సి బి ఐ.. కి ఈ.డి లేఖ!
J. Surender Kumar,
తెలంగాణాలోని ఈ గ్రానైట్ కంపెనీలపై సీబీఐ విచారణ చెయ్యాలని ఈడీ లేఖ రాసింది..
రాష్ట్రంలో గ్రానైట్ కంపెనీలపై ఈడీ అధికారులు నజర్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రానైట్ కంపెనీ అక్రమాలపై విచారణ జరిపిన ఈడీ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపించాలని సిబిఐకి మరోమారు లేఖ రాశారు. తెలంగాణా గ్రానైట్ కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం చేసే పనిలో పడ్డారు
తెలంగాణలోని శ్వేత ఏజెన్సీ, జేఎం బాక్సీ, మైధిలి ఆదిత్య ట్రాన్స్పోర్ట్, అరవింద గ్రానైట్స్ , ఎఎస్ యూవై షిప్పింగ్, పీఎస్సార్ ఏజెన్సీస్, షాండియా ఏజెన్సీస్, కే వి ఏ ఎనర్జీ , శ్రీ వెంకటేశ్వరా గ్రానైట్స్ , గాయత్రి మైన్స్ పై సీబీఐ విచారణ జరిపించాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీబీఐకి లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా పన్ను చెల్లించలేదని అభియోగాలపై సిబిఐ విచారణ జరిపించాలని ఈ డి ,సీబీఐ కు రాసిన లేఖలో పేర్కొంది.

దొంగ లెక్కలు చూపించి, తప్పుడు పత్రాలతో మైనింగ్ ఎగుమతులు చేసి కోట్లు కొల్లగొట్టినట్టు ఈడి తన లేఖలో ఆరోపించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ కంపెనీల యజమానులు, ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులకు టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే ఈడీ అధికారులు తెలంగాణ మంత్రి కీ సంబంధించిన గ్రానైట్ కంపెనీలపై, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి కి సంబంధించిన గాయత్రి గ్రానైట్స్ పై దాడులు చేసి అనేక కీలక విషయాలను సేకరించారు. ఇక ఈ క్రమంలో ఈడీ అధికారులు సీబీఐకి తెలంగాణ గ్రానైట్ సంస్థల పై విచారణ జరపాలని లేఖ రాయడం ఆసక్తిగా మారింది.
దర్యాప్తులో షాకింగ్ అంశాలు
రాష్ట్రంలోని గ్రానైట్ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో హవాలా రూపంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు గా ఈడీ గుర్తించింది. చైనా, హాంకాంగ్ కు చెందిన కంపెనీల పాత్రపై కూడా ఈడీ ఆరా తీసింది. మైనింగ్ పరిమితులు దాటి యదేచ్ఛగా గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేశారని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను కూడా ఎగ్గొట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలోని మైనింగ్ కంపెనీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కరీం నగర్ జిల్లాకు చెందిన అడ్వకేట్ భేతి మహేందర్ రెడ్డి ఆధారాలతో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
దాడులలో కీలక ఆధారాలతో.. సీబీఐ విచారణకు లేఖ!
తెలంగాణ లో ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలలో దాడులు చేసిన ఈడీ అధికారులు కరీంనగర్ లోని తొమ్మిది గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని ఏడాది క్రితమే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ శాఖ తో పాటు సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఇక ఆ ఫిర్యాదు ఆధారంగా రాష్ట్రంలో ఈడీ, ఐటి అధికారులు పెద్ద ఎత్తున దాడులు కొనసాగించారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం లోని గ్రానైట్ సంస్థలపై, యజమానులు ఇళ్లు, కార్యాలయాలపై వరుసగా సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అనేక కీలక ఆధారాలను సేకరించారు. ప్రస్తుతం ఈ ఆధారాలని బేస్ చేసుకుని సిబిఐకి మరోమారు లేఖ రాయడం, తెలంగాణ గ్రానైట్ అక్రమాలపై విచారణ జరిపించాలని చెప్పడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేకెత్తిస్తుంది.