రాష్ట్రంలో నేరాల శాతం పెరిగింది ! కిడ్నాప్ లు 15%, దొంగతనాలు 7% పెరిగాయి !

హత్యలు, హత్యాచార కేసులు 17% తగ్గాయి!

రాష్ట్ర పోలీసు వార్షిక నివేదిక‌ లో..
విడుదల చేసిన డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి !

(J. Surender Kumar)

రాష్ట్రంలో నేరాల శాతం 4.44 కు పెరిగింద‌ని డిజిపి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విడుదల చేసిన రాష్ట్ర పోలీస్ నివేదికలో పేర్కొనబడింది..
అందులోని వివరాలు ఇలా ఉన్నాయి

సైబ‌ర్ నేరాలు 57 శాతం, దొంగ‌త‌నాలు 7 శాతం, అప‌హ‌ర‌ణ‌లు 15 శాతం పెరిగాయ‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌ పై నేరాలు 3.8 శాతం పెరిగాయ‌ని చెప్పారు. హ‌త్య కేసులు 12 శాతం, అత్యాచారాలు 17 శాతం త‌గ్గాయి. 152 కేసుల్లో నిందితుల‌కు జీవిత ఖైదు ప‌డింద‌ని తెలిపారు. డ‌య‌ల్ 100 ద్వారా 13 ల‌క్ష‌ల ఫిర్యాదులు వ‌చ్చాయ‌న్నారు. సామాజిక మాధ్య‌మాల ద్వారా 1.1 ల‌క్ష‌ల ఫిర్యాదులు రాగా, పోలీసు స్టేష‌న్ల‌లో 5.5 ల‌క్ష‌ల ఫిర్యాదు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు.


సైబ‌ర్ నేరాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశామ‌ని తెలిపారు. 15 ల‌క్ష‌ల మందికి అవ‌గాహ‌న క‌ల్పించామ‌ని చెప్పారు. గ‌స్తీ వాహ‌నాలు 7 నిమిషాల్లో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని సేవ‌లు అందించే విధంగా ఏర్పాట్లు చేశామ‌న్నారు. హాక్ ఐ ద్వారా ప్ర‌జ‌లు ఫిర్యాదు చేస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో 10 ల‌క్ష‌ల‌కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామ‌న్నారు. సీసీ కెమెరాల ద్వారా 18,234 కేసులు ఛేదించామ‌ని స్ప‌ష్టం చేశారు. వేలి ముద్ర‌ల ద్వారా ఎంతో మంది నిందితుల‌ను గుర్తించామ‌ని పేర్కొన్నారు. 10 ల‌క్ష‌ల మంది అనుమానితుల వేలిముద్ర‌ల‌ను సేక‌రించామ‌ని తెలిపారు. క‌రుడుగ‌ట్టిన నిందితుల‌పై పీడీ చ‌ట్టం ప్ర‌యోగించి నేరాలు అదుపు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ ఏడాది 431 మందిపై పీడీ యాక్ట్ ప్ర‌యోగించామ‌ని తెలిపారు.