భారతదేశపు తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయిని.. ఫాతిమా షేక్ జయంతి సందర్భంగా


బేటీ పడావో’కి ఆద్యురాలు ఫాతిమా బేగం….

భారతదేశంలో ముస్లింలకు ఆధునిక విద్యను అందించిన ఆద్యుడిగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, (1817 – 1898) పేరు పొందారు. ముస్లింలు ప్రగతి సాధించడానికి, ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద వాటా పొందడానికి ఆధునిక విద్య మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన భావించారు.1864లో సర్ సయ్యద్ ఒక విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, 1875 లో అలీగడ్ లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలని స్థాపించారు.


అయితే రచయిత్రి సయ్యద్ నస్రీన్ పరిశోధనల ప్రకారం అహ్మద్ ఖాన్ కంటే ముందే షేక్ ఫాతిమా బేగం, దేశంలో ముస్లింలకు ఆధునిక విద్య అందించడానికి పునాదులు వేశారు. ఫాతిమా ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలేతో కలిసి పని చేశారు. పూలే దంపతులు 1848లో పుణెలో వివక్షకు గురైన బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించారు. రెండు వందల సంవత్సరాల క్రితం మన దేశ పరిస్థితులు భిన్నంగా ఉండేవి. చాలా మంది పిల్లలకు ఐదు, ఆరు సంవత్సరాలకే పెళ్లిళ్లు జరిగిపోయేవి. కొన్ని ప్రాంతాలలో ఉన్నత కుల కుటుంబాలలో సతీ సహగమనం వంటి దురాచారాలుండగా, నిమ్న కులాల వారు అంటరానితనానికి గురయ్యేవారు. పూలే దంపతులు ఆనాటి పరిస్థితులను ఎదురొడ్డి తమ సేవా కార్యక్రమాలను కొనసాగించారు. వారు మత పెద్దల ఆగ్రహానికి గురై సంఘ బహిష్కరణకి గురికాబడ్డారు. వారికి పూలే మిత్రుడు షేక్ ఉస్మాన్ ఆశ్రయం కల్పించాడు. అక్కడ ఉస్మాన్ సోదరి ఫాతిమా తో సావిత్రికి పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఉస్మాన్  గృహంలోనే బాలికల కోసం మరో పాఠశాలను ప్రారంభించారు. షేక్ ఉస్మాన్ ప్రోత్సాహంతో ఫాతిమా ఉన్నత విద్యను అభ్యసించింది. అప్పట్లో సామాన్యులకు పాఠశాలలు ఉండేవి కావు. క్రైస్తవ మిషనరీ పాఠశాలల్లోనే ఫాతిమా చదువుకున్నారు. భర్త ప్రోత్సాహంతో సావిత్రి, అన్న సహకారంతో ఫాతిమా చదువుకొని మనదేశంలో తొలితరం మహిళా ఉపాధ్యాయులు పేరు పొందారు. ఫాతిమా భావాలు చాలా విశాలమైనది.
సయ్యద్ నస్రీన్ , ఫాతిమా పై పుస్తకాన్ని రాశారు. సావిత్రిబాయి పలు రచనలు చేసినందువల్ల ఆమె గురించి వివరాలు సేకరించేందుకు చరిత్రకారులు వీలు పడింది. “ఫాతిమా నాకు బాగా సహకరించారు. ఆమె సహకారంతో నేను సేవ కార్యక్రమాలను కొనసాగించగలిగాను” అంటూ సావిత్రి తన భర్తకు రాసిన లేఖల లో పేర్కొంది. ఫాతిమా సేవా కార్యక్రమాలపై పెట్టినంతగా సాహిత్యంపై దృష్టిపెట్టలేదు. ఆ రోజుల్లో సనాతన ముస్లింలు స్త్రీ విద్యని నిరసించినప్పటికీ ఆమె పట్టుదల అంతా ముస్లిం బాలికలని చదువుకోమని ప్రోత్సహించింది. 1831 జనవరి 9న ఫాతిమా జన్మించినట్లు చాలామంది చరిత్రకారులు భావిస్తున్నారు. సాహిత్యంపై ఫాతిమా పెద్దగా దృష్టి పెట్టకపోవడం, ముస్లిం సాహితీవేత్తలు కూడా ఆమెపై పరిశోధనలు చేయకపోవడం వల్ల ఆమె గురించి మనకు తక్కువగా వివరాలు లభ్యమవుతున్నాయి. నస్రీన్ ప్రకారం ఫాతిమా ఉర్దూలో పద్యాలు రాశారు. కులం లేని సమాజం కోసం ఆమె పరితపించారు. సుగుణభాయి, సావిత్రిబాయి, ఫాతిమాబేగంలు కలిసి బాలికా విద్యపై ఎనలేని కృషి చేశారు. బహుజనుల, ముస్లింల ఐక్యతా ఉద్యమాలకై వారు బీజం వేశారు. 1856 తర్వాత ఫాతిమా ఎక్కడ నివసించారనే విషయంపై వివరాలు దొరకడం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ పాఠ్యపుస్తకాలలో ఆమె గురించి ప్రచురించారు. ఫాతిమా బేగం స్ఫూర్తితో పాట్నా, కలకత్తాలలో ముస్లిం బాలికలకు బేగం రోకియా  సఖావత్ హుస్సేన్  పాఠశాలను ప్రారంభించారు. ఈ సంఘసంస్కర్తల కృషి ఫలితంగా బాలికల కోసం పాఠశాలలు, కళాశాలలు దేశ వ్యాప్తంగా స్థాపించబడ్డాయి. చరిత్రకారులు దృష్టి పెట్టి ఫాతిమా సమాజానికి చేసిన సేవలు మరింత వెలుగులోకి తీసుకోరావాల్సి ఉంది. ఆలస్యంగానైనా భారతదేశంలో తొలి ముస్లిం మహిళ ఉపాధ్యాయినిగా ఆమె గుర్తించడం హర్షణీయం పరిణామం.

జనవరి 9 ఫాతిమా బేగం జయంతి సందర్భంగా

వ్యాసకర్త ;యం.రాంప్రదీప్, 9492712836,
తిరువూరు.