విద్యార్థి నిరుద్యోగ సమస్య పరిష్కారానికై ఉద్యమం
ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
యాజ్ఞవల్క శుక్ల
జగిత్యాల సభలోడిక్లరేషన్.
(J. Surender Kumar)
తెలంగాణలో విద్యార్థి వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విద్యార్థి పరిషత్ జగిత్యాల డిక్లరేషన్ సాక్షిగా ఉద్యమించాలని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యజ్ఞవల్క శుక్ల అన్నారు.

ఏబీవీపీ 41 వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని రెండవ రోజు జగిత్యాల పట్టణంలో విద్యార్థి శక్తి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్క్ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పలువురు విద్యార్థి నాయకులతో పాటు ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యాజ్ఞవల్క శుక్ల మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది యువకులు ఉద్యమించారని, ప్రాణ త్యాగాలు సైతం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలించడం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యారంగ సమస్యలు పరిష్కారమవుతాయని నిరుద్యోగ సమస్య తీరుతుందని భావించిన యువతకు నిరాశ మిగిలిందన్నారు. యూనివర్సిటీలలో వీసీల నియామకం చేపట్టలేదని, పాఠశాలల్లో కళాశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనలో పూర్తిగా విఫలమై విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. హాస్టల్లో నాణ్యమైన ఆహారం లేక విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నా కలుషిత ఆహారం తిని మృతి చెందుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. .అవినీతికి అలవాటు పడ్డ కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ బీద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేశారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో నిరంకుశ,నియంతృత్వ, అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విద్యార్థి లోకం ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జానారెడ్డి, ఝాన్సీ, విద్యార్ధి నాయకులు రాపాక సాయి, పృథ్వి, శ్రీహరి, కమల్ సురేష్, రాంబాబు, మనోజ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మహా సభల ప్రాంగణం గీతా విద్యాలయం నుండి విద్యార్థి శక్తి ప్రదర్శన శుభాయాత్ర నిర్వహించారు. ఈ ప్రదర్శన పురవీధుల గుండా సాగగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. శోభాయాత్రలో ఏబీవీపీ విభాగ ప్రముఖ అన్నల్ దాస్ మురళి, నవీన్, నందు తదితరులు పాల్గొన్నారు.