నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం!


ప్రతిభ ఒకరి సొంతం కాదు…..

అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉండి.. అవకాశాలు, సౌకర్యాలు ఉన్న వ్యక్తి విజయం సాధిస్తే అది అంత చెప్పుకోవాల్సిన అంశం కాదు.. కానీ వైకల్యంతో అవరోధాలను, అసౌకర్యాలను ఎదుర్కొంటూ.. జీవన సోపానాలుగా మలుచుకోవడమే విశేషం. అలాంటివారు చరిత్రలో నిలిచిపోవడమే కాదు.. ఎందరికో స్ఫూర్తినిస్తారు.

నాటి ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, థామస్ అల్వా ఎడిసన్, లూయిస్‌ బ్రెయిలీ, హెలెన్‌ కెల్లర్‌, స్టీఫెన్‌ హాకింగ్‌ నుంచి నేటి నిక్‌ ఉయిచిచ్‌, ఇరా సింఘాల్‌, సుధాచంద్రన్‌, తంగవేలు, ప్రాంజల్‌ పాటిల్‌, నూతన ప్రసాద్ ఇలా ఎవరి జీవితాన్ని తీసుకున్నా స్ఫూర్తిదాయకమే.


సాధారణంగా అంగ వైకల్యం రెండు రకాలుగా వుంటుంది. మొదటిది పుట్టుకతో జన్యుపరంగా వచ్చే అవయవ లోపం కాగా,రెండవది ఏదైనా ప్రమాదం జరిగితే అవయవాలు కోల్పోవడం.ఇటువంటి వారు కాకుండా మానసిక వికలాంగులు కూడా వుంటారు. ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరికొందరు వుంటారు.
వికలాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానిచ్చి, వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడంకోసం 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలై,1998 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్3న వికాలాంగులకు సంబంధించిన ఒక అంశంతో అన్ని దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది విభిన్న ప్రతిభా వంతులు వివిధ రంగాలలో అద్భుతంగా రాణిస్తున్నారు.
తమిళనాడుకు చెందిన తంగవేలు ఐదేళ్ల వయస్సులోనే బస్సు ప్రమాదంలో అతను ఒక కాలు పోగొట్టుకున్నాడు. ఒంటరి మహిళ అయిన తల్లికి చిన్నప్పటి నుంచే చేదోడు వాదోడుగా ఉన్నాడు. 2016లో రియోలో జరిగిన పారా ఒలింపిక్స్‌లో ఫైనల్లో 1.89 మీటర్లు ఎత్తు ఎగిరి, హై జంప్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. కృత్రిమ కాలుతోనే క్రీడల్లో రాణిస్తూ ప్రపంచం మెచ్చే క్రీడాకారునిగా ఎదిగాడు.
కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్చీకి అతుక్కుపోయిన మనిషి, మాట్లాడటానికి కంప్యూటర్‌ సహాయం.. మోతార్‌ న్యూరాన్‌ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా.. చేస్తున్న పనికి శరీరం సహకరించకపోయినా స్టీఫెన్ హాకింగ్ కృష్ణ బిలాలపై చేసిన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను చూపాయి.
శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకునే తత్వం అందరికీ ఆదర్శం. సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా పేరుగాంచిన ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ఆచార్యునిగా విశేష సేవలందించారు. రాయల్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌లో గౌరవ సభ్యుడిగా, పాంటిఫికల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో జీవితకాల సభ్యునిగా పనిచేశారు. అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ అందుకున్నారు. ఆయన 2018, మార్చి 14న మనందరికీ భౌతికంగా దూరమయ్యారు. ఇంకా ఇలా ఎందరో తమ అంగ వైకల్యాన్ని అధిగమించి, వివిధ రంగాల్లో రాణిస్తున్నారు.
ప్రతి ఒక్కరిలో కుల,మతాలకతీతంగా ఎదో ఒక ప్రతిభ ఉంటుంది. అలాగని అందరూ మేధావులు ఉండరు . అంగ వికలురూ ఇతరులవలెనే అనేక పనులు సక్రమంగా చేయగలరని నిరూపణ చేస్తూనే ఉన్నారు. తెలివికి, తెలివిలేని తనానికి అంగవైకల్యానికీ సంబంధంలేదు.
ఒకపని చేయగలగడం, చేయలేకపోవడం అనేవి వ్యక్తుల సామర్ధ్యం మీద, ఆధారపడి ఉంటుంది తప్ప మరోటికాదు. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేక పొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళం అనుకోవడం సర్వసాధారణమైపోయింది. వికలాంగులు దేంట్లోనూ తీసుపోరు. వారి ప్రతిభ అనూహ్యమైనది. అందుకే వారిని విభిన్న ప్రతిభావంతులు అంటున్నాం.
ప్రస్తుతం మనం ‘వికలాంగులు ‘అనే పదం వాడటం లేదు .వారిని దివ్యాంగులు లేదా, విభిన్న ప్రతిభావంతులు అని పిలుస్తారు. .అన్నీ ఆవయవాలూ సరిగా ఉండీ శ్రమచేయగల శక్తి సామర్ధ్యాలుండీ సోమరిగా ఉండే వారే అసలైన వికలాంగులు అని చెప్పవచ్చు.
అందుకని ముందు మనలో ఉన్న ఇలాంటి అంగవైకల్యాన్ని మనంతట మనం చక్కబరచుకుని, మన అంగవైకల్యానికి ముందు వైద్యం చేయించుకుని ఆతర్వాత, ఆ అంగవికలురకు చేయకలిగిన సేవ, సహాయం వారిపట్ల మన బాధ్యతగురించీఆలోచించాలి.
పుట్టుకతో వికలాంగులైనవారికి ప్రత్యేకమైన శక్తులుంటాయనే విషయమూ సత్యదూరంకాదు. చూపులేనివారు ఒక మారు విన్న స్వరాన్ని మరోమారువినగానే ఆవ్యక్తిని గుర్తిస్తారు.ఒక మారు స్పర్శతగిలినవారినీ రెండోమారు గుర్తించగలుగుతారు.వారికి గ్రహణ శక్తీ అధికంగానే ఉంటుంది. వికలాంగ క్రీడాకారులు సాధారణ క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోకుండా ఆత్మస్థైర్యంతో కొన్ని క్రీడలలో పాల్గొంటూనె ఉన్నారు.
ఇంకా వారిని అటు సమాజమూ, ఇటు ప్రభుత్వం అన్నిరంగాల్లో రాణించ ప్రోత్సహించాలి. అవకాశాలు కల్పించాలి.ప్రపంచ జనాభాలో 15 శాతం విభిన్న ప్రతిభావంతులున్నారు. వారిని చూసి గేలి చేయకూడదు.
మనంకూడా దివ్యాంగులకు చేయూతనిద్దాం. వారికి మనవంతు సహకారాన్ని అందిద్దాం.

( యం. రాం ప్రదీప్ , తిరువూరు ,9492712836)