ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసిన సిబిఐ!

హైదరాబాదులో కవిత ఇంటిలో…

(J. Surender Kumar)

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారుల ఎదుట ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  హైదరాబాదులోని తన నివాసంలో ఆమె వాంగ్మూలం ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్తలలో ఒకరైన అమిత్ అరోరా, ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించిన నేపథ్యంలో, వివరణ కోరుతూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 కింద కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.. సిబిఐ అధికారుల బృందం బంజారాహిల్స్‌లోని ఆమెనివాసానికి. ఉదయం 11 గంటలకు కాస్త ముందుగా 10.50 గంటలకు చేరుకున్నారు. మహిళ సహా అధికారులు ,కట్టుదిట్టమైన భద్రత మధ్య రెండు వాహనాల్లో వచ్చారు.  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి వారు ఆమెను ప్రశ్నించడం ప్రారంభించారు, సాయంత్రం 6.30 గంటల వరకు ఏడు గంటలకు పైగా విచారణ కొనసాగింది.

విచారణకు కవిత ఇంటికి చేరుకున్న సిబిఐ అధికారుల వాహనం

ఈ కేసులో సాక్షిగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. నోటీసులపై ఆమె ఇప్పటికే తన న్యాయ నిపుణులతో చర్చించి, తన వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని సీబీఐ అధికారులకు అందించినట్లు తెలిసింది.
పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆమె నివాసంలో అనవసరంగా గుమికూడొద్దని ఆదేశించడంతో సీబీఐ అధికారులు రాకముందే కవిత ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.  ప్రశ్నోత్తరాల నేపథ్యంలో పరిసరాల్లో భద్రతను పెంచారు. ఆమె నివాసానికి 100-120 మీటర్ల దూరంలో ఎవరూ గుమికూడకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అయితే మీడియా ప్రతినిధులతో పాటు బీఆర్‌ఎస్ నేతలు బారికేడ్ల వద్దకు చేరుకున్నారు. ఆమె నివాసానికి సమీపంలో ఎమ్మెల్యే మద్దతుదారులు హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.   “యోధుడి కూతురు ఎప్పటికీ భయపడదు. మేము కవితక్కతో ఉన్నాము”   అనే హోర్డింగ్‌లు వెలిశాయి.

విచారణ పిదప ప్రగతి భవన్ కు వెళుతున్న దృశ్యం

కవిత నివాసం నుంచి సీబీఐ అధికారులు బయలుదేరిన వెంటనే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలతో పాటు, పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆమె నివాసానికి చేరుకున్నారు.  అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్‌కు వెళ్లారు. ముందు కవిత పార్టీ కార్యకర్తలు, తన మద్దతుదారులకు అభివాదం చేశారు.. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ తో దాదాపు 45 నిమిషాలు చర్చించి తన నివాసానికి చేరుకున్నారు.