ఫేస్ బుక్ ద్వారా విద్యార్థులకు సాయం లభించడం అభినందనీయం !

జిల్లా కలెక్టర్ రవి!

J.Surender Kumar,

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఫేస్ బుక్ మిత్రులు సైకిళ్ల పంపిణీకి సాయం చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ గుగ్లోత్ రవి అన్నారు.
ధర్మపురి, సారంగాపూర్, వెల్గటూర్ మండలాలకు చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ కోసం సాయం అందించాలని ధర్మపురి కి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ జనవరి 4 న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సైకిల్ స్టోర్ నిర్వాహకుల బ్యాంకు ఖాతాను పొందుపరిచాడు.


తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు, హైదరాబాద్, కర్ణాటక చెందిన బళ్లారి మిత్రులు స్పందించి ₹2,02000/- సాయం అందించారు. వాటితో రమేష్ 42 సైకిళ్ళ కొనుగోలు చేయగా, ధర్మపురి లోని న్యూ టీటీడీ కళ్యాణ పంటపంలో మంగళవారం కలెక్టర్ చేతుల మీదుగా వాటిని పంపిణీ చేశారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని , పేదరికం చదువుకు అడ్డు రాకూడదని అన్నారు .


ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం చేయాలని, విద్య ఉన్నవారు విద్యాదానం, డబ్బున్న వారు ఆర్థిక సాయం , తమ వద్ద ఉన్నది ఏదైనా ఇతరులకు పంచాలని సూచించారు.
ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు చేపడుతున్నప్పటికీ , సమాజంలో ఇలాంటి స్వచ్ఛంద సేవలు ఎక్కువ సంఖ్యలో చేపడితే చాలామంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.


సాయం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకొని ఇతరులకు సాయం చేసే స్థితికి రావాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ ను రమేష్ అధికారులతో కలిసి సన్మానించారు. చివరగా విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారు చదువుతున్న పాఠశాలల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు


కార్యక్రమంలో తాసిల్దార్ వెంకటేష్, దేవస్థానం ఈవో శ్రీనివాస్ , ఎస్సై కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.