పాములాగా యువతి విన్యాసాలు!
( J. Surender Kumar)
ఓ యువతి పాములాగా వింత చేష్టలు చేస్తోంది. తనను నాగదేవత ఆవహించిందని, తనకు తక్షణమే గుడికట్టాలంటోంది. కూలిన ఆలయాన్ని మళ్లీ కట్టేవరకూ తాను నాగకన్యగానే ఉంటానంటోంది సదరు యువతి. ఆ యువతి అచ్చం పాములా ప్రవర్తిస్తూ.. రోజూ నాగదేవత గుడికి వెళ్లి పూజలు చేస్తోంది.
వివరాలు ఇలా ఉన్నాయి..
సైదాపూర్ మండలం ఎగ్లాస్‌పూర్‌కు చెందిన ఓ యువతీ యువతి డిగ్రీ వరకూ చదివింది. అనారోగ్యంతో తల్లిదండ్రులు చనిపోవడంతో.. నానమ్మ వద్ద ఉంటోంది. ఇదివరకు ఆమె ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేసింది. గత నాలుగేళ్లుగా కృష్ణవేణి తాను నాగకన్యను అంటూ వింతగా ప్రవర్తిస్తోంది. నిత్యం గ్రామానికి చుట్టుపక్కల ఉండే పాము పుట్టలు, నాగదేవత ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తోంది. చాలా ఏళ్ల క్రితమే తాను నాగకన్యగా మారానని గ్రామస్తులకు చెప్తోంది. తన కలలో పాములు కూడా కనిపిస్తున్నాయని యువతి వివరిస్తోంది.
తన శరీరంలో మార్పులు వస్తున్నాయని, శరీరంపై గీతలు ఏర్పడుతున్నాయని అందరికీ చెబుతోంది. అప్పుడప్పుడు నాగినిలా డాన్స్ కూడా చేస్తోంది. గ్రామ శివారులో ఉన్న నాగదేవత విగ్రహానికి, గుడి నిర్మించాలని, అప్పుడే తన శరీరంలో నుంచి నాగకన్య వెళ్లిపోతుందని చెబుతోంది. కృష్ణవేణి వింత చేష్టలకు చట్టుపక్కల వారు భయాందోళన చెందుతున్నారు. అయితే కొందరు స్థానికులు మానసిక పరిస్థితి సరిగా లేదని, అందుకే ఇలా ప్రవర్తిస్తుందని అంటున్నారు. యువతి ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.