గల్ఫ్ కంపెనీలు ఎగవేసిన జీతాలను ప్రభుత్వం ఇప్పించాలి!

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన !

రేవంత్ రెడ్డిని కలిసిన గల్ఫ్ తెలంగాణ ప్రతినిధులు!

(J.Surender Kumar)

వేతన దొంగతనం పై న్యాయం చేయాలి (జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్) అనే డిమాండ్ తో మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) సభ్య సంస్థలు, ప్రవాసీ కార్మికుల జాతీయ వేదిక పక్షాన వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మిక సంఘాల ప్రతినిధులు సోమవారం .ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. కార్యక్రమం అనంతరం తెలంగాణ కార్మిక ప్రతినిధులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల టిపిసిసి అధ్యక్షులు ఎ. రేవంత్ రెడ్డి ని కలిసి వినతిపత్రం సమర్పించారు. 


 కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన గల్ఫ్ దేశాల నుండి లక్షలాది మంది భారతీయ వలస కార్మికులు స్వదేశానికి పంపించబడ్డారు. గల్ఫ్ దేశాలలో  కంపెనీలు ఎగవేసిన జీతాలను రాబట్టుకోవడం కోసం న్యాయ పోరాటం చేయడానికి భారత ప్రభుత్వం కార్మికులకు ఉచిత న్యాయ సహాయం చేయాలని తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

కరోనా సమయంలో గల్ఫ్ నుండి హడావిడిగా వెళ్లగొట్టబడిన కార్మికులకు జీతం బకాయిలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) రాబట్టుకోవడం తాము పోరాటం చేస్తున్నామని  ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. 


ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన వైష్ణవి, స్టీఫెన్, మాణిక్, కేరళకు చెందిన సిఎస్  అఖిల్, బీమా బషీర్, రఫీక్ రవుతర్, ఢిల్లీకి చెందిన ధర్మేందర్ లు పాల్గొన్నారు. గత మూడు రోజులుగా వలస కార్మిక సంఘాల  ప్రతినిధులు వివిధ పార్టీల ఎంపీలను కలిసి వినతి పత్రాలను ఇచ్చారు. భారత ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి మంత్రులకు వినతి పత్రాలను పంపారు. 

డిమాండ్లు – సూచనలు

చెల్లించని వేతనాలు, ఇతర ప్రయోజనాలను తిరిగి పొందడానికి, ఫిర్యాదుల పరిష్కారాన్ని సమన్వయం చేయడానికి భారత ప్రభుత్వం ఒక సమన్వయ వేదిక ఏర్పాటు చేయాలి.  కార్మికుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను నిరోధించడంలో సహాయపడటానికి అంతర్జాతీయ వలసదారుల కోసం ఒక ప్రామాణిక కార్మిక ఒప్పందాన్ని (స్టాండర్డ్ లేబర్ కాంట్రాక్ట్) అభివృద్ధి చేయాలి. ఒప్పందంలోని నిబంధనలను వలసదారులకు తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలి. 
వేతన దొంగతనంపై ఫిర్యాదులు చేయడానికి ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఉన్నవారికి, గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన వారికి ఉపయోగపడే విధంగా విదేశాలలోని భారత దౌత్య కార్యాలయాల్లో, ఇండియాలోని ఎయిర్ పోర్టులలో ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ / 24-గంటల హాట్‌లైన్ బహుభాషా ఫిర్యాదుల వేదికలను ఏర్పాటుచేయాలి. 
ప్రభుత్వాలు, ఇతర వాటాదారుల వివిధ సేవలను వినియోగించుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ ఫారమ్‌లను ఉపయోగించడం గురించి వలసదారులకు అవగాహన కల్పించాలి.  
వేతన చౌర్యం సమస్యలను పరిష్కరించడానికి భారతదేశం-జిసిసి స్థాయిలో శాశ్వత పరివర్తన న్యాయ యంత్రాంగం (ట్రాన్సిషనల్ జస్టిస్ మెకానిజం) ఏర్పాటు చేయాలి. తగిన ఉద్యోగ ఒప్పంద పత్రాలు లేకున్నా వలస కార్మికులు ఫిర్యాదు దాఖలు చేయడానికి అనుమతించబడాలి. 


వలస కార్మికులకు జీతాలు చెల్లించడానికి యజమాని నిరాకరించిన సందర్భాల్లో సత్వర చెల్లింపు కోసం ‘పరిహార నిధి’ (కాంపెన్సేషన్ ఫండ్) ను ఏర్పాటు చేయాలి.  
కార్మికులు న్యాయం పొందే భారాన్ని ప్రభుత్వం తగ్గించాలి. తమ బకాయి వేతనాలు, ప్రయోజనాలను పొందని కార్మికుల కోసం ‘పవర్ ఆఫ్ అటార్నీ’ (కోర్టులో న్యాయ పోరాటం చేయడానికి అధికారిక ప్రతినిధిని నియమించుకోవడం) కోసం దౌత్య కార్యాలయాలు చొరవ చూపాలి.   
వలసదారుల వేతనాలు, ప్రయోజనాలను రక్షించడానికి భారత ప్రభుత్వం, గమ్యస్థాన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల చేసుకోవాలి.  ప్రయోజనాల పోర్టబిలిటీ (ఎక్కడైనా సులభంగా ఉపయోగించుకునేలా) ఉండేలా చూడాలి. వలస కార్మికుల సంక్షేమం, రక్షణ కోసం ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం సవరించి బలోపేతం చేయాలి.