కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉద్యోగి అరెస్ట్ !

పాకిస్తాన్ కు సమాచారం లీక్ చేసిన కేసులో

J.Surender Kumar.

న్యూఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సుమిత్ (30) బడ్జెట్ నివేదికలోని కొన్ని భాగాలను పాకిస్థాన్‌లోని వ్యక్తులతో వాట్సాప్ ద్వారా లీక్ చేశారు. అయితే బడ్జెట్‌లో ఏ భాగం లీక్ అయిందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.

వచ్చే నెల 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

గత కొన్ని నెలలుగా బడ్జెట్ తయారీలో కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. బడ్జెట్ కు సంబంధించిన సమాచారం బయటకు పొక్కకుండా ఉండేందుకు బడ్జెట్ కు సంబంధించిన పనులు చాలా గోప్యంగా జరుగుతాయి.

బడ్జెట్ తయారీలో పాలుపంచుకునే అధికారులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు ఉంటాయి. అయితే ఈసారి ఎన్ని ఆంక్షలు విధించినా బడ్జెట్ ప్రసంగంలోని కొన్ని భాగాలు పొరుగు దేశమైన పాకిస్థాన్ కు లీక్ అయ్యాయి.

ఈ సంఘటనపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.. పాకిస్థాన్‌కు ముఖ్యమైన సమాచారం ఇచ్చేందుకు సుమిత్ గూఢచారిగా వ్యవహరించాడని, అందుకోసం వారి నుంచి భారీగా డబ్బులు అందుకున్నాడని తొలి దశ విచారణలో తేలింది. సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఉపయోగించిన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందు, అతను ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేశాడా  అనే విషయంలో విచారణ కొనసాగుతున్నది. గత కొన్ని వారాలుగా సుమిత్ కార్యకలాపాలపై నిఘా వర్గాలు రహస్యంగా నిఘా పెట్టాయి. వారు ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం అతడిని అరెస్టు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేసినందుకు  కేసు నమోదైంది. సుమిత్ బ్యాంకు ఖాతాలపై సోదాలు జరుగుతున్నాయి. ఈ చట్టవ్యతిరేక చర్యలో ఇంకెవరైనా ఉన్నారా ?  అనే కోణంలో కూడా ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. అతనితో పాటు పనిచేసిన  ఉద్యోగులను విచారిస్తున్నారు.