నాయకులకు ట్రెండింగ్ పార్టీలు కావాలే !

నివురుగప్పిన నిప్పులా .
మునుగోడు ఫలితాలే ముహూర్తం.?

( J.Surender Kumar )


పార్టీలకు గెలుపు గుర్రాలు కావాలె ! తాము గెలుపు గుర్రాలు కావాలంటే, నాయకులకు ట్రెండిగ్ పార్టీలు కావాలె ! .ఎన్నికల పర్వం కొనసాగినంత సేపు ఈ ప్రిన్సిపుల్ ఫర్ ఎవర్ ! నివురు గప్పిన నిప్పులా నియోజకవర్గాలు, మునుగోడు ఫలితాలే ముహూర్తంగా ఎంచుకున్నట్టు చర్చ !


లీడర్లుండీ, క్యాడర్ చేజారిపోయే పార్టీలు కొన్నైతే… క్యాడర్ ఉండి, సరైన లీడర్ లేక తమ పట్టు నిల్పుకోలేకపోయే పార్టీలు మరికొన్ని ! ఇలాంటి పరిస్థితుల్లో లీడర్స్ కూ.. క్యాడర్ కూ మధ్య సరైన సమయోజనీయ బంధమేర్పడితేనే ఆ లీడరైనా, ఆ పార్టీ అయినా, మనుగడ సాధించేది ! అప్పుడే ఆ క్యాడరూ బలంగా పనిచేయగల్గేది !
సమైక్యాంధ్రప్రదేశ్ వంటివి చెప్పుకోవడానికి బాగుంటాయే తప్ప, ప్రాంతీయ అసమానతలు, మాత్రం అలాగే ఉంటున్నాయని, ఆ వివక్ష దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉందని చెప్పి, తెలంగాణా ప్రాంత అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా కేసీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్.. ఉన్నపళంగా కేంద్రంలో ఉన్న బీజేపి పై యుద్ధాన్ని ప్రకటిస్తూ మరింత విశాలమైన బీఆర్ఎస్ ను ప్రకటించడంతో, ఆ పార్టీ శ్రేణుల్లోనే ఒక రకమైన అనుమానంతో కూడిన ఒకింత ఆందోళనకు తెరలేచింది. ఇదే సమయంలో మునుగోడు ఉపఎన్నిక రావడంతో… మునుగోడులో పోటీ చేయబోయేది టీఆర్ఎస్సా..? లేక, కొత్తగా ప్రకటించిన బీఆర్ఎస్సా.. ? అనే సందిగ్ధానికీ కారణమైంది. అయితే మునుగోడు వరకూ టీఆర్ఎస్ గానే పోటీలో ఉంటామని అధికారపార్టీ నాయకులు చెప్పి.. ఆ అస్పష్టతను కాస్తా స్పష్టంగా మార్చేశారు. ఇదే సమయంలో ఇంకోవైపు పార్టీ ఫిరాయింపుల వ్యవహారాలు, ఎమ్మెల్యేల కొనుగోళ్ల వంటివి తెరపైకి రావడం… అధికారపార్టీలో ఉద్యమకాలం నుంచి పనిచేస్తూ, కనీస పదవులు లభించకపోవడం..

ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్థానికంగా ఏర్పడే గ్రూప్ తగాదాలు వెరసి… ప్రస్తుత కాలమంతా జంప్ జిలానీల కాలంగా మారిపోయింది.
ఎందుకు ఒక పార్టీ గుర్తుపై ఎన్నికైన ప్రజాప్రతినిధి… ఇతర పార్టీల వైపు చూడాల్సి వస్తోందన్నదే, ఇప్పుడు హాట్ టాపిక్. అల్టిమేట్ గా అధికారంతో, వచ్చే హోదా, బాగా బతికేందుకు కావల్సిన ధనం,
తాను లీడ్ చేస్తున్న చోట తనకు ఎవరు అడ్డు రాకుండా ఉండటమన్నవి ప్రాథమికంగా ఏ సీనియర్ నాయకుడైనా కోరుకునేవి. అయితే నాయకులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ, తామున్న పార్టీలో సరైన గుర్తింపును, లేదా మినిమం ఐడెంటిటీనీ, పొందలేక పోతున్నామనుకున్నప్పుడు… తాను అనుకున్న పదవులు రానప్పుడు, చిన్నా చితకా కాంట్రాక్టులతో సంపాదించుకోలేనప్పుడో, కనీసం తన కింద ఉన్న క్యాడర్ కు చిన్న చిన్న పదవులు ఇప్పించుకోలేనప్పుడో, అధికార పార్టీలో ఉన్నా తమ మాట క్యాడర్ వినలేనప్పుడో… మొత్తంగా ఇలాంటి పలు కారణాలు నేతలను ఇతర పార్టీల వైపు చూపులకు ఉసిగొల్పుతున్నాయన్నది బహిరంగ రహస్యం !
ఈ క్రమంలోనే ఈ మధ్య ఆపరేషన్ ఆకర్ష్, వంటి కార్యక్రమాల రచ్చ, ఎమ్మెల్యేల కొనుగోళ్ల వంటి హంగామా, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల మధ్య మాటల యుద్ధం. కోర్టుల్లో వాదోపవాదాలనూ చూస్తూనే ఉన్నాం. అవి ప్రీ ప్లాన్డ్ వ్యూహాలే కావచ్చు, లేక, నిజంగానే ఎమ్మెల్యేలు పక్కచూపులు చూసి దొరికిపోతామేమోనన్న భయంతో మళ్లీ బేరం నడిపిన పార్టీలపైనే, ఎదురుదాడి చేసి తామున్న పార్టీలో ఇంతకాలం పొందని గుర్తింపును, ఇప్పుడైనా దక్కించుకునే అవకాశంగా భావించవచ్చు..? ఏదేమైనా చాలాకాలంగా కప్పల తక్కెడలా తయారైన రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయా.? లేక ప్రజలదేముంది షార్ట్ టర్మ్ మెమరీ, రేపు ఇంకో విషయమేదైనా వస్తే దీన్ని మర్చిపోతారనుకుంటారో తెలీదుగానీ, తాము ఆడే రాజకీయ క్రీడలో ఓటు వేసే వరకు మాత్రమే, ప్రజలను ప్రధానపార్టీలు అన్ని పాత్రధారులుగా చూస్తున్నాయే తప్ప, వారి మనోభావాలను పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు, రాబోయే కాలంలో అలాంటి పరిస్థితులుంటాయన్న నమ్మకమూ, ప్రస్తుతానికైతే కల్గడమూ లేదు.
ప్రస్తుత హాట్, హాట్ రాజకీయాలతో ముప్పావు నియోజకవర్గాల్లో లీడర్లు, కేడర్ మధ్య రాజకీయ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నది ఓ అంచనా ! అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత, జంప్ జిలానీల సంఖ్య పెరిగే అవకాశాలూ ఉన్నాయన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మనం ముందుగా చెప్పుకున్నట్టే పదవులు, డబ్బూ, హోదా, వంటివే ఈ పార్టీల ఫిరాయింపులకు ప్రధాన కారణం కాబోతోందన్నది, పునశ్చరణ అక్కర్లేనిది. దుబ్బాక, హుజురాబాద్, హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ఆయా పార్టీల్లోని అత్యధిక శాతం లీడర్లకు, క్యాడర్ కు మధ్య తలెత్తిన విభేదాలు, కనిపించిన గ్రూప్ తగాదాలు, అభద్రతాభావం వంటివి కూడా… రాబోయే రోజుల్లో పార్టీల్లో నేతల కప్పదాట్లకు కారణమయ్యే అవకాశాలు లేకపోలేదు. టీఆర్ఎస్ ను. బీ ఆర్ఎస్ గా ప్రకటించిన తర్వాత, ఆ పార్టీ క్యాడర్ లోనే ఊహించినంత ఉత్సాహం కనిపించకపోవడం ఈ అంచనాలకు మరో కారణం. 10 లక్షల మందికి ఆసరా పెన్షల ప్రకటన, గిరిజన రిజర్వేషన్ల ఉత్తర్వుల జారీ, ఉద్యోగ ప్రకటనలు, చేనేతపై జీఎస్టీకి నిరసనగా పార్టీ పక్షాన పోస్ట్ కార్డు ఉద్యమం, మునుగోడు ఉపఎన్నికలో గీత కార్మికులకు సబ్సిడీపై ద్విచక్ర వాహనాల (మోపెడులు) పంపిణీ, తెలంగాణ ఉద్యమకారులు తిరిగి పార్టీలో చేర్చుకున్న తదితర సందర్భాల్ కూడా… గతంలో లా పాలాభిషేకాలు, ఇతర సంబరాల వంటివి అంత ఉత్సాహంగా కనిపించకపోవడం.. గులాబీ అధిష్ఠానం గమనించనీ, గ్రహించనిదీ ఏమీ కాదు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ లీడర్ల, కదలికలను కేడర్, క్యాడర్ కదలికలను, లీడర్లు నిఘా పెట్టడంతో.. ఆ రెండింటి మధ్య నున్న సమన్వయ బంధంలోని విశ్వాసం ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ! మండల, గ్రామ స్థాయిల్లో అధికార పార్టీలో చేరికలు ఓవర్ లోడ్ కావడం.. వారి మధ్య రాజకీయ ఆదిపత్య పోరుకు తెరలేపుతోంది. ప్రత్యేకంగా బడుగు, బలహీన వర్గాల యువతకు చెందాల్సిన సబ్సిడీ రుణాల అంశం, దళిత బంధు పథకం, నామినేటెడ్ కాంట్రాక్ట్ పనులు, ఇసుక, మొరం తరలింపుతో పాటు.. పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, .అటవీ, .ల్యాండ్ సర్వే, పంచాయతీ, మున్సిపల్, కార్పోరేషన్లన్నింటిలో లీడర్ల మాటే చెల్లుబాటు కావడం.. .క్యాడర్ కు అనుకున్న స్థాయి విలువ దక్కకపోవడం.. అదీ ఓ వర్గం నాయకులకే పెద్దపీట వేయడం వంటివెన్నో నాయకుల్లో, .క్యాడర్లో అసంతృప్తికి ప్రధాన .కారణమవుతోంది. ముప్పావు నియోజకవర్గాలకు పైగానే… ఎమ్మెల్యేలకు ఆయా గ్రూపుల నాయకుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటమే ఇందుకు ఓ ఉదాహరణ!
దీనికి తోడు తమపర భేదాన్ని కూడా పక్కనబెట్టి తమ దారికి తెచ్చుకోవడానికో… లేక, తమ కక్షసాధింపు చర్యల్లో భాగంగానో… స్థానికంగా కొందరు మండల, గ్రామ స్థాయి నాయకులు తమ ప్రత్యర్థులపై పోలీస్ కేసులు పెట్టించడం, భూ వివాదాలు సృష్టించడం, ఇత్యాది అంశాలన్నీ ఆధిపత్యపోరుకు తెరతీయడంతో పాటు.. పార్టీల మార్పునకు కారణమవుతోంది. తమ పగ, ప్రతీకారాలు తీర్చుకోవడం కోసం… అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అగ్రనేతల అండదండలతో… అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా కట్టడాలు కూల్చేయడం, ఏళ్ల తరబడి సేద్యం చేసుకుంటున్నవారిని ఇబ్బందులకు గురిచేయడం, ధరణి అడ్డుపెట్టుకొని సర్వే నెంబర్లు మార్పులు చేయించడం, పట్టా భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేయించడం, పట్టాదారు పాస్ పుస్తకాల్లో భూ విస్తీర్ణం తగ్గించడం వంటివెన్నో స్థానికంగా జరుగుతుండగా… ఈ విషసంస్కృతే రానున్న రోజుల్లో ఆయా నేతల, రాజకీయ సమాధికీ కారణమయ్యే అవకాశాలూ లేకపోలేదన్నది మరో చర్చ!
ఉత్తర తెలంగాణ జిల్లాలో ఓ నాయకుడూ అధికార పార్టీని వీడనున్నారా..?


తాను మొదలుపెట్టనున్న వ్యాపార సంస్థకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కీలక ప్రజా ప్రతినిధిని గత 30 రోజుల్లో దాదాపు ఐదుసార్లు సంప్రదించినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో… మునుగోడు ఎన్నిక నేపథ్యంలో… తాజాగా కొనుగోళ్ల అంశం తెరపైకి రావడంతో.. సదరు అధికార పార్టీ కీలక నేత తాము కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో, ఇప్పటికిప్పుడు చర్చించడం కుదరదని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే ప్రగతి భవన్ , ఫామ్ హౌస్,లతో. సత్సంబంధాలు కలిగి ఉన్నాయనే ప్రచారంలో ఉన్న సదరు ఆ నాయకుడు, తన రాజకీయ భవిష్యత్తు కోసం నేరుగా కేంద్ర ప్రభుత్వంలోని కీలక నాయకుడితో పార్టీలో చేరిక అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆ నేత తన వ్యాపార ఆరంభం కోసం మాత్రమే కేంద్ర పెద్దలను కలుస్తున్నారా…? లేక తానున్న పార్టీ కి అంతర్గతంగా వీస్తున్న వ్యతిరేక పవనాలా ? అసంతృప్తవాదై.. తన రాజకీయ భవితవ్యం కోసమా ? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్…?!!