నించి అడ్డంగా దొరికారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చట్టం తనపని తాను చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లబ్ధిదారుల పూర్తి సమాచారం ఎమ్మెల్యేల వద్ద ఉండాలి. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకం కావాలి. ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. తెరాస కార్యకర్తల బలంతో ఓటర్లందరినీ చేరుకోవాలి. సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతగా దాడి చేస్తోంటే ఊరుకుందామా ?… పోరాడదామా?’- అంటూ దశ దిశ నిర్దేశించినట్టు చర్చ.