అమరజీవి స్పూర్తితో…
ప్రత్యేకాంధ్ర కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణ త్యాగం చేయడంతో కర్నూలు రాజధానిగా 1953 నవంబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్ళూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు.
శ్రీరాములు మరణానంతరం ఆయన కలలుకన్న మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది.
మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన

మహనీయుడీయన.పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌన్, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది అప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా పడమటి పల్లె. ఇప్పుడు కనిగిరి తాలూకా పడమటి పల్లె ప్రకాశం జిల్లా లో ఉంది.
ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. అనంతరం బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివి “గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే” లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసారు.అప్పటిలో అతని జీతం వెలకు 250 రూపాయలు.
1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయారు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 యేండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.
పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించారు.
1943-44ల్లో నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషిచేసారు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవారు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించారు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసారు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువులు ఇచ్చింది.
గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త భయం కూడా ఉండేవి.శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారు.
జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, హరిజనోద్ధరణకు కృషిచేసారు. దీనిగురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవారు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యారు.
మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించారు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు.
రోజురోజుకూ ఆరోగ్యం క్షీణస్తూ ఉన్నా, శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకాలేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబరు 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దికొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవారు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తా పత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాకర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిష నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులు అయ్యేవి. ఎక్కిళ్ళు, తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసిపోవడం… పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబరు 5వ తేదీనాటికి ఎక్కిళ్లు, తుమ్ములు తగ్గినా శీతవిరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహారదీక్షకు కూర్చునేముందే ఆయన రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయ రసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయేవి. కొన్నికొన్ని సందర్భాల్లో నెత్తురు పడ్డది. ఇక ఆత్మార్పణ వారం రోజులు ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబరు నెల కావడంతో విపరీతంగా చలి. దాంతో, ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకోని శ్రీరాములుకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాకర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడం; ప్రభుత్వం స్పందించకపోవడం; ఆయన రోజురోజుకూ నీరసం కావడంతో ఓరోజు బులుసు సాంబమూర్తి, నరసింహలతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనం అయ్యి, స్పృహ తప్పి పోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకొన్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షను ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లరును ఆయన వ్యతిరేకించారు.చివరకు డిసెంబర్ 15 ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన స్పూర్తితో తెలుగు వారు తమ హక్కులని కాపాడుకోవాలి.
వ్యాసకర్త; యం.రాం ప్రదీప్ ,తిరువూరు 9492712836