దిన దిన గండం నూరేళ్ల ఆయుషు.. భయం భయంగా నిర్భయలు.!

నిర్భయ సంఘటనకు పది సంవత్సరాలు !


స్త్రీని దేవతగా పూజించే మన దేశంలో రోజురోజుకూ మహిళలపై  వేధింపులు పెరుగుతున్నాయి. మహిళల సంరక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ వారిపై నిత్యం ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై దాడుల్లో కొన్ని వెలుగులోకి కూడా రాడం లేదు. మరికొన్ని కేసుల్లో నేరస్థులకు సరైన శిక్ష పడటం లేదు. కొన్ని సంఘటనలు తీవ్ర సంచలనాన్ని రేపాయి.ఇందులో 10ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన బాధితురాలి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని  నింపింది.


2012, డిసెంబర్ 17వ తేదీ యావత్ భారతావని ఒక్కసారిగా ఉలిక్కపడేలా చేసింది నిర్భయ ఘటన. పారామెడికల్‌ స్టూడెంట్ అయిన నిర్భయ 16వ తేదీ అర్ధరాత్రి తన స్నేహితుడితో కలిసి ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. అందులో ఉన్న ఆరుగురు కామాంధులు స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సు ఢిల్లీ వీధుల్లో తిప్పుడూ ఒకరి తర్వాత ఒకరు ఆ అమాయకురాలిపై పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడారు.


దేశ రాజధానిలో జరిగిన ఈ ఘోర ఘటన ప్రతి భారతీయుడిని కదిలించింది. దేశ నలుమూలలా ఆందోళనలు ర్యాలీలు ఒక ఎత్తయితే ఢిల్లీ వేదికగా సాగిన పోరాటం మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించింది. ఈ ఉద్యమానికి యువతే మార్గనిర్దేశం చేసింది. అనేక యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వేల సంఖ్యలో వచ్చిన యువతీ యువకులు ఇండియాగేట్‌పై దండెత్తారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించిన ఘటన ఇదే. నిర్భయ నిరసనల ముందు తలొంచిన నాటి యూపీఏ ప్రభుత్వం నిర్భయ పేరుతో చట్టాన్ని తీసుకొచ్చింది.
నిర్భయచట్టం ది క్రిమినల్‌ లా (ఎమెండ్‌మెంట్‌) యాక్ట్‌, 2013 (నేర శిక్షాస్మృతి – సవరణ చట్టం – 2013) ప్రజాఉద్యమం ద్వారా, ముఖ్యంగా మహిళల తీవ్రమైన, ఆందోళనల కారణంగా అమలులోకి వచ్చింది. గ్రంథంలో చర్చించిన విధంగా ఇందులో చాలా ముఖ్యమైన నిబంధనలను సవరించటం – అంతకు ముందు ఉన్న చట్టాల స్ధానంలో కొత్తవి ప్రవేశపెట్టడం, నిందితులకు కఠినమైన శిక్షలు, బాధితులకు కొంత ఉపశమనం కలిగేలా విధానాలను రూపొందించారు.


ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ అనేకమంది నిర్భయలు ఇంకా రకరకాల భయాలతోనే కాలం గడుపుతున్నారు. హైదరాబాద్ లో జరిగిన దిశ సంఘటనలో  నిందితులని వెంటనే శిక్షించాలని పెద్ద ఎత్తున ప్రజల నుండి డిమాండ్ వచ్చింది. అందుకు అనుగుణంగా పోలీసులు వారిపై చర్యలు తీసుకున్నారు.ప్రజలు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ఇవేవీ శాశ్వత పరిష్కార  మార్గాలు కావు. చట్టాలతో పాటు ప్రజలలో చైతన్యం పెంచితే కొంత వరకైనా మహిళలపై దాడులు తగ్గుతాయి.


వ్యాసకర్త : M. రామ్ ప్రదీప్, తిరువూరు 9492712836