దేశం కోసం అమరుడై…..
దేశ సోదరులారా… మీరు మొదట భారతీయులు. ఆ తర్వాతే వివిధ మతాల వారు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐకమత్యంతో ఆంగ్లేయులను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావాలి..” అని పిలుపునిచ్చిన అష్ఫాకుల్లా ఖాన్ ఒకరు.
దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారు అనగానే మనకు ముందుగా భగత్ సింగ్ గుర్తుకు వస్తారు.ఆయనతో పాటు ఆనాటి అనేకమంది యువకులు కుల మతాలకతీతంగా దేశం కోసం పోరాడి ప్రాణాలని అర్పించారు.
అష్ఫాకుల్లా ఖాన్ ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో అక్టోబర్ 22, 1900వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తండ్రి షఫీకుర్ రెహమాన్ పొలీసు శాఖలో పనిచేసేవారు. తల్లీ మజ్హరున్నీసా. అష్ఫాకుల్లా ఖాన్ స్వతహాగానే మంచి కవి. హిందీ, సంస్కృతం, ఉర్డూ, పారసీ భాషల్లో మంచి పట్టుంది. ఉన్నత కుటుంబంలో పుట్టినా పేదల బతుకుల గురించే ఆలోచించేవారు. దేశ విముక్తి కలలు కనేవారు. దానికోసం ప్రణాళిక బద్ధంగా నడిచారు.
అప్పటికే దేశ స్వతంత్రం కోసం సచీంద్రనాథ్ సన్యాల్, నరేంద్ర మోహన్ సేన్, ప్రతుల్ గంగూలి వంటి వ్యక్తులు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంఘాన్ని 1924 ఏర్పాటు చేశారు. ఆ సంఘంలో అష్ఫాఖుల్లా ఖాన్ చేరారు. దానిద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనల్లో పాల్గొనేవాడు. అయితే తమ ఉద్యమం నడవడానికి ఆర్థిక వనరులు లేకపోవడంతో రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ ఖజానాను దోచుకోవాలని ఆ సంఘం నిర్ణయించింది. కాకోరీ గ్రామం దగ్గర ప్రభుత్వ ఖజానాను తీసుకెళ్తున్న ప్యాసింజర్ రైలును దోచుకోవాలని పథకం రచించింది.
అనుకున్నట్టుగానే 1925, ఆగస్ట్ 9న అష్ఫాకుల్లా ఖాన్,మరికొందరు నాయకులు రైలు దోపిడీకి సిద్ధమయ్యారు. సంఘంలో కొందరు సభ్యులు సాధారణ ప్రయాణికుల్లా ఆ రైలు ఎక్కారు. పొదల్లో దాక్కున్న అష్ఫాకుల్లా ఖాన్ రైలు ఎక్కి తన దగ్గరున్న జర్మనీ మేడ్ పిస్టల్‌ను డ్రైవర్ తలకు గురిపెట్టి… ప్రభుత్వ ఖజానాలోని రూ.8వేలు దోచుకుని పరారయ్యారు. ఈ ఘటన చరిత్రలో కాకోరి రైలు దోపిడీగా ఇది ప్రసిద్ధకెక్కింది.
ఈ ఘటన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మండిపడింది. దోపిడీ చేసిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. చాలామంది దొరికిపోయారు. కానీ అష్ఫాక్ మాత్రం దొరకలేదు. ఎవరికీ కనబడకుండా తప్పించుకుని తిరిగాడు. బీహార్ నుంచి బనారస్‌కు వెళ్లి.. ఓ ఇంజనీరింగ్ కంపెనీలో కొన్నాళ్లు పనిచేశారు. రష్యాకు వెళ్లి అక్కడ నుంచి ఉద్యమానికి సహకరించాలనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్లారు. కానీ అక్కడ ఓ స్నేహితుడి నమ్మక ద్రోహంతో బ్రిటిష్ వారికి పట్టుబడిపోయారు. బ్రిటిష్ ప్రభుత్వం కాకోరీ కుట్ర కేసులో అష్ఫాకుల్లా ఖాన్‌కు ఉరి శిక్ష విధించారు.అలాగే అష్ఫాకుల్లా ఖాన్‌ను 1927, డిసెంబర్ 19న ఉరితీశారు.
భారత దేశం భిన్న మతాలకు, భిన్న కులాలకు వేదిక. ఎన్ని రకాల సంస్కృతులున్నా.. ఎన్ని జాతులున్నా.. అందరూ ఐక్యంగానే ఉంటారు. ఒకరికొకరు సహకరించుకుంటూ.. ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగిపోతుంటారు. అలాంటి ఈ గడ్డపై మత కలహాలు లేకపోలేదు. అయినా సరే అందరూ కలసి కట్టుగానే ఉంటారు. ఎందుకంటే భారత దేశ స్వతంత్రం కోసం పోరాడిన వారిలో అన్ని మతాలు వాళ్లు ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలు.. అన్ని రాష్ట్రాల వ్యక్తులున్నారు. అందరూ కలసి భారత దేశాన్ని బ్రిటిష్ సంకెళ్ల నుంచి విముక్తి చేశారు.ఇటువంటి స్ఫూర్తిని నేటి తరం వారసత్వంగా స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాస కర్త :యం.రాం ప్రదీప్ తిరువూరు 9492712836